జనసేన ఎంపికలు ఇంకెన్నాళ్లు?

2019లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌, మే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం వున్నా, డిసెంబర్‌ 31, 2018 నాటికే దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ సార్వత్రిక ఎన్నికల కోసం సర్వసన్నద్ధమైపోవాల్సి వుంటుంది. అంటే, గట్టిగా ఏడాదిన్నర సమయం మాత్రమే వుందన్నమాట సార్వత్రిక ఎన్నికల కోసం.

2019 ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న జనసేన పార్టీ, ఎంతవరకు ఆ ఎన్నికల కోసం అప్పటికి సమాయత్తమవుతుంది.? అన్న ప్రశ్నకు ఇంకా సరైన సమాధానం దొరకడంలేదాయె. ప్రస్తుతానికైతే జనసేన పార్టీలో 'ఎంపికలు' జరుగుతున్నాయి.. ఎంపికలు దేనికోసమంటారా.. ఇంకెందుకు, జనసైనికుల కోసం.

ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో సగం జిల్లాల్లో కూడా ఎంపికల ప్రక్రియ పూర్తి కాలేదు. ముందుగా జనసైనికుల ఎంపిక, ఆ తర్వాత నేతల ఎంపిక జరుగుతందట. జనసైనికుల ఎంపికకే ఇంత సమయం తీసుకుంటే, నాయకుల ఎంపికకు ఇంకెంత సమయం పడుతుందట.? పోనీ, జనసైనికుల ఎంపిక షురూ అయ్యింది గనుక, మీడియాలో జనసేన పార్టీ కన్పిస్తుందా.? అంటే, అదీ లేదాయె.

ఒకరిద్దరు మాత్రం జనసేన జెండా పట్టుకుని మీడియాలో అక్కడక్కడా కన్పిస్తున్నారంతే. అసలంటూ పవన్‌కళ్యాణ్‌ స్వయంగా రంగంలోకి దిగి, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తూ, ప్రజాసమస్యలపై జనం బాట పట్టాలన్న ఆలోచనే చేయకపోవడంతో, జనసైనికుల ఎంపిక జరుగుతున్నా, ఆ ప్రక్రియ ఓ తూతూ మంత్రం ప్రసహనంగా మారిపోయింది.

మొదట్లో జనసైనికుల ఎంపిక ప్రక్రియ కొంత మేర మీడియా అటెన్షన్‌ని సంపాదించినా, ఇప్పుడు మీడియా సైతం ఆ ఎంపికల్ని లైట్‌ తీసుకుంది. ఏమో, 2019 ఎన్నికల నాటికి జనసేనను రాజకీయ పార్టీగా పవన్‌కళ్యాణ్‌ ఎన్నికల బరిలోకి దించుతారో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

Show comments