చంద్రబాబు అనైతికతకే కట్టుబడ్డారా?

పాలకులు, నాయకులు సాధారణంగా ఎప్పుడూ ఒకమాట చెబుతుంటారు. ఏమని? తాము నీతినిజాయితీలకు కట్టుబడ్డామని, పారదర్శకంగా పనిచేస్తున్నామని అంటుంటారు. తప్పు చేస్తే ఏ శిక్ష విధించినా అంగీకారమేనని అంటారు. తప్పు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని గొంతు చించుకుంటారు. కాని ఇదంతా వారు ఆడే నాటకాల్లో భాగమే. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వైఖరి చూస్తుంటే ఆయన కూడా నాటకాలు ఆడే సగటు రాజకీయ నాయకుడికి మించి ఎదగలేదేమోననిపిస్తోంది. 

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు, అవశేష ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా పనిచేస్తున్న చంద్రబాబుకు చాలా తేడా ఉందని దశాబ్దాలుగా ఆయన్ను దగ్గరగా చూస్తున్న, ఒకప్పుడు ఆయనతో సన్నిహితంగా ఉన్న పాత్రికేయులు తరచుగా చెబుతుంటారు. ఇతర విషయాలు ఎలా ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు, ప్రతిపక్షం సర్వనాశనం కావాలనే ఆయన ఆకాంక్ష చూస్తుంటే సగటు రాజకీయ నాయకుడే తప్ప ముందు తరాలవారు గొప్పగా చెప్పుకునే రాజనీతిజ్ఞుడు కాదని అర్థమవుతోంది.  

ప్రధానంగా పార్టీ ఫిరాయింపుల అంశం ఆయనకు తెచ్చిన చెడ్డ పేరు అంతా ఇంతా కాదు. మరి పొరుగు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదే పని చేస్తున్నారు కదా అని ప్రశ్నించవచ్చు. కేసీఆర్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి మంచి పని చేశారని ఎవ్వరూ అనడంలేదు. ఆయన చేసింది, చేస్తున్నది అనైతికమే. అదే అనైతికమైన పని చంద్రబాబు ఎందుకు చేయాలి? అనేదే ప్రజాస్వామ్య ప్రియుల ఆవేదన. కేసీఆర్‌కు, బాబుకు చాలా తేడా ఉంది. కేసీఆర్‌ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. కాని బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నాయకుడు. సమర్థ పాలకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అదీగాకుండా తాను నిప్పులాంటివాడినని, ఏనాడూ తప్పు చేయలేదని, చేయనని పదేపదే చెప్పుకుంటూవుంటారు. 

ఇలాంటి నాయకుడు ఏం చేయాలి? తన పార్టీలోకి వచ్చినవారితో రాజీనామాలు చేయించి, ఉప ఎన్నికల్లో పోటీ చేయించి తనవారిగా అంటే టీడీపీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో స్థానం కల్పించాలి. ఆయన ఆ పని చేసుంటే కేసీఆర్‌ సైతం సిగ్గుతో చితికిపోయేవారేమో..! కాని ఈ మాట చెబుతున్న పాత్రికేయులంటే, విశ్లేషకులంటే బాబుకు కోపం. విమర్శలను ఏమాత్రం సహించడు. ఇదంతా కొత్త విషయం కాకపోయినా ఎందుకు చెప్పుకోవల్సివచ్చిందంటే...కాంగ్రెసులో ఉన్నప్పుడు చంద్రబాబుకు పరమ శత్రువు, టీడీపీలో చేరాక వీరభక్తుడైన గాలి ముద్దు కృష్ణమ నాయుడు బంగారంవంటి మాట చెప్పారు. ఏమని? ఫిరాయింపుల చట్టానికి సవరణలు చేయకూడదని.  Readmore!

ఈ చట్టానికి సవరణలు చేయాలని ప్రతిపక్ష  వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది. చట్ట సవరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయించింది. ఒక్క జగన్‌ పార్టీయే కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనం కాకూడదని ఆకాంక్షించే పార్టీలన్నీ ఫిరాయింపుల చట్టానికి సవరణలు చేయాలని కోరుతున్నాయి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడూ ఇదే మాట అన్నారు. అయితే ముద్దు దీనిపై మాట్లాడుతూ ఫిరాయింపుల చట్టానికి సవరణలు చేయాలని వైకాపా కోరడం 'దురదృష్టకరం' అన్నారు. ఇది అనవసరమైన అంశమని, ఆ పార్టీకి రాష్ట్రాభివృద్ధి పట్ల, ప్రజాప్రయోజనాల పట్ల శ్రద్ధ లేదని విమర్శించారు. 

ఫిరాయింపులు రాష్ట్రాభివృద్ధికి కొలబద్దగా ఆయన భావిస్తున్నట్లుంది. వాస్తవానికి సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి అయిన ముద్దు ఇలా మాట్లాడటం దురదృష్టకరం. అయితే ఫిరాయింపుల చట్టానికి సవరణలు చేయకూడదని ముద్దు కృష్ణమ నాయుడు తన సొంత అభిప్రాయంగా చెప్పారా? పార్టీ విధానంగా చెప్పారా? అనే తేలాలి. అధినేత చంద్రబాబు అనుమతితోనే మాట్లాడారా? ముద్దు ప్రకటనను చంద్రబాబు సమర్థించడమో, అభ్యంతరం చెప్పడమో చేసినట్లు కనబడటంలేదు. ఆయన మౌనంగా ఉన్నారంటే అనైతికతకు కట్టుబడి ఉన్నారనే అనుకోవాలి.

 ఫిరాయింపుల చట్టానికి సవరణలు చేయాలి అని అన్నట్లయితే ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించండనే డిమాండ్‌ సహజంగానే వస్తుంది. ఆయన ఆ పని చేయరు. ఏది ఏమైనా ముద్దు కృష్ణమ నాయుడి ప్రకటన పార్టీ వైఖరి ఏమిటో, చంద్రబాబు నైతిక విలువలేమిటో తెలియచెప్పింది. 

Show comments

Related Stories :