'నిజం' నిప్పులాంటిదేగానీ...

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది నిజం. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు పాసయ్యింది నిజం. లోక్‌సభలో ఆ బిల్లు పాస్‌ అయ్యిందన్నది నిజమేనా.? ఇది మాత్రం ఎప్పటికీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. పాస్‌ అయ్యిందనిపించింది యూపీఏ ప్రభుత్వం పాస్‌ కాలేదని యూపీఏ హయాంలో అధికార పార్టీ ఎంపీగా పనిచేసిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చెబుతున్నారు. ఆ సమయంలో సభలో జరిగిన పరిస్థితులపై అప్పటి కేంద్ర మంత్రి, తెలంగాణ నేత జైపాల్‌రెడ్డి, తనకు తోచిన భాష్యం చెప్పడం తప్ప, ఉండవల్లి వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండించలేని పరిస్థితి. 

అసలు అక్కడేం జరిగింది.? దేశ ప్రజలకు తెలియాల్సిన విషయమిది. చట్ట సభలకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌లో సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకునే పరిస్థితి లేదట. కాబట్టి, సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినా, ప్రజలకు వాస్తవం ఏంటో తెలియదు. సమాచార హక్కు చట్టంతోనూ ఉపయోగం లేదు. మరెలా.? నిజం నిప్పులాంటిదే. కానీ, దాన్ని 'పార్లమెంటులో' లాక్‌ చేసేస్తే ఎలా.? 

ఇప్పుడు కాకపోతే ఇంకో ఏడాదికి.. కుదరకపోతే ఐదేళ్ళకి.. లేదంటే పదేళ్ళకి.. పాతికేళ్ళకి.. ఎప్పుడో ఓ చోట ఆ నిజం బయటపడ్తుందా.? లేదంటే, శాశ్వతంగా ఆ నిజానికి పాతరేసేశారా.? అసలేంటి ఆ నిజం.? ఇది తెలంగాణకు సంబంధించిన విషయం కాదు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన విషయం అసలే కాదు. చట్ట సభలకు సంబంధించిన ప్రశ్న అది. 

అందరికీ తెల్సిన విషయమే, ఆ సమయంలో యూపీఏకి బొటాబొటి మెజార్టీ మాత్రమే వుంది. అసలు మెజార్టీ లేకుండా, అధికార పార్టీకి చెందిన సీమాంధ్ర ఎంపీలు చేసేశారు. ఆ ఎంపీలు తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాక, ఆ ప్రభుత్వం పార్లమెంటులో ఏ బిల్లుని అయినా ఎలా పాస్‌ చేయించగలదు.?  Readmore!

ఒకటీ, సీమాంధ్ర ఎంపీలు తమ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకుని వుండాలి. అప్పుడు మాత్రమే, సభలో ఏ బిల్లుని అయినా యూపీఏ సర్కార్‌ పాస్‌ చేసుకోవడానికి వీలుందన్నది చాలామంది అభిప్రాయం. నిజానికి అభిప్రాయాలతో సంబంధం లేదిక్కడ. అక్కడ పని జరిగిపోయిందా.? లేదా.? అన్నదే ముఖ్యం. అందునా, కొన్ని అమెండ్‌మెంట్స్‌పై ఓటింగ్‌ జరగకుండా, వాటిని వెనక్కి తీసుకోకుండా బిల్లు ఎలా పాస్‌ అవుతుందన్నదీ ఇంకో చర్చ. దేనికీ సమాధానాల్లేవు. 

జరిగిందేదో జరిగిపోయింది. జరిగిపోయిన విభజన రద్దవ్వాలని అయితే ఎవరూ కోరుకునే పరిస్థితి లేదు. కానీ, వాస్తవం ఏంటో ప్రజలకు తెలియాలి. ప్రతిపక్షం, అధికారపక్షం ఒక్కటైతే చట్ట సభల్లో ఏదైనా చేసెయ్యొచ్చన్న విధానమే మారాలి. అప్పుడు విభజించేశారు, రేప్పొద్దున్న అధికార - ప్రతిపక్షాలు కలిసిపోయి.. విడిపోయిన రాష్ట్రాల్ని కలిపేస్తే.? ఇంకో రాష్ట్రాన్ని విభజించేస్తే.. అడ్డగోలుగా ప్రజా వ్యతిరేకమైన చట్టాలు చేసేస్తే... ఇలా సవాలక్ష ప్రశ్నలు. 

అందుకే, నిజం నిగ్గుతేలాల్సిందే. తేలుతుందా.? చర్చ అయితే మొదలయ్యింది. ఉండవల్లి వ్యాఖ్యలతో జైపాల్‌రెడ్డ్‌ దాదాపుగా ఏకీభవిస్తూ కొన్ని విషయాల్లో మాత్రం ఆయనతో విభేదిస్తున్న దరిమిలా.. ఈ చర్చ రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.

Show comments