నాది కాదు.. నాకు సంబంధించినదే.!

నాది కాదు.. నాకు సంబంధించినదే.. అని ఎవరన్నా అంటే ఎలా వుంటుంది.? ఒళ్ళు మండిపోతుంది కదా.! కానీ, మండకూడదు.. ఎందుకంటే, ఆయనగారు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు, పైగా పార్లమెంటు సభ్యుడు. ఆయనగారు ఎవరో కాదు, రాయపాటి సాంబశివరావు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల 'జీవనాడి' అంటూ పోలవరం ప్రాజెక్టు గురించి ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా వుంది. అంటే, ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదే. కానీ, కేంద్రం పోలవరం ప్రాజెక్టు విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడటంలేదు. అదిగో, రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చూపించడంలేదని చేతులు దులుపుకుంటోంది. 

ఇక, ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని పొందిన సంస్థ స్వయానా రాయపాటి సాంబశివరావుకి చెందినదే. కానీ, ఆయన ఆ సంస్థ తనది కాదంటున్నారు, అంతలోనే అది తనకు సంబంధించినదేనని చెబుతున్నారు. దీని భావమేమి తిరుమలేశా.? అని ఏడుకొండలవాడ్ని ప్రశ్నించాలేమో. అన్నట్టు, రాయపాటి.. ఏడుకొండలవాడికి వీర భక్తుడు.. టీటీడీ ఛైర్మన్‌గిరీ ఆయన జీవిత లక్ష్యం. ప్చ్‌, ఆ వెంకన్నబాబు - రాయపాటి జీవితాశయాన్ని నెరవేర్చడంలేదు. ఎలా నెరవేరుస్తాడు.? ఇదిగో, ఇలాంటి అర్థం పరథం లేని మాటల్ని చెబుతోంటే.! 

పోలవరం ప్రాజెక్టు 2018 నాటికి పూర్తయిపోతుందట. ఎలగెలగ.? ఇప్పటిదాకా ఎంత పూర్తయ్యిందో చెప్పుకోండి చూద్దాం.! జస్ట్‌, 17 శాతం పనులు మాత్రమే ఇప్పటిదాకా పూర్తయ్యాయట. అసలు పనులు ఇంకా ప్రారంభం కాలేదు. కానీ, 2018 నాటికి పూర్తి చేసేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఆయనకేం సంబంధం, అది జాతీయ ప్రాజెక్ట్‌ అయితే.! 

పోనీ, కేంద్రం మద్దతుతో చంద్రబాబే యజ్ఞంలా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసెయ్యాలనుకుంటున్నారని అనుకుందాం.. అదే నిజమైతే, ఆయన ముందుగా రాయపాటి సాంబశివరావుని హెచ్చరించాలి. అదే సమయంలో కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. రెండూ జరగవు. ఇంకో కామెడీ ఏంటంటే, చైనా నుంచి 1500 నిధులు రానున్నాయనీ, వాటితో పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచుతామని రాయపాటి సాంబశివరావు చెప్పుకొచ్చారు. 

అదిరిందయ్యా రాయపాటి.. ముందేమో సంబంధం లేదంటావ్‌.. ఆ తర్వాత సంబంధం వుందంటావ్‌.. ఏందీ లొల్లి.?

Show comments