కన్హయ్య.. మళ్ళీ వచ్చాడయ్యా.!

కన్హయ్య కుమార్‌.. ఒకప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోయిన పేరు ఇది. కొద్ది నెలల క్రితం వరకూ కన్హయ్య కుమార్‌, ఇండియాలో టాప్‌ పొలిటీషియన్లను మించిపోయి పాపులారిటీ సంపాదించేశాడు. సాదా సీదా విద్యార్థి నాయకుడు, విమానాల్లో తిరుగుతూ, భారీ కాన్వాయ్‌తో, భారీ సంఖ్యలో అనుచరులతో దేశంలోని పలు నగరాల్లో పర్యటించేశాడంటే అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. 

ఢిల్లీలోని జెఎన్‌యూ విద్యార్థి అయిన కన్హయ్యకుమార్‌పై దేశద్రోహం కేసులు నమోదవడమే ఇంత పాపులారిటీకి కారణం. టెర్రరిస్టులకు అనుకూలంగా, దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఘనుడు కన్హయ్యకుమార్‌. అమ్మాయిల్ని వేధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మగానుభావుడు. అమ్మాయిల్ని వేధించిన కేసులో యూనివర్సిటీ నుంచి శ్రీముఖం అందుకున్న మగనీయుడు కూడా. ఏం చేస్తాం, వామపక్షాలు - కాంగ్రెస్‌ కలిసికట్టుగా కన్హయ్యను పొలిటికల్‌ స్టార్‌గా మార్చేశాయి. 

నరేంద్రమోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన, నానా యాగీ చేసిన కన్హయ్యకుమార్‌, ఎక్కువకాలం తన పప్పులుడక్కపోవడంతో ఆ తర్వాత సైలెంటయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఈయనగారు తెరపైకొచ్చాడు. ఎందుకో తెలుసా.? మానవ వనరుల శాఖ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని టెక్స్‌టైల్స్‌ శాఖకు మార్చడాన్ని ప్రస్తావిస్తూ, అది తన ఘనతేనని చెప్పుకోడానికి. 

డైరెక్ట్‌గా తన గురించి చెప్పుకుంటే ఏం బావుంటుంది.? ఎంతైనా స్టూడెంట్‌ లీడర్‌ కదా, అందుకే.. హైద్రాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యతో నరేంద్రమోడీ సర్కార్‌ బెదిరిందనీ, స్మృతి ఇరానీని ఈ వివాదం కారణంగానే నరేంద్రమోడీ తొలగించారనీ కన్హయ్యకుమార్‌ సెలవిచ్చాడు. ఏం చెప్పావ్‌ బాసూ.! పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో వామపక్షాలు కన్హయ్యకుమార్‌ని మేగ్జిమమ్‌ వాడేసుకోవాలనుకున్నాయి. కాంగ్రెస్‌ కూడా అంతే. ఆ రాజకీయ ఆలోచనలతోనే, కన్హయ్య మీద బోల్డంత 'ఇన్వెస్ట్‌' కూడా చేసేసింది. ప్చ్‌, కన్హయ్య ఇమేజ్‌ గ్రాఫ్‌ పడిపోయింది. ఆయన్ని అంతా మర్చిపోయారు. 

తనను జనం మర్చిపోయాక, పబ్లిసిటీ కోసం కన్హయ్య పడని పాట్లు లేవు. ఇదిగో, ఇలా ఇప్పుడు స్మృతి ఇరానీ పదవి మార్పు పుణ్యమా అని కన్హయ్య తన గొప్పలు చెప్పుకోడానికి కలుగులోంచి బయటకొచ్చాడు. మానవ వనరుల శాఖ మంత్రిగా వివాదాలతోనే ఆమెను ఆ పదవి నుంచి తప్పించొచ్చుగాక. అదే సమయంలో, ఆమెను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించలేదు కదా.! ఏమంటావ్‌ కన్హయ్యా.!

Show comments