చినబాబు 'షో' షురూ.!

మంత్రి హోదాలో తొలిసారి నారా లోకేష్‌ ఢిల్లీకి వెళుతున్నారు. ఢిల్లీలో పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో అధికారిక భేటీలు నిర్వహిస్తారట. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ పరిశ్రమను విస్తరించేందుకోసం దేశవ్యాప్తంగా వున్న పలు ఐటీ సంస్థలకు చెందిన సీఈఓలతో 'చినబాబు' సమావేశమవుతారట. 

కేంద్ర - రాష్ట్ర సంబంధాల బలోపేతం, అలాగే బీజేపీ - టీడీపీల మధ్య మరింతగా మైత్రీ బంధం పెరిగేలా చేయడం.. ఇలా పెద్ద 'పని' పెట్టుకునే చినబాబు ఢిల్లీకి పయనమవుతున్నారన్నది టీడీపీ నేతలు చెబుతున్నమాట. చంద్రబాబు ప్రస్తుతం అమెరికా పర్యటనలో బిజీగా వున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు లేని లోటుని నారా లోకేష్‌ పూడ్చేయనున్నారు. అసలు, చంద్రబాబు వ్యూహమే అది. బీజేపీ - టీడీపీ మధ్య 'గ్యాప్‌' పెరుగుతుండడం చంద్రబాబుకి క్లియర్‌గా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే చాలా జాగ్రత్తగా ఆలోచించి లోకేష్‌ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఢిల్లీ పెద్దలతో రెగ్యులర్‌గా టచ్‌లో వుండేందుకు చంద్రబాబుకి ఇదో అనువైన మార్గం. మంత్రులకెలాగూ అధికారిక పర్యటనలుంటాయి గనుక.. ఆ కోటాలో నారా లోకేష్‌ని ఢిల్లీకి పంపించడం ద్వారా ఢిల్లీకీ - అమరావతికీ మధ్యన గ్యాప్‌ వుండకుండా చంద్రబాబు భలే స్కెచ్‌ వేశారన్నమాట. 

అంతా బాగానే వుందిగానీ, ఢిల్లీ టూర్‌లో నారా లోకేష్‌ బీజేపీ - టీడీపీ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయగలుగుతారా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఇక, ఐటీ విషయానికొస్తే.. చంద్రబాబుకి మించిన స్థాయిలో లోకేష్‌ మాటలు చెబుతున్నారు. ఐటీ మంత్రిగా, వచ్చే రెండేళ్ళలో ఐటీ రంగంలోనే లక్ష ఉద్యోగాల్ని సృష్టిస్తానని లోకేష్‌ చెబుతున్న విషయం విదితమే. 'పని' ఇప్పుడు మొదలైతే, ఇంకో నాలుగైదేళ్ళకుగాని ఫలితాలు వచ్చే పరిస్థితి లేదన్నది ఓపెన్‌ సీక్రెట్‌. అయినా, లోకేష్‌ అలా అలా చెబుతుంటారంతే. 

ఇదిలా వుంటే, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపైనా చినబాబు ఢిల్లీ టూర్‌లో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చిస్తారట. ఇది ఇంకా పెద్ద కామెడీ. ఎందుకంటే, 'కేంద్రంతో తగాదా పడలేం.. హోదా ఇవ్వలేదని పోరాడలేం..' అని మొన్నీమధ్యనే చావుకబురు చల్లగా చెప్పారు చినబాబు. సో, నారా లోకేష్‌ ఢిల్లీ టూర్‌, జస్ట్‌ చంద్రబాబు తరహా 'షో' కానుందంతే. సింపుల్‌గా చెప్పాలంటే, ఖర్చు దండగ వ్యవహారమది.

Show comments