టాలీవుడ్ లో కామన్ క్వశ్చన్

ఎవరైనా వైట్ కావాల్సిన వాళ్లు తెలుసా? బ్లాక్ వుండిపోయిన వాళ్లుంటే చెప్పండి..వైట్ ఇప్పిద్దాం. కానీ థర్టీ పర్సంట్ వరకు అవుతుంది.

ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో లేటెస్ట్ బిజినెస్ ఆపర్ట్చూనిటీ. చిత్రమేమిటంటే వాళ్ల దగ్గర వుండిపోయింది..వీళ్ల దగ్గర వుండిపోయింది అని అనుకోవడమే కానీ, క్లారిటీగా బ్లాక్ ఎక్కడ వుండిపోయిందో తెలియకపోవడం. ఇంకో ముచ్చట ఏమిటంటే, ఏటీఎమ్ లు, బ్యాంక్ లు డబ్బుల్లేక వెలవెల పోతుంటే, థర్టీ పర్సంట్ కమిషన్ పై వైట్ ఇస్తామని ఎలా ముందుకు వస్తున్నారన్నది.

ఎలాగూ ఇప్పుడు సినిమాల హడావుడి లేదు. సందడి లేదు. కనీసం ఇలాంటి డీల్ ఒక్కటి సెట్ చేసుకోగలిగితే, లైఫ్ సెటిల్ అయిపోతుందనే టైపులో ఎవరికి వారు కిందామీదా అవుతున్నారు.. కానీ మాటలు ఎక్కువ వినిపిస్తున్నాయి. డీల్ కుదిరిన దాఖలాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఓ పది కోట్ల డీల్ కుదిర్చగలిగితే 50 లక్షల కమిషన్ చేతిలో పడుతుంది కదా అనే ఆశతో చాలా మంది మాటల గేలాలు పట్టుకుని, నల్ల చేపల కోసం తిరుగుతున్నారు.

మీడియాలో ఇంకోపక్క నోట్ల రద్దు అగచాట్లపై నానా రచ్చ జరుగుతోంది. దీంతో ఏ వెసులుబాటు వస్తుందో అని నల్ల డబ్బు కుబేరులు ఆశగా వున్నారు. పైగా డిసెంబర్ 31 వరకు టైమ్ వుంది కనుక, ఈ థర్టీ పర్సంట్ బదులు కాస్త దిగివస్తే చూద్దాం అన్న ఆశతో వున్నట్లు కనిపిస్తోంది. దాంతో టాలీవుడ్ లో ఇప్పుడు ఇదో కొత్త వ్యవహారంగా మారినట్లు కనిపిస్తోంది.

Show comments