ఉద్దానం కన్నీటి గాధ.. జనసేన డాక్యుమెంటరీ.!

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ పుణ్యమా అని మరోసారి వార్తల్లోకెక్కింది. రేపు పవన్‌కళ్యాణ్‌, శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఇచ్చాపురంలో ఉద్దానం కిడ్నీ బాధితులతో సమావేశమవుతారు. అయితే, బాధితులు వేలాది మంది వుండటంతో, అందరి దగ్గరకూ వెళ్ళి పరామర్శించే వీలు లేదనీ, ఆ కారణంతోనే కొందర్ని ఎంపిక చేసి వారందరినీ ఒక్క చోటకు చేర్చి, పవన్‌కళ్యాణ్‌తో ముఖాముఖి ఏర్పాటు చేశామని జనసేన పార్టీ వర్గాలంటున్నాయి.

మరోపక్క, జనసేన పార్టీ ఉద్దానం కన్నీటి గాధపై ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. నిజానికి ఇందులో కొత్తదనం ఏమీ లేదు. ఆ మాటకొస్తే, కొత్తదనాన్ని ఆశించడానికీ ఏమీ లేదక్కడ. ఎన్నో ఏళ్ళుగా ఉద్దానం ప్రాంతం కిడ్నీ బాధితులతో తల్లడిల్లిపోతోంది. తెలుగు మీడియాకి సంబంధించినంతవరకు ఈ ప్రాంతం వెతల్ని కవర్‌ చేయని ఛానల్‌ లేదు.. పత్రికా లేదు. ఆ మాటకొస్తే, జాతీయ మీడియా, అంతర్జాతీయ మీడియా కూడా ఉద్దానం కన్నీటి గాధపై ఎన్నో కథనాల్ని తెరపైకి తెచ్చింది. 

వైద్యులు వచ్చిన ప్రతిసారీ, రాజకీయ ప్రముఖులు వచ్చిన ప్రతిసారీ ఉద్దానం వారికి కన్నీటితో స్వాగతం పలుకుతూనే వుంది.. కానీ, వారి ఆవేదన మాత్రం తీరడంలేదు. అసలు, సమస్య ఎక్కడ వుందో కూడా ఇప్పటిదాకా తెలియని పరిస్థితి. దాంతో, ఉద్దానంపై కథనాలు, డాక్యుమెంటరీలు.. ఇవన్నీ కన్నీటి గాధలుగానే మిగిలిపోతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌, ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన వీడియో కూడా.. అలాంటి కన్నీటి గాధల సమాహారమే. ఈ డాక్యుమెంటరీల పరంపర.. ఈ కథనాల పరంపర.. ఎప్పుడు ఆగుతుందో, ఉద్దానంలో ఒకనాటి ఆనందం ఎప్పుడు కన్పిస్తుందో ఏమో.! 

ఇక, పవన్‌కళ్యాణ్‌ విషయానికొస్తే, పెద్ద పాత నోట్ల రద్దుపై సోషల్‌ మీడియాలో స్పందించి ఊరుకున్నారు. ఇతరత్రా సమస్యలపైనా జస్ట్‌ అలా స్పందించి ఊరుకున్నారంతే. ఇప్పుడీ డాక్యుమెంటరీ, రేపటి ఉద్దానం పర్యటన తర్వాత ఉద్దానం కిడ్నీ బాధితుల్ని వ్యక్తిగా అయినా ఆదుకునేందుకు ఆయన ఏమైనా కార్యాచరణ ప్రకటిస్తారా.? లేదంటే, జస్ట్‌ ఓ పొలిటికల్‌ స్టంట్‌లా ఈ వ్యవహారాన్ని ఆయన కూడా సరిపెట్టేస్తారా.? వేచి చూడాల్సిందే.

Show comments