ఐటీ బెంబేలు.. లోకేష్‌ ఎఫెక్టేనా.!

కేసులు పెట్టి బెదిరిస్తున్నాసరే, సోషల్‌ మీడియాలో టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేష్‌ మీద సెటైర్లు ఆగడంలేదు. తాజాగా ఐటీ రంగంలో కుదుపు నేపథ్యంలో చినబాబు లోకేష్ మీద మళ్ళీ సోషల్ మీడియాలో హంగామా షురూ అయ్యింది. అసలు విషయమేంటంటే, గత కొన్నాళ్ళుగా ఐటీ (సాఫ్ట్‌వేర్‌) రంగంలో తీవ్రమైన కుదుపులు ఏర్పడుతోన్న విషయం విదితమే. చాలా కంపెనీలు, సీనియర్‌ ఉద్యోగుల్ని తొలగించే దిశగా చర్యలు ప్రారంభించేశాయి. దాదాపు పదేళ్ళ క్రితం నాటి 'ఐటీ సంక్షోభం' మరోమారు రిపీట్‌ అయ్యే పరిస్థితులున్నాయంటూ ఆ రంగ నిపుణులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

వాస్తవ పరిస్థితులు ఇలా వుంటే, ఆంధ్రప్రదేశ్‌ ఐటీ మంత్రి నారా లోకేష్‌ మాత్రం రానున్న రెండేళ్ళలో ఐటీ రంగంలోనే లక్ష ఉద్యోగాల కల్పన దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఈ మధ్యనే ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. విజయవాడలో పలు ఐటీ కంపెనీల కార్యాలయాల్ని ప్రారంభించిన సందర్భంలో లోకేష్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ, ఇంతలోనే ఐటీ రంగం నుంచి షాకింగ్‌ న్యూస్‌ బయటకొచ్చింది. సుమారు 10 వేల ఉద్యోగాలు.. అదీ హైద్రాబాద్‌లోనే ఐటీ సంస్థల నుంచి 'ఊడిపోవడం' దాదాపు ఖాయమైపోయింది. అంతకన్నా ఎక్కువే ఉద్యోగాలకు రానున్న రోజుల్లో కోత పడ్తుందన్న అంచనాలూ వ్యక్తమవుతున్నాయి. 

దేశ వ్యాప్తంగా ఐటీ రంగాన్ని తీసుకుంటే, హైద్రాబాద్‌ది ప్రత్యేకమైన స్థానం. అలాంటి హైద్రాబాద్‌లోనే ఐటీ రంగానికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే, కొత్త రాష్ట్రం.. ఐటీ రంగంలో ఇంకా సరైన నడకే ప్రారంభించని ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు ఎలా వుండబోతోందట.? ఏమోగానీ, లోకేష్‌ ఎంట్రీ ఇచ్చారు.. ఐటీ రంగానికి దెబ్బ తగిలిందంటూ సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా కామెంట్స్‌ దర్శనమిస్తున్నాయి. 

ఇంకోపక్క, అమెరికా పర్యటనలో వున్న చంద్రబాబు, హైద్రాబాద్‌కి ధీటుగా అమరావతిని ఐటీ రంగంలో అభివృద్ధి చేస్తామంటున్నారు. ఐటీ సంక్షోభం తాత్కాలికమే అయినా, ఆ ఎఫెక్ట్‌ గట్టిగానే వుంటుంది. మరి, ఐటీ రంగం మీద ఆంధ్రప్రదేశ్‌.. అందునా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్‌ పెట్టుకున్న ఆశలు ఏమవుతాయట.? వేచి చూడాల్సిందే. Readmore!

Show comments