విశ్వనాథ్‌ అంటే టాలీవుడ్‌కు ఎంత గౌరవమో?

కళాతపస్వి విశ్వనాధ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వచ్చింది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మెగాస్టార్‌ చిరంజీవి, బన్నీ, జర్నలిస్టులు, మంత్రి తలసాని వెళ్లి అభినందించి వచ్చారు. మరి ఇంకా ఎవరు వెళ్లారో పత్రికల్లో రాలేదు కాబట్టి తెలియదు. ఇన్నాళ్లకు విశ్వనాధ్‌కు ఓ మంచి అవార్డు వచ్చింది. ఇప్పటి వరకు ఆయనను పద్మశ్రీతోనే సరిపెట్టారు. ప్రతిభా పాటవాలతో పోల్చుకుంటే, ఆయనతో సరిపోలని వారికి ఎందరికో అంతకన్నా గొప్ప అవార్డులే ఇచ్చారు. సరే, ఆలస్యంగానైనా న్యాయం జరిగింది. 

అయినా టాలీవుడ్‌ మాత్రం స్పందించాల్సిన రేంజ్‌లో స్పందించిందా అని అనుమానంగానే వుంది. ఇదే ఇంకే దర్శకుడికి అయినా అయితే వ్యవహారం వేరుగా వుండేదేమో? సినిమా రంగం మొత్తం ఆ దర్శకుడి ఇంటి ముందు బారులు తీరేదేమో? ప్రభుత్వం కూడా పనిలో పనిగా, ఇదే అవకాశం అని వేరే నజరానాలు ప్రకటించేదేమో?  కానీ కాశీనాధుని విశ్వనాధ్‌ కదా? అందుకే అలా జరగలేదు.

విశ్వనాధ్‌కు అవార్డు వచ్చాక, జనానికి మరోసారి శంకరాభరణం గుర్తుకు వచ్చింది. నిజానికి గత ఏడాదికి శంకరాభరణానికి పాతికేళ్లు పూర్తయ్యాయి. మూడు పాటలు, ఆరు ఫైట్లు, చవకబారు డైలాగుల సినిమాలు అన్నింటికీ పాతికేళ్లయ్యాయి, నలభై ఏళ్లు అయ్యాయి. అని ట్వీట్‌లు చేసే వాళ్లకి శంకరాభరణం మాత్రం గుర్తుకురాలేదు.

కానీ పాతికేళ్ల క్రితం శంకరాభరణం సినిమాను నెత్తిన పెట్టుకున్న తమిళనాడు జనాలు మాత్రం ఆ సినిమాను అపూర్వంగా ఆదరించారు. శంకరాభరణం సినిమాను మళ్లీ కొత్తగా డిజిటల్‌ కలర్‌ కరెక్షన్‌ చేయించారు. కొత్తగా విడుదల డేట్‌ ప్రకటించారు. కొత్తగా అడియో ఫంక్షన్‌ చేసారు. కొత్తగా ప్రివ్యూ వేసారు. తమిళ సినిమా పెద్దలు అంతా ఆ ప్రివ్యూకు హాజరయ్యారు. అదీ ఆ సినిమాకు తమిళనాట లభించిన ఘనత. 

మరి మన దగ్గర తమకు సంబంధాలు వున్న సినిమా, తమ వాళ్ల సినిమా అనుకుంటూ సినిమాలను నెత్తిన పెట్టుకునే వాళ్లకి శంకరాభరణం కనిపించనే లేదు.  విశ్వనాధ్‌ గుర్తుకు రానే లేదు.

అలాంటిది ఇప్పుడు విశ్వనాధ్‌ మాత్రం గుర్తుకువస్తారా? దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అని మిగిలిన సీనియర్‌ దర్శకులు లేదా, సీనియర్‌ నటులు లేదా సీనియర్‌ నిర్మాతలు ఎందరు ఆయనను అభినందించారో లెక్క వేసుకోండి..చూసుకోండి. సన్మానాలు సత్కారాలు ఏమైనా చేసారేమో గమనించండి. అప్పుడు అర్థం అవుతుంది. తెలుగు ఇండస్ట్రీకి విశ్వనాధ్‌ అంటే ఏపాటి గౌరవం వుందో?

ఏదో ఈసారి మోడీ ప్రభుత్వం కాస్త పద్దతిగా అవార్డుల ఎంపిక సాగిస్తూ వచ్చింది కాబట్టి విశ్వనాధ్‌కు అవార్డు వచ్చింది. అదే సంతోషం. 

-ఆర్వీ

Show comments