పచ్చస్వామ్యానికి చెప్పుదెబ్బ

విపక్షాలు ఆందోళన చేయడం మామూలే. అదే అధికారపక్షం రోడ్డెక్కితే.? రౌడీయిజం ప్రదర్శిస్తే.? అధికార పార్టీ నేతలు వీధి రౌడీల్లా మారిపోతే.? దాన్ని ఏమనాలి.! మీరేమన్నా అనుకోండి, ఇది 'పచ్చస్వామ్యం.. ఇక్కడ ఇలాగే వుంటుంది..' అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఈ సీన్‌ జరిగింది, జరుగుతోన్నదీ కడప జిల్లా పొద్దుటూరులో. అసలు విషయం, మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎంపిక వ్యవహారం.! 

నిజానికి, పొద్దుటూరులో ప్రతిపక్షానికి మున్సిపల్‌ ఛైర్మన్‌ని ఎంపిక చేసుకునేంత బలం వుంది. ఇదే అసలు ప్రమాదం అధికార పార్టీ దృష్టిలో. పరువు పోతుంది కదా, అందుకే ఎంతకైనా బరితెగించేయాలని నిర్ణయించుకుంది. నిన్నటికి నిన్న నానా యాగీ చేసింది. దాంతో, ఎన్నిక వ్యవహారం నేటికి షిఫ్టయ్యింది. నేడూ అదే పరిస్థితి. ఎన్నిక జరిగితే, ఓటమి తప్పదు. తలెత్తుకు తిరగలేని పరిస్థితి. ఇంకేం చేస్తాం, విధ్వంసం సృష్టిస్తాం.. అంటూ తెలుగు తమ్ముళ్ళు చెలరేగిపోయారు. 

ఇంతకీ, ఈ ఎపిసోడ్‌లో పోలీసులు ఏం చేస్తున్నారట.? ఏం చేస్తున్నారనడక్కండి. అదంతే. పెద్ద సంఖ్యలో బలగాల్ని మాత్రం మోహరించారు. ఎందుకు, అధికార పార్టీ నేతల ఆగడాలు యధేచ్ఛగా కొనసాగడం కోసం. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షం ఏం చేయగలుగుతుంది.? ఏమీ చేయలేదు. అందుకే, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. 'వ్యవస్థలు నాశనం చేసేశారు..' అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. అసలిదేం ప్రజాస్వామ్యమంటూ మండిపడ్డారు. పోలీసులు మాత్రం, షరామామూలుగానే చోద్యం చూశారు.

కొసమెరుపు: ఎమ్మెల్యే రాచమల్లు ఏమీ చేయలేని స్థితిలో తనను తాను కొట్టుకున్నారుగానీ, అది విధ్వంసకర రాజకీయాలు చేస్తున్న అధికార పార్టీకి తగలాల్సిన దెబ్బ.

Show comments