'తప్పయిపోయింది.. నన్నొదిలెయ్యండి..'

అమ్మాయిలెందుకు పనికొస్తారు.? అన్న ప్రశ్నకి, 'పక్కలో పడుకోడానికి..' అని సమాధానమిచ్చి వివాదాల్లోకెక్కారు సీనియర్‌ నటుడు చలపతిరావు. ''ఎంతైనా సినిమాల్లో ఎక్కువగా రేపిస్టు క్యారెక్టర్లు చేసేశారు కదా, బహుశా ఆ ప్రభావం ఆయన మీద చాలా ఎక్కువగా వున్నట్లుంది.. ఈ వయసులో ఇంత 'మదం' దుర్మార్గం..'' అంటూ మహిళా సంఘాలు గళం విప్పాయి. 

ఓ ఛానల్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమానికి హాజరైన చలపతిరావు, తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకోవాలనుకున్నారు.. ఇచ్చే ప్రయత్నమూ చేశారు. అసలు 'పక్క' అన్న పదానికి అర్థం వేరే వుందని చెబుతూ, అందులో వివాదమేమీ లేదనీ బుకాయించేందుకు నానా తంటాలూ పడ్డారు. కానీ, కుదరలేదాయె. చివరికి, చలపతిరావు మెట్టు దిగారు. 'నేను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నాను. ఇంకెప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయను. అసలు సినిమా ఫంక్షన్లకే హాజరు కాను..' అంటూ లెంపలేసుకున్నంత పన్జేశారు. 

ఆసక్తికరమైన విషయమేంటంటే, రియాల్టీ షోలు, కామెడీ షోలలో ఏం జరుగుతోంది.? అక్కడ జరుగుతున్నదీ ఇదే కదా.! అంటూ చలపతిరావు వ్యవహారాన్ని సైడ్‌ ట్రాక్‌ చేసేందుకు ప్రయత్నించారు. నిజమే, కామెడీ షోల పేరుతో జరుగుతున్నదీ అరాచకమే. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా కొన్ని స్కిట్స్‌ రూపొందుతున్నాయి. అయితే, సినిమాలతో పోల్చినప్పుడు అవన్నీ చాలా చాలా చిన్న విషయాలే. 

సినిమాల్లోనూ, స్కిట్స్‌లోనూ పాత్రల స్వభావం నేపథ్యంలో అదంతే.. అని సరిపెట్టుకోవచ్చుగాక. కానీ, లైవ్ ప్రసారాలు జరుగుతున్నప్పుడు, సభ్య సమాజం తమని చూస్తున్నప్పుడు.. ఇలా నోరు పారేసుకోవడమేంట.? దీనికి చలపతిరావు సమాధానం మరీ కామెడీగా వుంది. 'ఏదో జోవియల్‌గా అలా..' అని సెలవిచ్చారాయన. జోవియల్‌గా అంటే, ఇంతలా దిగజారిపోవాలా.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 

ఒక్కటి మాత్రం నిజం. గతంలో ఇలా ప్రత్యక్ష ప్రసారాలుండేవి కావు. ఆయా సినీ ఫంక్షన్ల కవరేజ్‌ వేరేలా వుండేది. ఇప్పుడు రూటు మారింది. కాబట్టి, జాగ్రత్త అవసరం. యాంకర్లు సెటైర్ల పేరుతో రెచ్చిపోవడం, ఆ ఊపులో సినీ ప్రముఖులు నోరు జారేయడం సర్వసాధారణమైపోయింది. ఈ పైత్యానికి ఫుల్‌ స్టాప్‌ పడటం అంత వీజీ కాదు.

Show comments