తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బలే తప్ప ఏ విషయంలోనూ ప్రభుత్వంపై పైచేయి సాధించింది లేదు. అసెంబ్లీలో ప్రశ్నల ప్రస్తావనలోనూ టీఆర్ఎస్ టీడీపీ గొంతునొక్కేసింది. ప్రభుత్వం అనైతికంగా మొదలుపెట్టిన ఆకర్ష్ విషయంలోనూ ఏమి చేయలేక సరెండర్ అయింది. దాదాపు తెలంగాణలో పార్టీని ఖాళీ చేసుకుంది. ఇక తెలంగాణలో తెలుగుదేశం లేదు, దాని పని ఖతం అనుకుంటున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా చేయలేని ఓ పనిని తలపెట్టి విజయం సాధించడం విశేషం. అది కూడా ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకే ముప్పు తెచ్చిపట్టినంత పనిచేసిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ద్వారానే లభించడం గమనార్హం.
ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న అంశం ఏదైనా ఉందా అంటే అది మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం. దాని నిర్వాసితులకు అందచేయాల్సిన నష్టపరిహారం. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ వట్టి మాటలతోనే సరిపెట్టింది. ఉన్నట్టుండి తెరపైకి వచ్చిన టీజేఏసీ చైర్మన్ సర్కారును కొంత మేర ఇబ్బంది పెట్టినా తర్వాత సైలెంట్ అయ్యాడు. ప్రభుత్వం ఎదురుదాడిని సమర్థవంతంగా ఎదుర్కునే శక్తి టీజేఏసీకి ఉన్న అది ఎందుకో మల్లన్న సాగర్ విషయంలో ముందుకు పోయేందుకు సాహసించలేదు. కానీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ఒకే దెబ్బతో కేసీఆర్ మెడలు వంచినంత పనిచేసింది. ఆయనే స్వయంగా దిగివచ్చి రేవంత్ రెడ్డి డిమాండ్ ను ఒప్పుకున్నాడు.
తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మొదటి నుంచి ఒకే ఒక్కడు తరహాలో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి ఆ పార్టీకి తెలంగాణలో ప్రజాసమస్యల పరిష్కారం విషయంలో తొలి విజయాన్ని అందించడం నిజంగా చెప్పుకోదగ్గ సంగతే.. మల్లన్నసాగర్ ముంపు బాదితులకు నష్టపరిహారం విషయంలో 2013 భూసేకరణ చట్టంకు బదులు తెలంగాణ ప్రభుత్వం జీఓ 123ని తెచ్చింది. అక్కడి భూమికి ఎకరాకు రూ.5,85వేలు పరిహారం ఖరారు చేసి వన్ టైం సెటిల్ మెంట్ కింద భూసేకరణ చేయాలని నిర్ణయించింది. దీనిని మొదట రాజకీయ పక్షాలు పట్టించుకోలేదు. నిర్వాసితులే దీనిని వ్యతిరేకించి ఆందోళనకు దిగారు.
దీంతో ప్రతిపక్షాలు అప్రమత్తమయ్యాయి. జీఓ 123ను ఉపసంహరించుకోవాలని పెద్దగా ముంపు బాదితుల ఆందోళనలో పాల్గొని హంగామా చేయలేకపోయాయి. టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ వెళ్లి ముంపు బాదితుల ఆందోళన శిబిరంలో పాల్గొనడం, చేతకాకపోతే ప్రభుత్వం గద్దెదిగాలని సంచలన వాఖ్యలు చేయడంతో కేసీఆర్ సర్కార్ ఒక్కసారి ఉలిక్కిపడింది. వెంటనే స్పందించి టీఆర్ఎస్ మంత్రులు కోదండరాంపై ఎదురుదాడికి దిగారు. ఈ వ్యవహారం కొన్ని రోజులు రాజకీయంగా రాజుకుని కేసీఆర్ కు ఇబ్బంది పెట్టే విధంగానే తయారైంది. ఇంతలో కోదండరాం సైలెంట్ అయ్యారు.
వెంటనే టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ముంపు బాధితుల్లో జీఓ123 పట్ల ఉన్న తీవ్రమైన వ్యతిరేకతను గమనించారు. ఈ విషయంలో స్థానిక టీఆర్ఎస్ నేతలు, శ్రేణులే ప్రభుత్వానికి రివర్స్ అయిన విషయం గమనించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే అక్కడ రెండు రోజుల నిరవధిక దీక్షకు దిగాడు. తనదైన రీతిలో మాటల వర్షం కురిపించాడు. నిర్వాసితులు అప్పటికే ఈ విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో రేవంత్ దీక్షకు అపూర్వమద్దతు లభించింది.
అసలే కేసీఆర్ సొంత జిల్లా, తన ఫాం హౌజ్ కు కూత వేటు దూరంలో ఉన్న ప్రాంతం. స్థానిక తీవ్రతను అంచనా వేసి వెంటనే అలర్ట్ అయిన సీఎం వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేయించారు. నిర్వాసితులు ఎలా కోరుకుంటే అలా అన్నాడు. 2013 చట్టం లేదా 123 జీఓలలో దేని ప్రకారం కావాలంటే దాని ప్రకారం పరిహారం, ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నారు అంతకు ముందే సాగునీటి మంత్రి హరీష్ రావు ఓ మీడియాలో తన ఇంటర్వూను ఇప్పించుకున్నారు. దీనిలో హరీష్ పూర్తిగా రేవంత్ రెడ్డి వైఖరిని తూర్పార పట్టి తనదైన శైలిలో రేవంత్ వైఖరిని తప్పుపట్టించే ప్రయత్నం చేశారు.
దీక్షకు లభించిన మద్దతు చూసి హరీష్ కూడా స్పందించి నిర్వాసితుల ఏది కోరుకుంటే అదే అమలు చేస్తామని ప్రకటన చేశారు. ఇలా మొత్తం మీద రేవంత్ రెడ్డి టీడీపీకి తెలంగాణలో తొలి విజయాన్ని అందించారు. ఇది కొంతలో కొంత నైరాశ్యంలో ఉన్న టీటీడీపీలో ఉత్సాహాన్ని నింపింది. మరో వైపు టీఆర్ఎస్ ను అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రమైన ఇరకాటంలో పెట్టింది. ఇప్పుడే అసలు సమస్యను సర్కారు ముందుంచింది.
వన్ టైం సెటిల్ మెంట్ కదా అని ప్రభుత్వమే ఎకరాకు 5.85లక్షలు ధర నిర్ణయించింది. 2013 చట్టప్రకారం అక్కడి ధరకు రెండు, లేదా మూడు రెట్లు ఎక్కువ చెల్లించాలి. అంటే పరిహారం తడిసిమోపెడవుతుంది. ఇలా చేస్తుందా... లేక భూమి ధర విషయంలో మరేదైనా నిర్ణయం తీసుకుంటుందా.. అలా తీసుకుంటే అది మరో ఆందోళనకు దారితీస్తుంది.