అదే నిజమైతే చంద్రబాబు పరిస్థితేంటి.?

500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్న విషయం విదితమే. ఆ మధ్య వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కూడా కేంద్రానికి ఇదే విషయమై లేఖ రాశారు కూడా. ప్రధాని నరేంద్రమోడీ, ఎవరి మాటల్ని పరిగణనలోకి తీసుకున్నారోగానీ, 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి 2000 రూపాయల నోట్లను తీసుకొచ్చారు. దాంతో, 'ఆ ఘనత నాదే' అంటూ నోట్ల రద్దుపై తొందరపడి 'స్వాగతించేసిన' చంద్రబాబు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యింది. 

ఇక, ఇప్పుడు ఇంకో గాసిప్‌ సర్క్యులేట్‌ అవుతోంది రాజకీయ వర్గాల్లో. మోడీ మదిలో అసలు నోట్ల రద్దు అనే అంశమే లేదనీ, నోట్ల మార్పిడితోపాటు, పెద్ద నోటుని ఇంకా ఇంకా పెద్దది చేయాలనే ఆలోచన వుందనీ ఆ గాసిప్‌ సారాంశం. 'అంతకు మించి' అంటే, బహుశా 5000 రూపాయల నోటు కావొచ్చు. ఇంకా పెద్దదంటే 10000 రూపాయల నోటు కావొచ్చుమో. ఇప్పటికి ఇది జస్ట్‌ గాసిప్‌ మాత్రమేననుకోండి.. అది వేరే విషయం. 

అయినాసరే, ఎవరనుకున్నారు పెద్ద నోట్లు రద్దు అంశం తెరపైకి వస్తుందనీ, ఇంకా పెద్ద నోటు పుట్టుకొస్తుందనీ.? వచ్చేసింది కదా.! ఏమో, రేప్పొద్దున (ఇంకో మూడు నెలల్లోనో, ఆరు నెలల్లోనో కావొచ్చు) 5000 నోటు, 10000 నోటు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అదే గనుక జరిగితే, చంద్రబాబు పరిస్థితేంటట.? 2000 రూపాయల నోటు రద్దు చేయాలంటూ, చంద్రబాబు తెగ గుస్సా అయిపోతున్నారు. ప్చ్‌, మిత్రుడు చంద్రబాబు మాటల్ని ప్రధాని నరేంద్రమోడీ కనీసం లెక్కచేయట్లేదాయె.! 

ప్రత్యేక హోదా కోసం కాకపోయినా, ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో అయినా అప్పుడు చంద్రబాబు, నరేంద్రమోడీతో తెగతెంపులకు సిద్ధమవుతారా.? షరా మామూలుగానే కుయ్యో మొర్రో అంటూ సర్దుకుపోతారా.? వేచి చూడాల్సిందే. 

Show comments