ఓ పక్క ఆర్థిక సంక్షోభం...మరోపక్క విదేశీ పర్యటనలు...!

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడి పాలన చూస్తుంటే  విచిత్రంగా అనిపిస్తుంది. బాబు నోట ఎప్పుడూ ఆర్థిక సంక్షోభమన్న మాటే వినిపిస్తూ ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని, కట్టుబట్టలతో బయటకు వచ్చామని, రాజధాని లేకుండా పంపారని, ఇది మనం కోరుకున్న విభజన కాదని...ఇలా వేసిన రికార్డే వేస్తుంటారు. మరో పక్క రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోందని, అంత వృద్ధి రేటు సాధించామని, ఇంత వృద్ధి సాధించామని చెప్పుకుంటారు. ఇందులో ఏది నిజమో అర్థం కాదు సామాన్యులకు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని చెబుతూనే లావిష్‌గా (విచ్చలవిడిగా) ఖర్చు చేసిన, చేస్తున్న సందర్భాలు అనేకమున్నాయి. 

విభజన కారణంగా ఏపీకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. కాని డబ్బు దుబారా ఆగలేదు. దాదాపు రెండు వారాల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లు రద్దు చేసినప్పటినుంచి ఆర్థిక సంక్షోభం మరింత ఎక్కువైందని పాలకులు చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిదీ ఇదే మాట. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా పైసల్లేవని అంటున్నారు. ఓవర్‌డ్రాఫ్ట్‌ తెచ్చుకుంటేగాని గడవని పరిస్థితి ఉందంటున్నారు. నోట్ల రద్దు తరువాత ఎక్కువగానో తక్కువగానో ప్రతి రాష్ట్రంలోనూ ఆర్థిక సంక్షోభం ఉన్న మాట వాస్తవం.  ఇలాంటప్పుడు ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కదా. 

ఆర్థిక క్రమ శిక్షణను కఠినంగా అమలు చేయాలి కదా. ఇతర రాష్ట్రాలు ఏం చేస్తున్నాయనేది అలా ఉంచితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం ఇంత ఆర్థిక సంక్షోభంలోనూ యథాతథంగా దుబారా ఖర్చులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏమిటా దుబారా? విదేశీ పర్యటనలు. బాబు సర్కారు చేస్తున్న దుబారా ఖర్చుల్లో ప్రధానమైనవి విదేశీ పర్యటనలు. ఇందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విదేశీ రాజధానుల అధ్యయనం, పెట్టుబడుల సమీకరణ, విదేశీ రోడ్ల అధ్యయనం, రకరకాల సమావేశాలు...ఇలా ఏదో పేరుతో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు విదేశాలకు వెళ్లొస్తూనే ఉన్నారు. 

ఈ పర్యటనలకు ఎంత ఖర్చు చేస్తున్నారో కూడా సరిగా తెలియదు. కేసీఆర్‌ ఒకటి రెండుసార్లు వెళ్లారేమోగాని బాబుకు మాత్రం విదేశాలకు తిరగడమే పని. ఈ విషయంలో ప్రధాని మోదీ తరువాత ఈయనదే రికార్డు. సరే...అసలు విషయానికొస్తే ప్రస్తుతం నోట్ల రద్దు కారణంగా దేశాన్ని ఆర్థిక సంక్షోభం కుదిపేస్తున్న నేపథ్యంలో పదిహేను మంత్రులు, అధికారులకు  (సివిల్‌ సర్వీసు) పైగా విదేశీ పర్యటనలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం దాదాపు ప్రతి రోజు విదేశీ పర్యటనలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తుండటం విశేషం. ఏపీ విద్యాశాఖ (మానవ వనరుల) మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈయన వెంట అధికారుల బృందం కూడా ఉంది. 

మంత్రులు విదేశాలకు వెళితే అధికారుల బృందాలు ఉండాల్సిందే కదా...! ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ నెల (నవంబరు) 27 నుంచి డిసెంబరు 3 వరకు న్యూజీల్యాండ్‌, ఆస్ట్రేలియాలో పర్యటిస్తారు. ఎనర్జీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌, ఆర్థిక శాఖ కార్యదర్ధి రవిచంద్రన్‌ రెండు దేశాలకు వెళుతున్నారు. మున్సిపల్‌ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌ ప్రస్తుతం జపాన్‌ పర్యటనలో ఉన్నారు. ఫిషరీస్‌ కమిషనర్‌ నార్వే వెళ్లారు. హోం శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి స్పెయిన్‌ వెళ్లబోతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు విదేశాలకు వెళ్లకూడదని ఎవ్వరూ అనరు. 

కాని తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు కూడా వెళ్లడం అవసరమా? అనేది ప్రశ్న. ఈ పర్యటనల్లో ప్రాధాన్యం ఉన్నవి ఎన్నో, ఇప్పటికిప్పుడు వెళ్లకపోయినా కొంపలు మునగవు అనుకునేవి ఎన్నో తెలియదు.  ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఉందని చెబుతూనే భారీగా విదేశీ పర్యటనలకు వెళుతుండటం చూస్తుంటే సామాన్య జనం దీన్ని దుబారా ఖర్చనే అంటారు. ప్రధాని మోదీ కూడా నోట్లు రద్దు నిర్ణయం ప్రకటించిన తెల్లవారే విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు. ఆయన వచ్చాకగాని తన నిర్ణయ విశ్వరూపం ఏమిటో తెలియలేదు. 

విదేశీ పర్యటనలకు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని విమర్శించడానికి మరో కారణం ఏమిటంటే ఈ పర్యటనలకు ఎంత ఖర్చు చేస్తున్నారో, పర్యటనల ఫలితాలు ఏమిటో, సాధించిన ప్రయోజనాలు ఏమిటో పాలకులు ప్రజలకు వివరించడంలేదు. చంద్రబాబు సర్కారు విదేశీ పర్యటనలకు ఖర్చు పెడుతున్న తీరు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నిజంగా ఉందా? అనే అనుమానం కలుగుతోందని విశ్లేషకులు అంటున్నారు. 

Show comments