సిద్దూ.. ఇది మరీ టూమచ్‌

హీరో సిద్దార్ధ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటాడు. మొన్నామధ్యన హోర్డింగ్‌ విషయంలో సిద్దూ చేసిన పోరాటం ఫలించింది. సోషల్‌ మీడియాలో ఆ హోర్డింగ్‌ చూసి, గుస్సా అయ్యాడు. ఇంకేముంది, సదరు సంస్థ ఆ ప్రకటనను ఉపసంహరించుకుంది. ఓ బాలీవుడ్‌ నటుడు ఆ హోర్డింగ్‌లో కన్పించాడు. ఆయనా, అందులో నటించినందుకు విచారం వ్యక్తం చేశాడనుకోండి.. అది వేరే విషయం. 

సోషల్‌ మీడియాలో మైలేజ్‌ కోసం ఏం మాట్లాడినా చెల్లిపోతుందా.? అవుననే నమ్ముతాడు సిద్దార్ధ. ఇదిగో ఎగ్జాంపుల్‌. బెంగళూరులో మహిళలపై వేధింపుల ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం విదితమే. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశాడు సిద్దూ. అక్కడితో ఆగితే అతను సిద్దూ ఎందుకవుతాడు. మగాడిగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాననేశాడు. ఆ ఘటనకీ, మగాడిగా పుట్టినందుకు విచారం వ్యక్తం చేయడానికీ సంబంధం ఏమన్నా వుందా.? అన్నట్టు, 'నన్ను క్షమించండి' అనేశాడండోయ్‌.! 

మగజాతి మొత్తానికీ ఈయనగారే వకాల్తా పుచ్చేసుకున్నట్టున్నాడు. లేకపోతే, మగజాతి తరఫున సిద్దూ క్షమాపణ చెప్పడమేంటట.? చెడు అన్నాక అన్నిట్లోనూ వుంటుంది. తప్పు చేసిన వ్యక్తుల్ని, తప్పుడు వ్యక్తులుగానే చూడాలి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. 'భూమ్మీద వున్న చెత్త పురుషులం' మనమే.. అంటూ సిద్దూ తన అసహనాన్ని పీక్స్‌కి తీసుకెళ్ళిపోయాడు. నిజానికి బెంగళూరు ఘటనలో దుస్సాహం చేసింది మృగాళ్ళు. అలాంటోళ్ళని మగజాతి నుంచి వెలివేస్తున్నట్లే మాట్లాడాలి ఎవరైనా. అది మానేసి, మొత్తంగా మగజాతే చీడపురుగులని అనేస్తే ఎలా సిద్దూ.!

Show comments