స్టార్‌ స్టార్‌ సూపర్‌ స్టార్‌.!

రజనీకాంత్‌.. పరిచయం అక్కర్లేని పేరిది.  మొత్తంగా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ ఆయన్ని 'సూపర్‌ స్టార్‌' అని పిలుచుకుంటుంది. ఆయనకి భాషా బేధం లేదు. చాలా భాషల్లో ఆయన సినిమాలు చేశారు. తమిళ సూపర్‌ స్టార్‌ అయినా, ఆయన సినిమా చాలా భాషల్లోకి డబ్‌ అవుతుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే రజనీకాంత్‌ ఏ సినిమా చేసినా అది మల్టీ లాంగ్వేజెస్‌ ఫిలింగానే భావించాలేమో. 

ఏదో ఊరకే అలా రజనీకాంత్‌ సూపర్‌ స్టార్‌ అయిపోలేదు. బస్‌ కండక్టర్‌ కాస్తా నానా తంటాలూ పడితేగానీ సూపర్‌ స్టార్‌ అవలేదు. ఈ క్రమంలో రజనీకాంత్‌ పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. స్టార్‌డమ్‌ వచ్చేదాకా ఒక ఎత్తు.. స్టార్‌డమ్‌ వచ్చాక ఇంకో ఎత్తు. స్టార్‌డమ్‌ లెక్కల్ని పక్కన పెట్టి కూడా రజనీకాంత్‌ సినిమాలు చేశారు. సక్సెస్‌లు కొట్టారు. దటీజ్‌ రజనీకాంత్‌. 

రజనీకాంత్‌ నుంచి తాజాగా 'కబాలి' సినిమా వస్తోంది. మామూలుగా అయితే ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు మాత్రమే వుండాలి. ఎందుకంటే, రజనీకాంత్‌ తన గత చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లను నిలువునా ముంచేశారన్న ఆరోపణలున్నాయి. ఇవి ఆరోపణలు కాదు, రజనీకాంత్‌ నటించిన 'కొచాడియాన్‌', 'లింగా' సినిమాలు అటు నిర్మాతల్నీ, ఇటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లనీ ముంచేశాయి. ఆ వివాదాలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. అయినా, 'కబాలి' విషయంలో అంచనాలు ఏమాత్రం తగ్గలేదు సరికదా, గత చిత్రాలకన్నా 'కబాలి' విపరీతమైన హైప్‌ని సంపాదించుకుంది. 

హైద్రాబాద్‌లో తెలుగు వెర్షన్‌ 'కబాలి' విడుదలవుతోంది. తమిళ వెర్షన్‌ని కూడా విడుదల చేస్తారు తెలుగు వెర్షన్‌తోపాటు. కానీ, తమిళనాడులో రజనీకాంత్‌ సినిమాని చూస్తే ఆ కిక్కే వేరప్పా.. అంటూ హైద్రాబాద్‌లో టేకాఫ్‌ తీసుకుని, చెన్నయ్‌లో వాలిపోయారు.. కేవలం టిక్కెట్ల కోసం రజనీకాంత్‌ అభిమానులు. పైగా వారంతా యంగ్‌స్టర్స్‌. 3 వేల నుంచి 10 వేల దాకా బ్లాక్‌ టిక్కెట్‌ ధర పలుకుతోందనీ చెబుతూ, కొందరు అంత రేటు పెట్టి టిక్కెట్లు సొంతం చేసుకోవడం గమనార్హమిక్కడ. 

అసలు 'కబాలి'లో ఏముంటుందో తెలియదు. గత చిత్రాలేమో బాక్సాఫీస్‌ వద్ద అత్యంత దారుణంగా ఫెయిలయ్యాయి. 'కబాలి'పై అంచనాలు మాత్రం ఆకాశాన్నంటేలా వున్నాయి. ఏమిటీ మాయ.? సమాధానం సింపుల్‌.. స్టార్‌ స్టార్‌ సూపర్‌ స్టార్‌.. ఆయనే రజనీకాంత్‌. ఇది 'కబాలి' మాయ.. 'కబాలి' మేనియా.!

Show comments