'బాబా'.. కోటితో రైతుల్ని మెప్పించినట్టేనా.?

రైతులకి ఏమిచ్చినా తక్కువే.. రైతుల కోసం ఎంత మేలు చేసినా తక్కువే.! ఎందుకంటే, దేశానికి రైతే వెన్నెముక. కానీ, దురదృష్టవశాత్తూ ఆ రైతు పరిస్థితి దేశంలో అత్యంత దయనీయ స్థితిలో వుంది.

రైతు మీద కోట్లు గుమ్మరించేయనక్కర్లేదు.. రైతులకి సరైన ఎరువులు, విత్తనాలు అందాలి.. రైతుల పంటకి గిట్టుబాటు ధర కల్పించాలి. కానీ, ప్రభుత్వాలు ఇవేమీ చెయ్యవు.. రుణమాఫీ అంటాయి.. ఇంకోటేవో కథలు చెబుతాయి.. అలా రైతుల్ని బిచ్చగాళ్ళగా మార్చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్నది రైతుల ఆవేదన. 

ఇక, ఇప్పుడిదంతా ఎందుకంటే.. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, రైతుల కోసం కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు. ఇది తమిళనాడు రైతులకు మాత్రమే.

ఎందుకంటే, ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడు. కానీ, ఆయన్ని తమిళ సంఘాలు రాజకీయాల్లో అడ్డుకుంటామంటున్నాయి. అందుకే, రైతులతో మొదలెట్టినట్టున్నాడు రజనీకాంత్‌ రాజకీయం. 

ఇన్నేళ్ళలో ఏనాడూ రైతుల సమస్యల గురించి రజనీకాంత్‌ పట్టించుకోలేదు. నిజానికి ఆ అవసరం కూడా రజనీకాంత్‌కి రాలేదు. కానీ, ఇప్పుడొచ్చింది.

అందుకే, రైతుల సమస్యలపై స్పందించారు. రైతులకు ఎంత పెద్ద సాయం చేసినా అది చిన్నదే అవుతుందన్నారు. కోటి రూపాయలు చిన్న సాయమే అయినా, రైతులకు ఎంతో కొంత ఉపయోగపడ్తుందని రజనీకాంత్‌ చెప్పుకొచ్చారు. రైతు సంఘాల నేతలతో సమావేశం సందర్భంగా రజనీకాంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇంతకీ, కోటి రూపాయల విరాళంతో పొలిటికల్‌ 'బాబా' రజనీకాంత్‌ తమిళనాడు రైతుల్ని మెప్పించేసినట్లేనా.?

కొసమెరుపు: కోటి.. సూపర్ స్టార్ రజనీకాంత్ కి చాలా చాలా చిన్న అమౌంట్. సినిమాకి పాతిక కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకునే రజనీకాంత్, రాజకీయాల కోసం రైతులకి కోటి విరాళం ప్రకటించడమేంటన్న విమర్శలు షురూ అయ్యాయండోయ్.

Show comments