జూపూడి కూడా తొడకొడుతున్నాడండోయ్!

‘అన్ని పాములూ ఆడుతూ ఉంటే వానపాము కూడా లేచి డ్యాన్స్ చేసిందని’ సామెత. ఇప్పుడు రాజకీయ పరిణామాలను గమనిస్తోంటే.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు మాట్లాడుతున్న తీరు ఈ సామెత చందంగానే కనిపిస్తోంది. ఫ్యాక్షనిస్టులుగా ప్రచారంలో ఉన్న నాయకులకంటె తాను పెద్ద హీరో అన్నట్లుగా సవాళ్లు విసురుతుండడం, అసలు విషయాన్ని గురించి  మాట్లాడడం కంటె తన హీరోయిజాన్ని ప్రదర్శించుకోవడానికి ఆరాటపడిపోతుండడం చిత్రంగా కనిపిస్తోంది. 

కర్నూలు జిల్లాకు చెందిన, అత్యంత దూకుడైన, బలమైన నాయకుడిగా పేరున్న భూమా నాగిరెడ్డి కుమార్తె , ఎమ్మెల్యే కూడా అయిన భూమా అఖిలప్రియ మీద వైసీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారనేది తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. అచ్చంగా అఖిలప్రియ మీద దాడి చేయాల్సిందిగా.. వైఎస్ జగన్మోహన రెడ్డి పిలుపు ఇచ్చి, ఆమె కారు అటుగా వస్తుందని , దాని మీద దాడి చేయడానికే కార్యకర్తల్ని మోహరించి ఉంచిన స్థాయిలో తెలుగుదేశం నాయకులు ఆయన మీద విరుచుకు పడిపోతున్నారు. ఈ అంశాన్ని పట్టుకుని ప్రతి నాయకుడూ జగన్ మీద నిందలు వేసి అధినేతను ఇంప్రెస్ చేయడానికి ఉబలాటపడిపోతున్నారు. 

ఇదంతా ఒక ఎత్తు అయితే.. వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి, నెగ్గలేక చతికిలపడి, ఆ తర్వాత తెలుగుదేశంలోకి ఫిరాయించి ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గిరీని దక్కించుకున్న జూపూడి ప్రభాకర్ కూడా ఈ విషయంలో జగన్ మీద విమర్శలు గుప్పిస్తుండడం చిత్రంగా కనిపిస్తోంది. అఖిలప్రియ మీద దాడిలో జగన్ ప్రమేయం కూడా ఉన్నదంటూ ఆయన సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పనిలో పనిగా.. తన హీరోయిజాన్ని ప్రదర్శించుకోవడానికి ఆయన ఉబలాటపడుతున్నట్లుంది. ‘తన కారును అడ్డగించి దాడిచేసే దమ్ముందా’ అని జూపూడి ప్రభాకర్ నిలదీస్తున్నారు. అక్కడికేదో తాను.. భూమా నాగిరెడ్డి కంటె చాలా పెద్ద హీరోయిజం ఉన్న నాయకుడిని ఆయన తనకు తానుగా ఫీలైపోతున్నట్లుంది. శనివారం నాడో ఓ టీవీ చర్చలో కూడా.. వాహనానికి కూడా నష్టం జరగలేదు అని వైసీపీ వాళ్లు తమ తప్పులేదని చెప్పుకుంటూ ఉండగా, వాహనాన్ని నష్టపరచి మీరు ఉండగలరా, వెళ్లగలరా అంటూ జూపూడి డైరక్టు బెదిరింపులకు దిగడం ఇంకా చిత్రమైన సంగతిగానే అనుకోవాలి. 

అఖిలప్రియ కారు సంఘటన స్థలానికి రావడానికి కాసేపటి ముందుగా అటువైపు జూపూడి ప్రభాకర్ కారు వెళ్లింది. అందుకే ఆయన నా కారు మీద దాడిచేసే దమ్ముందా అనగలుగుతున్నారు. అఖిలప్రియ వచ్చిన సమయానికి నీటి ట్యాంకరు పుణ్యమాని ఆమె వాహనం స్లో అయి ఆగడం, కారులో ఉన్న ఆమెను గుర్తించి, వైసీపీ కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం కారు మీద చరచడం వరకూ నిజమే. అయితే దానిని దాడిగా చిత్రీకరించడానికి తెదేపా గణాలు పడుతున్న పాట్లలో భాగంగా జూపూడి తన హీరోయిజాన్ని కూడా ప్రదర్శించుకోవడమే.. విచిత్రం. 

Show comments