రాక రాక వచ్చిన అవార్డ్‌ మరి.!

కమర్షియల్‌ హీరోగా ఎన్నో విజయాల్ని అందుకున్నాడు.. యాక్షన్‌ హీరోగా సినిమాల కోసం ఎన్నో రిస్క్‌లు చేశాడు.. స్టార్‌డమ్‌ పక్కన పెట్టి, కామెడీతో కూడిన సినిమాలు చేశాడు.. ప్రస్తుతం సీరియస్‌ మూవీస్‌పై ఫోకస్‌ పెట్టి, ఆ పంథాలో విజయాల్ని అందుకుంటున్నాడు.. అతనెవరో కాదు, బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌. 

రాక రాక జాతీయ అవార్డ్‌ వస్తే, 'ఇంతకన్నా పోటుగాడు బాలీవుడ్‌లో లేడా.?' అని కొందరు ఔత్సాహిక నెటిజన్లు, అక్షయ్‌కుమార్‌పై దుమ్మెత్తిపోశారు. అమీర్‌ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌.. ఇలా చాలామందే వుండగా, 'వెకిలి' అక్షయ్‌కుమార్‌కి ఎందుకు జాతీయ పురస్కారమనే విమర్శలకు అక్షయ్‌కుమార్‌ గట్టిగానే సమాధానమిచ్చాడు. 

''నేనెప్పుడూ అవార్డుల్ని కోరుకోలేదు.. ఇన్నాళ్ళకు అవార్డు వచ్చింది.. అది నాకొక గౌరవంగా భావించాను.. దానికి నేను అర్హుడ్ని కాననుకుంటే, దాన్ని మీరే తీసుకోండి.. ఎవరికి అవార్డులు వచ్చినా, ముందు నేనే సంతోషిస్తాను.. వారిని అభినందిస్తాను.. దురదృష్టవశాత్తూ నా విషయంలో ఇంత రాద్ధాంతం జరుగుతోంది. అవార్డులు వచ్చినప్పుడు ఫలానా వ్యక్తికి అవార్డు ఎందుకు వచ్చిందనే విమర్శలు ఎలా పుట్టుకొస్తాయో నాకు అర్థం కావడంలేదు..' అంటూ అక్షయ్‌కుమార్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 

నిజమే మరి, అవార్డుల విషయంలో అక్షయ్‌కుమార్‌ ఆవేదనకు అర్థం వుంది. జాతీయ అవార్డు అయినా, ఇంకోటైనా.. ఆయా అవార్డుల విషయంలో రాజకీయాలు జరుగుతున్నమాట వాస్తవం. అందుకే, ఒక్కోసారి 'సరైన వ్యక్తులకు' అవార్డులు వచ్చినా, అవి వివాదాస్పదమవుతున్నాయి. రాష్ట్రాల స్థాయిలో దక్కే అవార్డులతోపాటు, జాతీయ స్థాయి అవార్డులూ ఇందుకు మినహాయింపేమీ కాదు. పద్మ పురస్కారాల విషయంలోనే రాజకీయాలు రాజ్యమేలుతున్నవేళ, జాతీయ అవార్డుల గురించి విశ్లేషించుకోవడం హాస్యాస్పదం కాక మరేమిటి.?

Show comments