ఇది ఆరంభం మాత్రమేనా బాబూ?

రాజకీయాల పరమావధి, అంతిమలక్ష్యం అధికార సాధన అన్నది ఏనాడో ఫిక్సయిపోయింది. అవినీతి, పార్టీలు మారడాలు, నానా తిట్లు తిట్టుకోవడాలు ఇలాంటివి అన్నీ జనం ఏనాడో పట్టించుకోవడం మానేసారు.

తమకు కాస్త సహాయంగా వుండే నాయకుడు అధికారంలో వుంటే చాలు. ఆ నాయకుడు ఏ పార్టీలో వున్నా ఓకె. ఏం చేసినా ఓకె. ఎలా చేసినా ఓకె. ఇదీ జనాల తీరు. అందువల్లే ఏనాడో ప్రారంభమైన ఆయారామ్, గయారామ్ సంస్కృతి ఇప్పుడు మరింత విజృంభించింది.

పదవి ఇవ్వలేదంటే జంప్. పని జరగలేదంటే జంప్. అందులో ఏ శషభిషలూ లేవు. ఆలోచనలూ లేవు. అయ్యో జనం ఏమనుకుంటారో? అధికారం కోసం వెంపర్లాడతున్నామనుకుంటారో? ఇలాంటివి ఏనాడో మాయమయ్యాయి.

కానీ ఇప్పుడు అదే రాజకీయ పార్టీలకు వరంగా, శాపంగా మారుతోంది. అధికారం అందుతుంది కదా అని బొలోమని జనాలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు. దీంతో ఆ పార్టీ బలంగా తయారయింది అనుకున్నారంతా. జనాలు లేక వైకాపా బోసిపోయింది అనుకున్నారు కూడా.

కానీ ఇప్పుడేమవుతోంది. ఇలా వచ్చినవారంతా అధికారం కోసం, భవిష్యత్ లో పార్టీ టికెట్ ల కోసం తప్ప వేరు కాదు. నియోజకవర్గాల పెంపు కనిపించడం లేదు. అసలే తెలుగుదేశం పార్టీలొ రెండు నాయకత్వ కేంద్రాల ప్రతి చోటా వున్నాయి.

ఆ రెండు కేంద్రాలకు వైకాపా నుంచి వలస వచ్చిన వారు తోడయ్యారు. ఇప్పుడు ఎన్నికల్లో ముక్కోణపు పోటీ మాట దేవుడెరుగు.. అసలు పార్టీలోనే ముక్కోణపు పోటీలు తయారయ్యాయి.

నంద్యాల నియోజక వర్గం ఈ తరహా ఫైట్లకు శాంపిల్ మాత్రమే. ఇంకా టికెట్ ప్రకటించలేదు, చేయలేదు. శిల్పా మోహన్ రెడ్డి జంప్ అన్నారు. వెంటనే వైకాపా కండువా కప్పేసారు. ఇలా జంప్ అన్నవారిని ఇప్పుడు ఏ విధంగా విమర్శించగలరు. వచ్చినపుడు మంచోడు, పోయినపుడు చెడ్డోడు అంటే చెల్లదు కదా?

ఇది ఇక్కడతో అంటే నంద్యాలతోనో, కర్నూలు ప్రాంతంతోనో ఆగిపోతే అది వేరే సంగతి. కానీ అలా కనిపించడం లేదు. రాష్ట్రంలోని చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి నివురు కప్పిన నిప్పులా వుంది.

ఒకరికి టికెట్ అంటే మరొకరు జంప్ అనే పరస్థితి క్లియర్ గా వుంది. పోనీ బలమైన వాడికి టికెట్ ఇద్దాం, బలం తక్కువ వున్నవాడు పోయినా పరవాలేదు అనుకుంటే, వాడు వెళ్లి బలమైన పార్టీ అండ చూసుకుంటున్నాడు. దీంతో మళ్లీ సమస్య అవుతోంది.

వైకాపా నుంచి చాలా మందిని లాగేసాం. ఇక ఆ పార్టీ పనైపోయింది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి బలమైన నాయకులే వుండరు అనుకున్నారు తెలుగుదేశం జనాలు. కానీ తమ పార్టీ నుంచే తిరిగి వైకాపాకు నాయకులు సరఫరా అవుతారని ఇప్పుడు అర్థం అవుతూ వుంటుంది.

ఇంకా ఎంత మంది నాయకులు జంప్ జిలానీ అనడానికి రెడీ అవుతున్నారో ఆ పార్టీ నుంచి. ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వచ్చిన తరువాత ఇంక కబుర్లతో నొక్కి పెట్టి వుంచలేరు. చేతిలో పదవి అనే బరువు పడాల్సిందే.

Show comments