వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న టీడీపీ నాయకుల్లో కొందరికి తీవ్ర నిరాశకలగక తప్పదు. అసెంబ్లీ సీట్లు పెంచితే టీడీపీ నాయకులందరూ పోటీ చేయవచ్చని భావిస్తున్నారేమో. ఒకవేళ అసెంబ్లీ సీట్లు పెరిగితే ఆ రేంజ్‌లోనే కొందరు 'పచ్చ' నాయకులకు ఏడుపు తప్పదు. ఇందుకు కారణం బీజేపీ ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడమే. గత ఎన్నికల్లో కమలం పార్టీకి చాలా తక్కువ సీట్లు కేటాయించిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో మాత్రం భారీగానే ముట్టచెప్పుకోవల్సిన పరిస్థితి కనబడుతోంది.
ఉత్తరాదిలో విజయాల కారణంగా ఏపీలోనూ ఆదరణ పెరిగిందని కమలం పార్టీ నాయకులు భావిస్తున్నారు. దీంతో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని ఆత్రంగా ఉన్న ఆ పార్టీ పది లోక్‌సభ సీట్లు, యాభై అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేయాలనుకుంటోందిట...! ప్రస్తుతానికి ఇలా ఆలోచిస్తున్న ఆ పార్టీ ఎన్నికలు దగ్గర పడిన తరువాత ఏం మెలిక పెడుతుందో...! కాషాయ పార్టీ డిమాండ్లకు బాబు ఒప్పుకుంటే చాలామంది టీడీపీ నేతలకు టిక్కెట్లు రావు. రానివారిలో కొందరు వేరే మార్గాలు వెతుకుతారేమో..!