సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ 'నోటా'.!

'నోటా' అంటే ఇదేదో సినిమా టైటిల్‌ అనుకునేరు. 'నోటా' అంటే, ఎన్నికల్లో ఈ మధ్య ఎక్కువగా విన్పిస్తోన్న పదం. దానర్థం 'నన్‌ ఆఫ్‌ ది ఎబౌ' అని. అంట, ఎవరూ కాదు అని. బరిలో నిలిచిన అభ్యర్థులెవరికీ ఓటేసే ఉద్దేశ్యం లేనప్పుడు, ఓటరు 'నోటా'ని ఎంచుకునే అవకాశం కల్పించింది ఎన్నికల కమిషన్‌. ఇంతకీ, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కీ, 'నోటా'కీ లింకేంటంటారా.? అక్కడికే వచ్చేద్దాం. 

తమిళసూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తమిళ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారారు. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అధికారమ్మీద ఆయన తన 'ఆశ'ని ఈ మధ్యనే ఓ సందర్భంలో వెల్లడించారు కూడా. తమిళనాడులో జయలలిత మరణానంతరం ఏర్పడ్డ రాజకీయ గందరగోళాన్ని క్యాష్‌ చేసుకునే దిశగా రజనీకాంత్‌ అడుగులు వేస్తున్న మాట వాస్తవం. అయితే, ఏ పార్టీకి ఆయన మద్దతిస్తారన్నది కీలకంగా మారింది. 

రజనీకాంత్‌ మద్దతు కోసం ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వెంపర్లాడుతున్నాయి. అయితే, రజనీకాంత్‌ మాత్రం 'నోటా' అనేస్తున్నారు. జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్‌కె నగర్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్న దరిమిలా, ఆ ఉప ఎన్నికల్లో బీజేపీకి లేదా పన్నీర్‌సెల్వం వర్గానికి లేదా డీఎంకే పార్టీకి రజనీకాంత్‌ మద్దతివ్వనున్నారనే ఊహాగానాలు విన్పిస్తున్న విషయం విదితమే. ఈ ఊహాగానాల్ని రజనీకాంత్‌ ఖండించి పారేశారు. 

'నేనెవరికీ మద్దతివ్వడంలేదు..' అని ఏకవాక్యంలో స్పష్టం చేసేశారు రజనీకాంత్‌. అదీ ట్విట్టర్‌ ద్వారా. ఇంతకీ, రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశం సంగతేంట.? ఏమో మరి, దీనికి మాత్రం ఈ సూపర్‌ స్టార్‌ నుంచి క్లారిటీ రావడంలేదు.

Show comments