కేటీఆర్‌ దెబ్బకి విలవిల్లాడుతున్న చంద్రబాబు.?

పైకి కనిపించడంలేదుగానీ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు విలవిల్లాడుతున్నారట. తానేమో హైటెక్‌ చంద్రబాబునంటూ ప్రచారం చేసుకుంటోంటే, హైద్రాబాద్‌ ఐటీకి తానే బ్రాండ్‌ అంబాసిడర్‌ననిపించుకుంటున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. ఇదే ఇప్పుడు చంద్రబాబుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం విస్తరించడం మాట తర్వాత.. అసలంటూ బీజం కూడా పడే పరిస్థితి లేదాయె. అదే సమయంలో హైద్రాబాద్‌లో ఐటీ వెలుగులు మరింత బాగా కనిపిస్తున్నాయి. 

ఈ విషయంలో మాత్రం కేటీఆర్‌కి ఎవరైనా హేట్సాఫ్‌ చెప్పాల్సిందే. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత హైద్రాబాద్‌లో ఐటీ వెలుగులు తగ్గిపోతాయని అంతా అనుకున్నారు. హైటెక్‌ చంద్రబాబు, హైద్రాబాద్‌లో హైటెక్‌ సిటీ నిర్మించాకే సాఫ్ట్‌వేర్‌ రంగం అభివృద్ధి చెందిందనీ, ఆ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అవడంతో, విశాఖతోపాటు తిరుపతిలోనూ ఐటీ రంగం విస్తరిస్తుందనే ప్రచారం టీడీపీ వర్గాలు గట్టిగా చేశాయి. 

ఇప్పుడేమో పరిస్థితులు మారిపోయాయి. ఐటీ రంగానికి సంబంధించినంతవరకు ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగు స్థానంలో వుంది. ఏమాత్రం పైకి ఎగబాకే పరిస్థితి లేదక్కడ. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు, హుద్‌హుద్‌ తుపాను విశాఖ ఐటీ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. అప్పటినుంచీ ఇప్పటిదాకా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో సాఫ్ట్‌వేర్‌ రంగం.. అన్న ఊసెత్తలేదు. కానీ, పదే పదే తనను తాను హైటెక్‌ చంద్రబాబునని ప్రమోట్‌ చేసుకుంటున్నారు. 

ఇదిలా వుంటే, తెలంగాణ మంత్రి కేటీఆర్‌.. బీజేపీతో టీఆర్‌ఎస్‌ దగ్గరవుతోందన్న సంకేతాలు పంపారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయను కలిసి హైద్రాబాద్‌ అభివృద్ధిపై కేటీఆర్‌ చర్చలు జరపడంపై చంద్రబాబు ఆరా తీస్తున్నారట. 'కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా వున్నాం..' అని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యల్ని చంద్రబాబు చాలా లోతుగా పరిశీలించాల్సి వుందిప్పుడు. టీడీపీతో తెలంగాణలో ఇక వేగలేం, వెలగలేం.. అనే విషయం బీజేపీకి అర్థమయిపోయింది. ఆ దిశగా తెలంగాణ బీజేపీ శ్రేణులకు బీజేపీ జాతీయ నేతలు సంకేతాలు కూడా పంపేశారు. ఈ మధ్యకాలంలో బీజేపీ - టీడీపీ నేతలు కలిసి కనిపించింది లేదు. పాలేరు ఉప ఎన్నిక విషయంలో టీడీపీ - కాంగ్రెస్‌కి మద్దతివ్వడంతో బీజేపీ మరింత ఆగ్రహంతో రగిలిపోయింది.  Readmore!

సరిగ్గా టైమ్‌ చూసి, తెలంగాణ ముఖ్యమంత్రి.. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బీజేపీతో సఖ్యతకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగానే కేటీఆర్‌, బండారు దత్తాత్రేయతో సమావేశమవడం, నరేంద్రమోడీ సర్కార్‌ని కేసీఆర్‌ పొగిడేయడం జరిగాయన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం. ఇదంతా చూశాక చంద్రబాబు కంగారుపడకుండా వుండగలరా.? ఛాన్సే లేదు. బీజేపీ అధిష్టానంతో, 'మన మైత్రి చెడిపోదు కదా.?' అంటూ ఆల్రెడీ చర్చలు కూడా జరిపేశారట. మరోపక్క తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం, బీజేపీ కారణంగా కోల్పోయిందే తప్ప, లాభపడిందేమీ లేదంటూ బీజేపీని లైట్‌ తీసుకుంటుండడం గమనార్హం. 

మొత్తమ్మీద, వయసులో చిన్నోడే అయినా, చంద్రబాబుని చాలా గట్టిగా దెబ్బ కొట్టేశారు పరోక్షంగా. ఈ దెబ్బకు విలవిల్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణలో బీజేపీ - టీడీపీ శ్రేణుల మధ్య ఐక్యత పెంచగలుగుతారా.? బీజేపీ, తెలంగాణలో టీడీపీతో కలిసి ఇంకెన్నాళ్ళు అంటకాగుతుంది.? వేచి చూడాల్సిందే.

Show comments