టాలీవుడ్ లో ఈ డబ్బింగుల గోల ఏంది..?

పరాభాష సినిమాలను డబ్బింగ్ చేయడం తప్పేమీ కాదు. అక్కడ హిట్టైన సినిమాల్లోని ఫీల్  పోకుండా.. మన ప్రేక్షకులకు కూడా మంచి మంచి సినిమాలు చూపించడానికి డబ్బింగు ప్రక్రియ చక్కటి అవకాశం. అయితే డబ్బింగులను నిషేధించాలని.. తెలుగు చిత్ర పరిశ్రమలోని పెద్దలే కొందరు డిమాండ్ చేస్తూ ఉంటారు. కానీ ఇదంత  సమర్థనీయం కాదు. అయితే అనువాదాలపై ఆసక్తి చూపే ప్రొడ్యూసర్లు సినిమాలను డబ్ చేయడం అనేది ప్రహసనంగా మార్చకూడదు!

ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. తెలుగులోకి అనువాదం అవుతున్న కొన్ని పరభాషా చిత్రాలను చూస్తుంటే, ఇదేం ఖర్మ అనే ఫీలింగ్ కలుగుతుంది. దాదాపు పదేళ్ల కిందట విడుదలైన పరభాషల సినిమాలను ఇప్పుడు డబ్ చేస్తున్నారు మనోళ్లు! ఆయా భాషల ప్రేక్షకులను కూడా అంతగా అలరించని ఆ సినిమాలను తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ జాబితాలో తమిళ హీరో ధనుష్, మలయాళీ హీరో మమ్ముట్టీ సినిమాలున్నాయి. 

ధనుష్, జెనీలియాలు జంటగా నటించిన సినిమా ఒకటి, మమ్ముట్టీ , కత్రీనాకైఫ్ లు హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా మరోటి.. ఇవి ఇప్పుడు తెలుగులోకి డబ్ అవుతున్నాయి. విశేషం ఏమిటంటే.. ధనుష్ సినిమా ఏడెనిమిదేళ్ల కిందట తమిళంలోకి అనువాదం అయ్యింది. మమ్ముట్టీ సినిమా “బలరాం వర్సెస్ తారాదాస్’’ వచ్చి పదేళ్లు అయ్యంటాయి! ఇప్పుడు ఈ సినిమాలను తెలుగులోకి అనువాదిస్తున్నారు! ధనుష్ డబ్బింగ్ సినిమాలకు అంతో ఇంతో క్రేజ్ ఉండటంతో ఆ సినిమాను అనువదిస్తుంటే, కత్రినాకైఫ్ నటించిన సినిమా అంటూ మమ్ముట్టీ సినిమాను అనువదిస్తున్నారు. డబ్బింగ్ సినిమాలపై ఆధారపడిన ప్రొడ్యూసర్ల పాట్లను తెలియజేస్తున్నాయి ఇలాంటి సినిమాలు.

Show comments