అబ్జర్వేషన్‌: కాశ్మీర్‌లో వాళ్ళకి రక్షణేదీ.!

వాళ్ళేమీ తిండికి గతిలేక ఆయుధాలు చేతపట్టడంలేదు కదా.! వాళ్ళకేమీ కాశ్మీర్‌ ప్రజలతో వ్యక్తిగత వైరం లేదు కదా.! కానీ, ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకు.? దేశం కోసం. మరి, కాశ్మీర్‌లో ప్రాణాలు కోల్పోతున్న సైనికులు, ఇతర భద్రతా సిబ్బంది, పోలీసుల రక్షణ మాటేమిటి.? 

కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, కాశ్మీర్‌కి వెళ్ళారు. 'ఇకపై కాశ్మీర్‌లో పెల్లెట్‌ గన్స్‌ ఉపయోగించకుండా చర్యలు తీసుకుంటాం. ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నాం..' అని రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించేశారు. మంచిదే, కాశ్మీర్‌లో వున్నదీ భారత పౌరులే. ఏ ప్రభుత్వమైనా తమ పౌరుల్ని చంపుకోవాలని అనుకోకూడదు కదా. ఓ తూటా చేసే విధ్వంసం కన్నా, పెల్లెట్‌ గన్స్‌ కలిగించే నష్టం ఎక్కువైపోతోందిప్పుడు. ప్రాణం పోతే, అది ఒక్కసారే. పెల్లెట్‌ గన్‌తో అలా కాదు. శరీరం ఛిద్రమైపోతోంది.. అందులోంచి వచ్చే పెల్లెట్స్‌ ద్వారా. అది జీవిత నరకం. అందుకని, 'చిల్లీ పౌడర్‌'తో కూడిన బుల్లెట్లు వాడతారట. 

బాగు బాగు.. బహు బాగు. మరి, ఆందోళనకారుల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న సైనికులు, ఇతర భద్రతా సిబ్బంది, పోలీసుల గుచించి కూడా కాస్త ఆలోచించాలి కదా.! ఆందోళనకారులు మామూలుగా వ్యవహరించడంలేదక్కడ. తుపాకీ గుళ్ళకు ఎదురెళుతున్నారు. 'అవి ప్రాణాలు తీసే బుల్లెట్లు కావు కదా..' అన్న నిర్లక్ష్యంతో, పెల్లెట్‌ గన్స్‌కి ఎదురెళ్తున్నారు. రాళ్ళతో విరుచుకుపడుతున్నారు. పెట్రోల్‌ బాంబులతో భత్రా సిబ్బందిపై దాడులకు తెగబడ్తున్నారు. నిజం ఎప్పుడూ నిష్టూరంలానే వుంటుంది. అక్కడ జరుగుతున్నవి సాధారణ ఆందోళనలు కావు. ఓ మోస్తరు యుద్ధం జరుగుతోందక్కడ. 

పోతున్నాయ్‌.. పోతున్నాయ్‌.. ప్రాణాలు పోతూనే వున్నాయ్‌. సామాన్యుల లెక్క తేలుతోందిగానీ, పోలీసులు, భద్రతా సిబ్బంది, సైనికుల సంఖ్య లెక్క తేలడంలేదు. ఈ మధ్యకాలంలో తీసుకుంటే, దాదాపు ప్రతిరోజూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఒకరో, ఇద్దరో, ముగ్గురో భత్రా సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ లెక్కన, ఇటీవలి కాలంలో ఆందోళనల్లో మరణించిన సామాన్యులకన్నా, భద్రతా సిబ్బందే ఎక్కువన్నది నిర్వివాదాంశం. 

తీవ్రవాదులు ముందుగా ఆందోళనకారుల్ని రెచ్చగొడుతున్నారు. వేర్పాటువాదులు ఈ విషయంలో అటు తీవ్రవాదులకీ, ఇటు ఆందోళనకారులకీ మధ్య 'వారధి'లా పనిచేస్తున్నారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. తద్వారా అటు సైన్యమూ ప్రాణాల్ని కోల్పోతోంది, ఇటు కాశ్మీర్‌ ప్రజలూ ప్రాణాలు కోల్పోతున్నారు. నిరంతరం కాశ్మీర్‌ రావణకాష్టంగా రగులుతూనే వుంది. ఏంటి, దీనికి పరిష్కారం.? ప్రస్తుతానికైతే ప్రజల భద్రతకు సంబంధించి కేంద్రం తీసుకున్న చర్యలు సముచితమే. కానీ, సైన్యం, భద్రతా సిబ్బంది, పోలీసుల మాటేమిటి.? ఎప్పటికీ సమాధానం దొరకని పరిస్థితి. జై జవాన్‌.!

Show comments