ఇదేంది జానా సారూ...!

ఇందుకే.. కేసీఆర్ కూడా బిందాస్ గా ఉన్నాడు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ దూసుకుపోతోంది కానీ, తెలంగాణలో తన చాప కిందకు నీరొచ్చే అవకాశం లేదని అంటున్నాడు. చంద్రబాబు అన్ లక్కీ.. జగన్ లాంటి ప్రతిపక్ష నేత తగిలాడు, కేసీఆర్ లక్కీ.. తెలంగాణ కాంగ్రెస్ కు ఇలాంటి లీడర్లు దొరికారు. పార్టీ లైన్ అండ్ లెంగ్త్ ను కూడా వీళ్లు అందిపుచ్చుకోపోతుండటమే వీరి వైఫల్యాన్ని చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యేలా చేస్తోంది.

మరి లైన్ అండ్ లెంగ్త్ ను అందిపుచ్చుకోలేకపోతున్నది అర్రీబుర్రీ లీడర్లు కాదు... పార్టీకి మెజారిటీ వస్తే ముఖ్యమంత్రి నేనే.. అని చెప్పుకునే వ్యక్తి తనేం మాట్లాడుతున్నాడో అర్థం కానట్టుగా మాట్లాడుతున్నాడు. ఇదంతా ది గ్రేటా జానా రెడ్డి వారి గురించి.. ఇంతకీ విషయం ఏమిటంటే, ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ చేత ప్రకటించబడిన వెంకయ్యనాయుడిని ఆకాశానికి ఎత్తేశారు జానారెడ్డి. వెంకయ్యకు తెలంగాణలో ఏర్పాటు చేసిన సన్మాన సభకు జానా హాజరయ్యాడు.

హాజరుకావడమే కాదు.. వెంకయ్యను ఒక రేంజ్ లో ప్రశంసించాడు.ఆయనొక మేధావి అని, అనితర సాధ్యుడు అని, ఆయన అదనీ.. ఇదనీ.. అనడమే కాదు... వెంకయ్య ఉప రాష్ట్రపతి మాత్రమే కాదు... రాష్ట్రపతి కూడా కావాలని జానారెడ్డి ఆకాంక్షించాడు. భలే ఉంది కదా! వెంకయ్యనాయుడిని ఇంతలా భుజానికి ఎత్తుకుంటున్నది ఈ బీజేపీ వాళ్లో, తెలుగుదేశం వాళ్లో అంటే అదో లెక్క. వెంకయ్య రాష్ట్రానికి ఎంతో చేసేశాడని. .వాళ్లు చెబితే ఏదో జాతి లక్షణం అనుకోవచ్చు.

కానీ.. జానారెడ్డి ఇలాంటి ప్రశంసించేయడం పరమ విడ్డూరం. ఎందుకంటే.. అవతల వెంకయ్య నాయుడిపై కాంగ్రెస్ నేషనల్ లీడర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. జైరాం రమేశ్ అయితే.. నాలుగు ప్రశ్నలను పట్టుకుని వెంకయ్యను ఊపి నీళ్లు తాపుతున్నాడు. నాలుగు ప్రశ్నలకూ సూటిగా సమాధానం ఇవ్వరేంటి, తప్పించుకునే యత్నం చేస్తున్నారేంటి అని జైరాం దుమ్మురేపుతున్నాడు.

అంతేకాదు.. ఉప రాష్ట్రపతిగా వెంకయ్య అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ సమర్థించడం లేదు. వెంకయ్యకు వ్యతిరేకంగా గాంధీ మనవడిని బరిలో నిలిపింది కాంగ్రెస్ పార్టీ. వెంకయ్యను ఓడించడానికి అనేక పార్టీలను కలుపుకుపోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. వెంకయ్య ను ఓడించడమే లక్ష్యమని అంటోంది.

కాంగ్రెస్ హై లెవల్లో వెంకయ్యపై అలాంటి పోరాటం జరుగుతుంటే.. జానా రెడ్డి మాత్రం వెంకయ్య ఉప రాష్ట్రపతిగా కాదు, రాష్ట్రపతి కావాల్సిన వ్యక్తి అని చెబుతున్నాడు. మరి తమ పార్టీ అజెండా ఏమిటో కూడా తెలుసుకుని మాట్లాడలేని వ్యక్తి సీఎల్పీ లీడర్! వీళ్లను కాదు.. ఇలాంటి వాళ్లను నమ్ముకుని రాష్ట్రాన్ని విడదీసినందుకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు గోడకేసి తమ తలలు బాదుకోవాలి!

Show comments