చంద్రబాబూ.. ఈ ప్రశ్నకి బదులేది.?

వాకాటి నారాయణరెడ్డి... శేఖర్‌రెడ్డి.. సుజనా చౌదరి.. గంటా శ్రీనివాసరావు.. ఇందులో ముగ్గురు టీడీపీ నేతలు. ఒకరేమో, తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. శేఖర్‌రెడ్డి మొన్నామధ్య పెద్ద పాత నోట్ల రద్దు సమయంలో, ఐటీ శాఖకు అడ్డంగా దొరికేశారు. కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు వెలుగు చూశాయి ఆయనగారి దగ్గర. ఆయనకీ, టీడీపీకీ లింకేంటంటారా.? ఆయనగార్ని, టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించిందెవరు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబే కదా.! 

శేఖర్‌రెడ్డి నోట్ల కట్టల వ్యవహారం వెలుగు చూశాక, ఆయన్ని టీటీడీ బోర్డు సభ్యత్వ పదవి నుంచి తొలగించారు చంద్రబాబు. తాజాగా, టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిపై ఏకంగా సీబీఐ దాడులు జరిగాయి. దాంతో షరామామూలుగానే చంద్రబాబు, వాకాటిని పార్టీ నుంచి తొలగించేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 'నేరం నిరూపణ అయితే, ఇంకా కఠిన చర్యలుంటాయి..' అని చంద్రబాబు తనదైన స్టయిల్లో వ్యాఖ్యానించేశారండోయ్‌.! 

వాకాటిపై వున్న ఆరోపణ ఏంటంటే, అప్పులు తీసుకుని, బ్యాంకులకు చెల్లింపులు ఎగ్గొట్టారాయన. ఆగండాగండీ, ఇదే తరహా కేసు కేంద్ర మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరిపైన కూడా వున్నాయి కదా.? ఓ దశలో ఆయనపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ కూడా జారీ అయ్యింది. చిత్రంగా ఆ కేసు అనూహ్యంగా అటకెక్కింది. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపైనా ఇవే తరహా ఆరోపణలొచ్చాయి. సుజనా చౌదరిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయలేదు, పైగా రెండోస్సారి రాజ్యసభకు పంపి, కేంద్ర మంత్రిగా ఆయన్ని కొనసాగించారు చంద్రబాబు. గంటా శ్రీనివాసరావుని సైతం మంత్రి వర్గం నుంచి తొలగించలేదాయె.! 

వాకాటికి అలా, సుజనా చౌదరి - గంటా శ్రీనివాసరావు విషయంలో ఇంకొకలా.? ఏంటీ మతలబు.! చంద్రబాబూ ఈ ప్రశ్నకు బదులేది.? ఆ సమాధానం దొరకదు గాక దొరకదు. విశాఖలో వెలుగు చూసిన 'హవాలా కుంభకోణం' గురించి ఈ రోజు ప్రస్తావించిన చంద్రబాబు, 'జగన్‌ లాంటి వాళ్ళను చూసి ఇలాంటి కుంభకోణాలు తయారవుతున్నాయి..' అని సెలవిచ్చేశారు.! 

వాకాటి నారాయణరెడ్డి ఎవరు.? ఏ పార్టీకి చెందిన వ్యక్తి.? ఆయనకు టీడీపీ ఎలా టిక్కెట్‌ ఇచ్చింది.? సుజనా చౌదరి, గంటా శ్రీనివాసరావుపై ఆరోపణల మాటేమిటి.? చంద్రబాబూ కాస్తంత సమాధానం చెప్పండయ్యా.!

Show comments