రాహుల్‌కు 'పొత్తు ఫ్రెండ్స్‌' తయారవుతున్నారా?

ప్రస్తుతం దేశంలోని ఛోటా నాయకుడి నుంచి మోటా నాయకుడి వరకూ అందరూ 2019 ఎన్నికల గురించే ఆలోచిస్తున్నారు. మీడియా కూడా నాయకుల కదలికలను, ఆలోచనలను గమనిస్తోంది. పార్టీల బలాలను, బలహీనతలను అంచనా వేస్తోంది. పార్టీల పొత్తులపై రకరకాల ఊహాగానాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇప్పటి అంచనాలు ఎన్నికలనాటికి స్థిరంగా ఉంటాయా? ఆ అంచనాలే నిజమవుతాయా? అంటే చెప్పలేం. త్వరలోనే కాంగ్రెసు పార్టీకి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న ప్రస్తుత ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అప్పుడే రాబోయే ఎన్నికల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

మరి కీలక బాధ్యతలు స్వీకరించబోయే నాయకుడు ఆలోచించకపోతే ఎలా? తల్లి మీద ఇంకెంత కాలం భారం మోపుతాడు? వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేకుండా ఎంతటి మొనగాడు పార్టీ అయినా మనుగడ సాగించలేని పరిస్థితి ఉంది. దానికి కాంగ్రెసు కూడా మినహాయింపు కాదు. అందుకే రాహుల్‌ గాంధీ పొత్తుల గురించి ఆలోచిస్తున్నారు. రాహుల్‌ ఈ తరం నాయకుడు. కాబట్టి తన తరానికి చెందిన యువ నాయకులతో కలిసి పనిచేయాలనుకుంటున్నారు. వచ్చే ఎన్నికలను లీడ్‌ చేయబోయేది యువ నాయకులేనని అనుకుంటున్నారు. మొన్నటి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ)తో పొత్తు పెట్టుకున్నారు. కాని బీజేపీ (ఎన్‌డీఏ) ప్రభంజనం ముందు యువ నాయకులు వీగిపోయారు. అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో అఖిలేష్‌తోనే కలిసి పనిచేయాలనుకుంటున్నారు.

రాహుల్‌ కలిసి పనిచేయాలనుకుంటున్న మరో యువ నేత బిహార్లో ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌. మహాఘట్‌ బంధన్‌ సర్కారు విచ్ఛిన్నమై సీఎం నితీష్‌ కుమార్‌ బీజేపీతో చేతులు కలిపేవరకు తేజస్వీ డిప్యూటీ సీఎం అనే సంగతి తెలిసిందే. దక్షిణాదిలోని తమిళనాడులో రాహుల్‌కు ఫ్రెండ్‌ డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు కమ్‌ అధినేత కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్‌. కరుణానిధి అనారోగ్యంతో ప్రస్తుతం అచేతానవస్థలో ఉన్నారు కదా. దీంతో స్టాలినే పార్టీని నడిపిస్తున్నారు. ఆయన్నే వారసుడిగా కరుణానిధి ప్రకటించారు. వచ్చే ఎన్నికలను లీడ్‌ చేసేది ఈయనే. కాంగ్రెసుకు డీఎంకే పాత ఫ్రెండే. యూపీఏ సర్కారులో భాగస్వామిగా ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకోవల్సిన పనిలేదు. సో... రాహుల్‌కు ముగ్గురు స్నేహితులు రెడీగా ఉన్నారు. ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఉంది. అఖిలేష్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌పై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. 

తమిళనాడులో కరుణానిధి కుమార్తె కనిమొళి సహా ఆ కుటుంబానికే చెందిన కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్‌పై, డీఎంకేకు చెందిన మాజీ మంత్రి ఎ.రాజాపై 2జీ స్కామ్‌కు సంబంధించిన కేసులున్నాయి. వీరంతా జైలుకు కూడా వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అవినీతి ఆరోపణలున్న, కేసుల విచారణ జరుగుతున్న పార్టీలతో పొత్తులు పెట్టుకొని, ఆ నాయకులతో కలిసి రాహుల్‌ ఎలా పనిచేయాలనుకుంటున్నారు? నరేంద్ర మోదీ సర్కారు వచ్చే ఎన్నికలనాటికి కేసుల విచారణ వేగం పెంచే అవకాశముంది. ప్రతి రాష్ట్రంలోనూ ప్రతిపక్షాలను అణిచివేసేందుకు, భయపెట్టేందుకు మోదీ సర్కారు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఐటీ దాడులు, సీబీఐ విచారణలు జరుగుతున్నాయి. మరి అవినీతి ఆరోపణలున్నవారితో పొత్తు పెట్టుకొని జనాలకు రాహుల్‌ ఏం చెప్పుకుంటారు? 

Show comments