తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ విషయంలో ముందుగా జరిగిన ప్రచారమే నిజం అనుకోవాల్సి వస్తోంది! మంత్రి పదవి దక్కడం లేదని ఆయన అసహనంతో ఉన్నాడని వచ్చిన వార్తలు వస్తావమే అనుకోవాల్సి వస్తోంది. ముందుగా జరిగిన ఆ ప్రచారం ఏమనగా.. మంత్రి పదవి మీద లోకేష్ చాలా ఆసక్తిని పెంచుకున్నాడనేది! దాన్ని దక్కించుకోవడానికి లోకేష్ బాబుపై ఒత్తిడి తెస్తున్నాడని.. ఈ పనిలో లోకేష్ భార్య బ్రహ్మణి కూడా భాగస్వామి అయ్యిందని ప్రచారం జరిగింది.
ఆ మధ్య జరిగిన తెలుగుదేశం కార్యకర్తల శిక్షణా శిబిరానికి కూడా లోకేష్ తొలి రెండు రోజులూ హాజరు కాకపోవడంతో ఈ ప్రచారానికి మరింత ఊతం లభించింది. అయితే.. అదంతా ‘సాక్షి’ పని అని లోకేష్ బాబు ఖండించాడు. లోకేష్ గైర్హాజరి గురించి తెలుగుదేశం నేతలు అలాంటి లీకులు ఇచ్చి.. జగన్ పత్రికను తిట్టించారు. ఆ సంగతలా ఉంటే.. ఈ మంత్రి పదవి వ్యవహారం గురించి లోకేష్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
‘మంత్రి పదవిని తీసుకోకుంటే.. అసమర్థుడు అని అనుకుంటారని, పార్టీలోని సీనియర్ నేతలు నాతో చెప్పారు..’’ అని లోకేష్ వ్యాఖ్యానించాడు. సీనియర్లను ఉటంకిస్తూ.. లోకేష్ ఈ మాటలు చెప్పినా, ఇది ఆయనలోని ఇన్ ఫిరియారిటీ కాంప్లెక్స్ ను చాటుతోందని స్పష్టం అవుతోందని విశ్లేషకులు అంటున్నారు.
పార్టీలోని చాలా మంది చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు, అయితే మంత్రి పదవి విషయంలోని మాటనే లోకేష్ చెప్పడం.. ‘మంత్రి పదవిని తీసుకోకుంటే అసమర్థుడు అనుకుంటారు..’’ అని అనడం మాత్రం పరోక్షంగా మనసులోని భయాన్ని వ్యక్తం చేసినట్టుగా అవుతోంది. ఒకవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు అనతికాలంలోనే దూసుకుపోతున్నాడు. కేసీఆర్ వారసత్వానికి కేటీఆర్ న్యాయం చేయగలడు అనే కితాబులు పొందుతున్నాడు.
మరి లోకేష్ బాబు పరిస్థితి చూస్తే.. అవినీతి ఆరోపణలు, రాజ్యాంగేతర శక్తి.. అనే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబు ఇంట లోకేష్ –బ్రహ్మణిల అసంతృప్తి వ్యక్తం అవుతోందనే ప్రచారం మొదలైంది. అందరూ ‘అసమర్థుడు’ అనుకుంటారనే.. ఆ దంపతులు లోకేష్ కు పదవి విషయంలో బాబుపై ఒత్తిడి తెచ్చారనే మాట అప్పట్లోనే వినిపించింది. ఆ మాట తనతో తెలుగుదేశం నేతలే అన్నారని లోకేష్ ఇప్పుడు చెబుతున్నాడు. అప్పట్లో ఈ వ్యవహారాన్ని లీకులిచ్చింది కూడా సదరు తెలుగుదేశం నేతలే అని ఇప్పుడు స్పష్టం అవుతోంది.
ఏతావాతా.. మంత్రి పదవిని తను చేపట్టకపోతే.. జనాలు ఏమనుకుంటారో ఉన్న అభిప్రాయాలను లోకేషే చెప్పాడు కావున.. తెలుగుదేశం అధినేత వీలైనంత త్వరగా లోకేష్ ‘సమర్థత’ ను నిరూపించుకునే అవకాశం ఇస్తే మేలేమో! ముఖ్యమంత్రి పీఠం మాత్రం లోకేష్ కు ఇప్పుడే వద్దట.. ఇంకా పాతికేళ్ల రాజకీయ జీవితం ఉందట.. అవసరమైనప్పుడు దాన్ని చేపడతాడట!