అచ్చం లక్ష్మీదేవిలా కంగనా రనౌత్‌

బాలీవుడ్‌ భామ కంగనా రనౌత్‌ లక్ష్మీదేవి అవతారమెత్తింది. మోడ్రన్‌ లక్ష్మీదేవి కాదు.. నిజంగానే లక్ష్మీదేవి. పైగా, ఇదేమీ సినిమా కోసం కాదు, ఓ షార్ట్‌ ఫిలిం కోసం. స్వచ్ఛ భారత్‌ లక్ష్మీదేవిలా మారింది కంగనా రనౌత్‌. స్వచ్ఛ భారత్‌పై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకుగాను ఓ షార్ట్‌ ఫిలింని రూపొందించారు. 

ఇందులో బిగ్‌-బి అమితాబ్‌ బచ్చన్‌ కనిపించాడు. ఇషా కొప్పికర్‌, రవికిషన్‌, ఓంకార్‌ కపూర్‌ తదితరులు నటించారు. చెత్తను ఇష్టానుసారం ఎక్కడంటే అక్కడ పడేస్తే, ఇంట్లో వున్న లక్ష్మీ దేవి కూడా మాయమైపోతుందనే కాన్సెప్ట్‌తో ఈ షార్ట్‌ ఫిలింని రూపొందించడం గమనార్హం. 

చెత్తను అలా ఇంట్లోంచి పడేస్తోంటే, ఫొటోల్లోని లక్ష్మీదేవి మాయమైపోతుంటుంది. కార్‌లో వెళుతూ చెత్తని రోడ్లపై పడేస్తే, కారులో వున్న లక్ష్మీదేవి ఫొటో కూడా మాయమైపోతుంది. కాన్సెప్ట్‌ అదిరింది కదూ.! ఇప్పుడీ స్వచ్ఛ భారత్‌ లక్ష్మీదేవి ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేసేస్తోంది. ఇంటర్నెట్‌లో విడుదలైన కొద్ది గంటల్లోనే కుప్పలు తెప్పలుగా హిట్స్‌ వచ్చి పడ్తున్నాయి ఈ స్వచ్ఛ భారత్‌ లక్ష్మీదేవికి. 

ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి.. సినిమాల్లో కర్లింగ్‌ హెయిర్‌తో రఫ్‌గా కనిపించే కంగనా రనౌత్‌, లక్ష్మీదేవి గెటప్‌లో నిండుగా కన్పిస్తోంటే, అచ్చం లక్ష్మీదేవిలానే వుందనీ, లక్ష్మీదేవి అంటే ఇలానే వుంటుందేమోనని నెటిజన్లు అభిప్రాయపడ్తున్నారు. దటీజ్‌ కంగనా రనౌత్‌.

Show comments