సినిమా థియేటర్లలో 'కెమెరా' గోల

ఓ పక్క తెర మీద సినిమా జోరు జోరుగా నడుస్తోంది.. అభిమానుల కేరింతలు మిన్నంటుతున్నాయి.. సందట్లో సడేమియా కెమెరా అందులోకి ఎంటర్‌ అయ్యింది. సినిమా ఎలా వుంది.? అన్న ప్రశ్నలతో మీడియా కెమెరాలు అభిమానులకి పిచ్చ ఆగ్రహాన్ని తెప్పించేశాయి. అయినా, తప్పదు.. మీడియా కెమెరా కదా, ఏదో మొహమాటానికి కొందరు సమాధానమిస్తోంటే, ఇంకొందరు తెర మీద ప్రదర్శితమవుతున్న సినిమాలో లీనమైపోయి, మీడియా కెమెరాని పట్టించుకోవడం మానేశారు. 

'ఖైదీ నెంబర్‌ 150' సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన దరిమిలా, థియేటర్ల దగ్గర అభిమానుల హంగామాతోపాటు, థియేటర్లలోని అభిమానుల హంగామా చూపించేందుకు మీడియా కెమెరాలు పోటీ పడ్డాయి. ఇక్కడ మీడియా కెమెరాల అత్యుత్సాహం వివాదాస్పదమవుతోంది. ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకోవడం సంగతి దేవుడెరుగు, తెర మీద కన్పిస్తున్న 'బొమ్మ', మీడియా కెమెరాల్లో కవర్‌ అయిపోతోంది. 

అసలంటూ థియేటర్లలోకి కెమెరాల్ని అనుమతించరు. కానీ, మీడియా కదా, తప్పదు.! మీడియా ముసుగులో కెమెరాలు పట్టుకొచ్చి, పైరసీ చేస్తేనో.? అన్న ఆరోపణలు షరామామూలే. అయితే, పైరసీ కొత్త పుంతలు తొక్కేసింది. థియేటర్లలో కెమెరాలన్నది పాత మాట. మొబైల్‌ ఫోన్లతో పని కానిచ్చేయొచ్చు. అయినాసరే, థియేటర్లలో మీడియా కెమెరాలు.. అదీ సినిమా ప్రదర్శితమవుతున్నప్పుడు కావడం దురదృష్టకరమే. 

ఏ సినిమా విషయంలో అయినాసరే, మీడియా కెమెరాలు థియేటర్లలోకి వెళ్ళకపోవడమే మంచిది. కానీ, ఆగుతాయా.? అసలే మీడియా కెమెరాలు.. వాటి అత్యుత్సాహానికి హద్దులుండవు కదా.!

Show comments