రెంటికీ చెడుతున్న రెడ్డి గారు!

మోటుగా చెప్పాలంటే.. ఉన్నదీ పాయె, ఉంచుకున్నదీ పాయె.. అన్నట్టుగా మారోబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేసీ దివాకర్‌ రెడ్డి తీరు, ఆయన రాజకీయ భవితవ్యం గురించి ఊహించి చూస్తే... ఈయన రెంటికీ చెడుతున్నాడేమో అనే అభిప్రాయం కలగక మానదు. నోటి కొచ్చినట్టుగా మాట్లాడుతున్న దివాకరుడిని ఇటు తెలుగుదేశంలో విశ్వసించేది ఉండదు, అటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి వెల్కమ్‌ చెప్పే అవకాశమూ ఉండదన్నట్టుగా మారుతోంది పరిస్థితి.

ముందుగా టీడీపీలో ప్రస్తుతం జేసీ పరిస్థితి గురించి పరిశీలించి చూస్తే.. ఆఖరికి జగన్‌పై అనుచితమైన మాటలు మాట్లాడుతూ, కులం గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు దష్టిలో పడాల్సినంత స్థాయికి దిగజారింది. ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ.. అనే నేపథ్యం ఉన్న వ్యక్తికి ఇంత దుర్భర పరిస్థితి రానేకూడదు. అయితే ఈ పతనావస్థ ఇంతటితో ఆగకపోవచ్చు కూడా! తెలుగుదేశంలో తను ఉన్నాను అని చెప్పుకోవాలన్నా, టీడీపీ అనుకూల మీడియాలో హైలెట్‌ కావాలన్నా.. దివాకర్‌ రెడ్డి ఇకపై మరింత దిగువస్థాయి మాటలు, లేకి వ్యాఖ్యానాలు చేసుకొంటూ కాలం గడపాల్సి ఉంటుంది. అలా చేస్తేనే.. ఆయనను టీడీపీలో పట్టించుకుంటారు!

ఇక్కడ గమనించాల్సిన విషయం మరోటి ఉంది. జేసీకి వచ్చే ఎన్నికల్లో అనంతపురం ఎంపీ టికెట్‌ అయినా లభిస్తుందా? అనేది! అదేంటి.. సిట్టింగ్‌ ఎంపీకి టికెట్‌ కాదంటారా? జేసీ వంటి నేపథ్యం ఉన్న వ్యక్తికి చంద్రబాబు టికెట్‌ ఇవ్వను అంటాడా? అంటే.. నిస్సందేహంగా ఔననే చెప్పాలి. రేపటి ఎన్నికల్లో అనంత నుంచి జేసీ పోటీ చేసినా, చేయకపోయినా.. టీడీపీ తరపు టికెట్‌ అయితే కోరతాడు. తన తనయుడికైనా ఇవ్వమని అంటాడు. అయితే.. జేసీ అనే తలనొప్పిని భరించడానికి 2019 నాటికి చంద్రబాబు ఇష్టపడకపోవచ్చు. 2014లో అంటే.. పదేళ్ల ప్రతిపక్ష వాస నేపథ్యం, ఎవ్వరు వచ్చి చేరినా, ఖర్చు పెట్టగల ఎవరు ముందుకు వచ్చినా.. చంద్రబాబు కాదనలేదు. అయితే 2019 నాటికి బాబుకు అలాంటి అవసరం ఉండదు!

పార్టీలోని పాత కాపులు బాగా సంపాదించుకుంటున్నారు, బాబు సొంత కులస్తులు అనంత నుంచి ఎంపీగా పోటీకి సై అంటున్నారు.. ఇలాంటి నేపథ్యంలో జేసీని బాబు పూర్తిగా పక్కన పెట్టేసినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు! జేసీ అవసరం బాబుకు ఎప్పుడో తీరిపోయింది. తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కడంలేదని ఇప్పటికే దివాకర్‌ రెడ్డి మీడియా ముఖంగా చాలాసార్లు చెప్పుకుని ఆవేదన భరితుడయిపోయాడు. ఇప్పుడు ప్రాధాన్యత దక్కడంలా, రేపు టికెట్‌ దక్కకపోయినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లా!

తెలుగుదేశం పార్టీ అనేది దివాకర్‌ రెడ్డికి సొంతిల్లు లాంటిది ఎప్పటికీ కాదు, కాబోదు. టీడీపీకి ఆయన అవసరం ఇప్పటికే తీరిపోయింది. రేపు దివాకర్‌ రెడ్డి అవసరానికి అనుగుణంగా చంద్రబాబు వ్యవహరిస్తాడంటే చిన్న పిల్లాడు కూడా నమ్మడు! జేసీ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరికీ తెలీదు, ఇప్పుడు జగన్‌ను తిట్టడానికి వెనుకాడని దివాకర్‌ రెడ్డి.. రేపు తను అనుకున్నది దక్కకపోతే ఇవే బూతులు చంద్రబాబు విషయంలోనూ ప్రయోగించగలడు. సో.. దివాకర్‌ రెడ్డి తల గోక్కోవడానికి చంద్రబాబు ఇష్టపడడు. అనంత నుంచి పోటీకి జేసీకి మించిన ప్రత్యామ్నాయాలు బాబుకు ఎన్నో ఉన్నాయి. ఏ పరిటాల శ్రీరామ్‌ కో ఎంపీ టికెట్‌ ఇచ్చేసి.. ఏమైనా చేసేసి గెలిచేసుకో.. అని బాబు అంటే, అప్పుడు దివాకర్‌ రెడ్డి దిక్కులు చూడాల్సి వస్తుంది!

బాబు తదుపరి వ్యూహం కూడా అదే అనేమాట వినిపిస్తోంది. దివాకర్‌ రెడ్డి అనే తలనొప్పిని వదిలించుకోవడానికి ఆయన సిద్ధం అనే అంటున్నారు కొంతమంది టీడీపీ నేతలు. వచ్చే ఎన్నికల్లో అనంత ఎంపీ సీటు ఎట్టి పరిస్థితుల్లోనూ జేసీ ఫ్యామిలీకి దక్కదు అని, అంతగా టీడీపీలో ఉండాలని అనుకుంటే.. జేసీ ఫ్యామిలీకి తాడిపత్రి ఎమ్మెల్యే సీటు వరకూ బాబు ఓకే చెబుతాడు తప్ప.. అంతకు మించిన దశ్యం ఉండబోదని సీమకు చెందిన ఒక టీడీపీ నేత వ్యాఖ్యానించాడు.

ఇదీ టీడీపీలో జేసీ రెడ్డిగారికి ఉన్న విలువ. ఈ పతనావస్థలోనే తన ఉనికిని చాటుకోవడానికి తన కులం పేరును పదే పదే చెప్పుకుంటున్నాడు దివాకర్‌ రెడ్డి. ఈ విషయంలో ఇప్పటికి జేసీని ఎంటర్‌టైన్‌ చేస్తున్న బాబు.. రేపు ఎన్నికల నాటికి పట్టించుకోకపోవచ్చు. మరి అప్పుడు దివాకర్‌ రెడ్డి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడీ కావొచ్చని విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటికే జేసీ- జగన్‌ల మధ్య చర్చల అంకం ముగిసిందని, జిల్లాలో ఒక ఎంపీ సీటు నాలుగు ఎమ్మెల్యే సీట్లను తన కుటుంబీకులకు ఇవ్వాలనే ప్రతిపాదన జేసీ వైపు నుంచి వచ్చిందని, దానికి జగన్‌ సమ్మతించలేదని.. చర్చలు విఫలం అయ్యాకే.. జేసీ తరచూ జగన్‌పై విరుచుకుపడటం జరుగుతోందనే మాట జిల్లాల్లో వినిపిస్తోంది. జేసీతో చర్చలు విఫలం అయ్యాకే.. జగన్‌ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి ఇన్‌చార్జిగా ప్రకటించడం జరిగిందని అనంత జిల్లా జనులు అనుకుంటున్నారు. అంటే వైకాపా వైపు జేసీకి తలుపులు మూసుకుపోయినట్టే. ఇక చంద్రబాబు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు ఐదు సీట్లు ఇచ్చే అవకాశాలు ఉండవు, అంతిమంగా.. తాడిపత్రి ఒక్కటీ ఇస్తాం, ఉంటే ఉండండి పోతే పొండి.. అనే పరిస్థితి ఉంటుందనే మాట తెలుగుదేశం వైపు నుంచి వినిపిస్తోంది. మరి అప్పుడు దివాకర్‌ రెడ్డి ఏం చేస్తాడో!

Show comments