కాంగ్రెస్ ఘనతని తన ఖాతాకు కోరుకుంటున్న బాబు!

పోలవరంలో లోపాల గురించి ఎవరైనా ప్రస్తావిస్తే చాలు.. చంద్రబాబు నాయుడు అగ్గిమీద గుగ్గిలం అయిపోతారు. వారు రాష్ట్ర ద్రోహులంటూ నిప్పులు చెరగుతారు. తాజాగా కూడా అదే జరుగుతోంది. పోలవరానికి నిధుల విడుదల ఏమౌతోందంటూ పార్లమెంటులో విపక్షసభ్యులు ప్రశ్నించడం వలన రాష్ట్రప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని బయటపెట్టే సంగతులు నిగ్గు తేలుతున్నాయి. ఇవన్నీ ఆయన సహించలేకపోతున్నారు. ఇతర రాష్ట్రాలతో విపక్షాలు కుమ్మక్కయ్యాయంటూ కొత్త పాట పాడుతున్నారు. 

నిజానికి మంచి నాయకుడు అయితే.. ఒక ప్రాజెక్టు నిర్మాణాన్ని లోపాలు లేకుండానే చేయగలగాలి. లేదా, కనీసం విపక్షాలు లోపాలను ఎత్తిచూపించినప్పుడు, జరుగుతున్న జాప్యాన్ని నిలదీసినప్పుడు వాటిని దిద్దుకునే ప్రయత్నం చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు ఆ రెండు పనులూ చేయడం లేదు. ఎవరైతే లోపం గురించి మాట్లాడుతారో.. వారి మీద ఎదురుదాడులకు ప్రయత్నిస్తున్నారు. తాను అధికారంలో ఉన్నాను గనుక.. గట్టిగా డబాయించగలను గనుక.. అలాంటి డబాయింపుల ద్వారా వారి నోర్లు మూయించడానికి ప్రయత్నిస్తున్నారు. పగుళ్ల గురించి ప్రస్తావించినప్పుడు ఇటీవల ఉండవిల్లి మీద గానీ, రివైజ్డ్ ఎస్టిమేట్ల ప్రస్తావన తేగానే ఇవాళ వైకాపా వారి మీద గానీ.. ఆయనది ఇదే తంతు.

అంతకంటె చోద్యం ఏంటంటే... పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ఖాతాకు చెందవలసిన ఘనతను కూడా చంద్రబాబు తన ఖాతాలో రాసుకోవడానికి ఆరాటపడుతుండడం. తెలంగాణలోని ఏడు ముంపు మండలాలను ఏపీలో కలపకుండా ఉంటే గనుక.. అసలు పోలవరం నిర్మాణం సాధ్యం అయ్యేదే కాదని ఆయన అంటున్నారు. కేంద్రంనుంచి తాము ఆ మండలాలను సాధించాం అని ఆయన టముకేసుకుంటున్నారు. కాంగ్రెస్ విభజనచట్టంలో ఓ అంతర్భాగంగా ఏడు మండలాలను ఏపీలోకి మార్చడం గురించి పొందుపరచిన తర్వాత.. చట్టం సభ ఆమోదం పొందింది. కాకపోతే.. ఆ ప్రక్రియ తర్వాత కేబినెట్ భేటీ జరగలేదు గనుక.. సాంకేతికంగా ఆగింది. కొత్తగా వచ్చిన భాజపా సర్కారు.. ఆ సాంకేతిక కేబినెట్ ఆమోదం అనే లాంఛనాన్ని పూర్తి చేసింది అంతే! కాంగ్రెస్ చట్టంలో పెట్టిన అంశాన్ని కూడా తానే కేంద్రం నుంచి సాధించానని చెప్పుకోవడం చంద్రబాబు లోపాయికారీ వైఖరికి నిదర్శనం అని విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఇదెలా ఉన్నదంటే.. మీరు పల్లెటూళ్లో ఉన్న మీ తల్లిదండ్రులకు ఓ వెయ్యిరూపాయలు మనీ ఆర్డర్ పంపుతారు. చివరి అంచెలో పోస్టుమ్యాన్ దాన్ని తీసుకువెళ్లి వారికి అందజేస్తాడు. తన చేత్తో ఆ సొమ్ము వారికి ఇచ్చాను గనుక.. వెయ్యి రూపాయలు ఇచ్చినందుకు గాను వారు తనకు రుణపడి ఉండాలని పోస్టుమ్యాన్ ఆశిస్తే ఎలాగ? ముంపు మండలాల బదలాయింపు విషయంలోనూ తెదేపా, భాజపా ప్రభుత్వాల పాత్ర... పోస్టుమ్యాన్ పాత్ర లాగా సాంకేతికం మాత్రమే. నలభయ్యేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు ఆ మాత్రం లాజిక్ తెలియకపోతే ఎలాగ?

Show comments