సల్లూభాయ్‌.. యుద్ధమంటే అంత చులకనా.?

యుద్ధమంటే రెండు దేశాల మధ్య కొట్లాట మాత్రమే కాదు.. రెండు దేశాల మధ్య ఆధిపత్య పోరు మాత్రమే కాదు.. అంతకు మించి.! యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే, ఇరు దేశాలకు చెందిన సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఖాయం. ఓ వైపు ఎక్కువ, ఇంకో వైపు తక్కువ.. అంతే తేడా.

సరిహద్దుల్లో సైన్యం ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తోంటే, ప్రభుత్వాలు నడిపే పాలకులు, ఇతర రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తూ వుంటాయన్న విమర్శ ఈనాటిది కాదు. అలాగని, సరిహద్దుల్లో సైన్యం, చేతుల్లోని తుపాకుల్ని, ఇతర ఆయుధాల్ని వదిలేసి.. వాటిని రాజకీయ నాయకుల చేతుల్లో పెడతాయా.? ఈ మాత్రం ఇంగితం కూడా లేని సల్మాన్‌ఖాన్‌, స్టార్‌ హీరో ఎలా అయ్యాడబ్బా.? 

తన కొత్త సినిమా 'ట్యూబ్‌లైట్‌' ప్రమోషన్‌ కోసం మీడియా ముందుకొచ్చిన సల్మాన్‌ఖాన్‌, ఇండియా - పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. యుద్ధంలో సైనికులు ప్రాణాలు కోల్పోతే, వారి కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతాయనీ, ఆ తుపాకులేవో రాజకీయ నాయకుల చేతుల్లో పెడితే వారికి యుద్ధం సంగతేంటో తెలుస్తుందని సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించడం వివాదాస్పదమయ్యింది. 

దేశంలో రాజకీయ నాయకుల గురించి సైన్యం, సరిహద్దుల్లో యుద్ధం చేయడంలేదు. దేశ భద్రతే పరమావధిగా సైన్యం సరిహద్దుల్లో శతృవుతో పోరాడుతుంది. యుద్ధంలో ప్రాణం కోల్పోవడమంటే, అది దేశం కోసం చేసే త్యాగంగా సైన్యం భావిస్తుంటుంది. సైనికుడొక్కడే కాదు, ఆ సైనికుడి కుటుంబమూ అంతే.

తమ బిడ్డ దేశం కోసం ప్రాణ త్యాగం చేశాడన్న మాటే ఆ కుటుంబానికి ఎనలేని ఆనందాన్నిస్తుంది. పంటి బిగువన తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడన్న బాధని భరించి, 'భారత్‌ మాతా కీ జై' అని నినదిస్తుంది. 

సల్మాన్‌ఖాన్‌ అంతే.. తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఏదో ఒక వివాదాన్ని తెరపైకి తెస్తుంటాడు. 'భజరంగా భాయిజాన్‌' సినిమా తరహాలో ఇండియా నుంచి పాకిస్తాన్‌కి వెళ్ళిపోయి, తిరిగొచ్చేసినట్టుండదు నిజ జీవితంలో. బహుశా తన సినిమా పాకిస్తాన్‌లోనూ గొప్పగా ఆడేయాలన్న ఉద్దేశ్యంతో, యుద్ధం - రాజకీయం.. సైన్యం - ఆయుధం.. అంటూ ఏవేవో మాట్లాడేసి వుండొచ్చు.

కానీ, సల్మాన్‌ఖాన్‌ తెలుసుకోవాల్సింది దేశభక్తి గురించి. అదే సరిహద్దుల్లోని సైనికుడి ఊపిరి.. అంతకు మించి. ఊపిరి పోయినా సైనికుడు, దేశభక్తిని మరవడు.. ఆయుధాన్ని వదిలిపెట్టడు.. శతృవుని దేశంలోకి చొరబడనివ్వడు.. ఓటమిని అంగీకరించడు.

Show comments