ఇంకో 15 రోజులు.. నడిరోడ్డుపైనే.!

ఓ తెలుగు సినిమాలో డైలాగుంటుంది.. ఒక రోజు, రెండ్రోజులు కష్టపడక తప్పదు.. ఆ తర్వాత అలవాటైపోతుందని. దేశ ప్రజానీకం పరిస్థితి అదే. 'జస్ట్‌ రెండ్రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి..' అని నవంబర్‌ 8న ప్రధానమంత్రి నరేంద్రమోడీ పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత తలెత్తే సంక్షోభం గురించి చెప్పారు. కానీ, మూడో రోజు సాయంత్రానికి పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా తయారైంది. ఆ తర్వాత నాలుగో రోజుకి మరీనూ. వారం గడిచింది సేమ్‌ సీన్‌.. పది రోజులు అదే అధ్వానం.. నెల రోజులు, ఇంకా దయనీయం.! ఇప్పుడిక అలవాటైపోయిందంతే.! 

ప్రజలు ఇంత కష్టాన్నీ భరిస్తున్నారంటే, నరేంద్రమోడీ చెప్పిన మాటలు నిజమయి, నల్లధనం బయటకొచ్చి, దేశం బాగుపడ్తుందేమోనన్న ఆశతో మాత్రమే. కానీ, వారి ఆవేదనను తక్కువగా చూస్తే ఎలా.? ఓహో, జనం బ్యాంకుల్ని బద్దలుగొట్టాలేమో.! రోడ్లపై వెళుతున్న వాహనాల్ని ధ్వంసం చేయాలేమో.! క్యూ లైన్లలో అత్యంత దయనీయ పరిస్థితుల్లో తమ కష్టార్జితాన్ని బ్యాంకుల నుంచి రాబట్టుకోవాలనుకోవడం 'చేతకానితనం'గా మారిపోయింది. 

50 రోజుల్లో పరిస్థితి చక్కబడుతుంది.. అంటూ కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీ సెలవిచ్చారు. రోజురోజుకీ పరిస్థితి మెరుగుపడాలి కదా.? రోజులో 24 వేల వరకూ తీసుకోవచ్చు.. అని రిజర్వు బ్యాంకు చెప్పింది. కానీ, బ్యాంకులు ఆ మాటని ఎక్కడ పాటిస్తున్నాయట.! కొన్ని బ్యాంకులు బిచ్చం వేసినట్లు, 2 వేల రూపాయలు మాత్రమే ఇస్తోంటే, ఇంకొన్ని బ్యాంకులు 4 వేల రూపాయలతో సరిపెడ్తున్నాయి. 30 రోజుల తర్వాతి పరిస్థితి ఇది. 

ఇంకో పదిహేను రోజుల్లో పరిస్థితి సాధారణ స్థాయికి వస్తుందన్నది కేంద్రం చెబుతున్న తాజా మాట. నమ్మగలమా.? ప్చ్‌, నమ్మే పరిస్థితులు అయితే లేవు. ఏటీఎం మెషీన్లు దిష్టిబొమ్మల్లా తయారయ్యాయి. బ్యాంకులు అసలు ఎందుకు.? అన్నట్లుగా మారిపోయాయి. మొత్తంగా ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయంగా మారిపోయింది. డబ్బులుండీ జనాన్ని బిచ్చగాళ్ళుగా మార్చేసింది నరేంద్రమోడీ సర్కార్‌. ఏమన్నా అంటే, 'దేశభక్తి..' అంటూ కొత్త పలవి.! 

పార్లమెంటుకొచ్చి, ప్రతిపక్షానికి సమాధానం చెప్పలేని దయనీయ స్థితుల్లో వున్న ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని ఎలా ఉద్ధరిస్తారట.? రెండ్రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ముగిసిపోతాయి. మంగళ, బుధవారాలతో ఆ పుణ్యకాలమూ పూర్తయిపోయింది. ఇక, ఆ తర్వాత నరేంద్రమోడీ సర్కార్‌ని ప్రశ్నించేదెవడు.? అదే ధీమా, తప్పించుకు తిరుగువాడు అచ్చంగా మన నరేంద్రమోడీ.!

Show comments