ఎమ్బీయస్‌: ఓర్లాండో ఘటనలో ఐసిస్‌ పాత్ర

అమెరికాలోని ఫ్లారిడా రాష్ట్రంలో వున్న ఓర్లాండో నగరంలో 2016 జూన్‌ 12 న ''పల్స్‌'' అనే గే నైట్‌ క్లబ్‌లో వరుస కాల్పులతో 49 మంది ప్రాణం తీసి, యింకా అనేకమందిని గాయపరచి, చివరకు పోలీసుల చేతిలో హతమైన 29 ఏళ్ల ఒమర్‌ మతీన్‌ 911కు ఫోన్‌ చేసి తన ఘనకార్యం చెప్పి పోలీసులతో తను ఐసిస్‌ కార్యకర్తనని చెప్పుకోవడం విదితమే. ఈ సందర్భంలో ఐసిస్‌ యీ ఘోరకార్యాన్ని ఎలా నిర్వహించింది అనేది ఆసక్తిదాయకంగా మారింది. ఐసిస్‌ ఒమర్‌ను తన వద్దకు పిలిపించి శిక్షణ శిబిరాలలో సిద్ధాంతాలు నూరిపోసి ఫలానా విధంగా దాడి చేయి అని నేర్పిందా? మారణాయుధాలలో తర్ఫీదు యిచ్చిందా? అతనికి మారణాయుధాలు సరఫరా చేసిందా? లేదు! అమెరికా పౌరులనే, అమెరికా సమాజంలోని పరిస్థితినే మారణాయుధాలుగా మార్చి తన లక్ష్యం సాధిస్తోంది. ''టైమ్‌'' పత్రిక వ్యాఖ్యానించినట్లు సెప్టెంబరు 11 ఘటనలో ఉగ్రవాదులు అమెరికన్‌ విమానాలనే తమ బాంబులుగా మార్చారు. ఇరాక్‌లో అమెరికన్‌ నాయకుల అహంభావాన్ని స్థానికుల తిరుగుబాటుగా మార్చారు. ఇప్పుడు ఓర్లాండో విషయంలో తీవ్రస్వభావం కల ఒక అమెరికన్‌ పౌరుణ్నే తమ ఆయుధంగా మలుచుకున్నారు. ఆ తీవ్రస్వభావి యింతటి ఘాతుకాన్ని నిర్వహించేందుకు తగిన భూమికను అమెరికన్‌ సమాజం సమకూర్చింది.

ఒమర్‌ తండ్రి మీర్‌ సెద్దిక్‌ మాటీన్‌ ఆఫ్గనిస్తాన్‌లోని నుంచి వలస వచ్చి అమెరికాలో స్థిరపడ్డాడు. ఇన్సూరెన్సు వ్యాపారంలో బాగా గడించాడు. అతనొక వింత మనిషి. తనను తాను ఆఫ్గన్‌ పాలకుడిగా భావించుకుంటూ ఇంటర్నెట్‌లో ఒక టీవీ షో ద్వారా ఆఫ్గనిస్తాన్‌పై తన భావాలు వ్యాప్తి చేసుకుంటూ వుంటాడు. పష్తూన్‌ జాతీయవాదిగా కనబడతాడు. సోషల్‌ మీడియాలో ఆఫ్గన్లకు ఆదేశాలు యిస్తూ వుంటాడు, అవి పట్టించుకునేవారెవరూ లేకపోయినా! ఒకసారి తాలిబన్లకు అనుకూలంగా, మరోసారి ప్రతికూలంగా మాట్లాడుతూ వుంటాడు. అతనికి  రాజకీయాలపై తప్ప మతంపై ఆసక్తి లేదు. 

ఒమర్‌ న్యూయార్క్‌లో పుట్టి ఫ్లారిడాలో హైస్కూలు చదువు చదివాడు. కొంతకాలం విటమిన్‌ సప్లయి దుకాణంలో గుమాస్తాగా పనిచేశాడు. పోలీసు అవుదామనుకుని,  ప్రిజన్‌ గార్డు అయ్యి, తర్వాత సెక్యూరిటీ ఆఫీసరయ్యాడు. ప్రపంచంలో కల్లా పెద్దదైనా బ్రిటిష్‌ డిటెక్టివ్‌ ఏజన్సీ జి4ఎస్‌, 2007లో అతనికి తమ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా వుద్యోగం యిచ్చినపుడు రెండు రౌండ్లలో అతని నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అతనిలో అనుమానించ దగినది ఏమీ లేదని భావించింది. ఎఫ్‌బిఐ అతన్ని విచారించిన తర్వాత కూడా ఉద్యోగం పీకేయలేదు. నిజానికి అతనిపై ఏ క్రిమినల్‌ రికార్డూ లేదు. ఒకే ఒక్కసారి ట్రాఫిక్‌ నిబంధనలు వుల్లంఘించి జరిమానా కట్టడం తప్ప, అతనికి వ్యతిరేకంగా ఏ సాక్ష్యమూ లేదు.

ఉజ్బెకిస్తాన్‌కు చెందిన సితోరా యూసుఫీ అనే న్యూజెర్సీ నివాసి అతనికి ఆన్‌లైన్‌లో పరిచయమైంది. 2009లో అతన్ని పెళ్లాడి ఫ్లారిడాకు వచ్చింది. పెళ్లయ్యాక తెలిసింది, అతనిది చాలా తీవ్రస్వభావమని, ద్వంద్వప్రవృత్తి అనీ. నాలుగు నెలలు కాపురం చేసేటప్పటికి భరించలేక, తల్లితండ్రులతో మొత్తుకుంది. వాళ్లు హుటాహుటిన వచ్చి ఆమెను తీసుకుని పోయారు. 2011లో వాళ్లు విడాకులు తీసుకున్నారు. నూర్‌ జహీ సల్మాన్‌ అనే ఆమెను పెళ్లాడాడు. వాళ్లకు మూడేళ్ల కొడుకు వున్నాడు. వాళ్లు విడిపోలేదు కానీ కలిసి ఒకే చోట వుండటం లేదు. ఈ మధ్యకాలంలో ఆమె శాన్‌ ఫ్రాన్సిస్కోలో వుంటోంది. 

ఆవేశపరుడైన ఒమర్‌కు వాగుడు ఎక్కువ. తన సహోద్యోగుల దగ్గర నల్లవాళ్లను, యూదులను, స్వలింగసంపర్కులను, రాజకీయనాయకులను, అమెరికా సైన్యవిధానాన్ని తిడుతూ వుండేవాడు. బొంబాయి నటుల్లో కొందరు దావూద్‌ ఇబ్రహీం పేరు చెప్పిన నిర్మాతలను హడలగొట్టినట్లు, యితను 'నాకు అల్‌ కైదా, హెజ్‌బొల్లా వంటి తీవ్రవాద సంస్థలతో సంబంధబాంధవ్యాలున్నాయి, యీ సంగతి పోలీసు అధికారులకు చెప్పి మా యింటిపై దాడి చేయిస్తే నేను సూయిసైడ్‌ బాంబర్‌నై వాళ్లను చంపేస్తాను జాగ్రత్త,' అని తన కొలీగ్స్‌ను అడలగొడుతూండేవాడు. నిజానికి అల్‌ కైదా సున్నీ తీవ్రవాదుల సంస్థ, హెజ్‌బొల్లా షియా తీవ్రవాదుల సంస్థ! ఈ తేడాలేవీ వాళ్లకు తెలియవుగా, యితని వరస చూసి ఎఫ్‌బిఐకు ఫిర్యాదు చేశారు. వాళ్లు అతన్ని 2013లో పిలిచి నిలదీశారు. ''అలా అన్నమాట వాస్తవమే, కానీ కోపంలో అన్నాను. నేను ముస్లిమునని వాళ్లు వివక్షత చూపుతూంటే వాళ్లను భయపెట్టడానికి అన్నానంతే'' అని చెప్పుకున్నాడు. ఎందుకైనా మంచిదని అతనిపై నిఘా వుంచారు. పది నెలల తర్వాత ప్రమాదకరమైన వ్యక్తిగా తోచక నిఘా మానేసి, కేసు మూసేశారు.

అల్‌ కైదాతో సంబంధమున్న నుస్రా ఫ్రంట్‌ సిరియాలో పని చేస్తోంది. మోనెర్‌ అబూ సల్హా అనే పాలస్తీన్‌-అమెరికన్‌ యువకుడు సిరియాకు వెళ్లి 2014లో సూయిసైడ్‌ బాంబు దాడికి పాల్పడ్డాడు. అతని మూలాల గురించి, పరిచయాల గురించి ఎఫ్‌బిఐ పరిశోధించసాగింది. అమెరికాలో అతను ఫోర్ట్‌ పియర్స్‌ మసీదులో ప్రార్థనలు చేసేవాడని తెలుసుకుని, అతనితో బాటు ఆ మసీదుకి వచ్చేవారెవరాని వెతికింది. అక్కడ మళ్లీ ఒమర్‌ తగిలాడు. గతంలో కూడా అనుమానించాం కదాని మళ్లీ అతన్ని పిలిచి, ప్రశ్నించారు. ఎంత పరిశోధించినా యిద్దరి మధ్య లింకేమీ దొరకలేదు. మళ్లీ కేసు మూసేశారు. అందుకే జి4ఎస్‌ అతన్ని ప్రమాదకరమైన వ్యక్తిగా భావించలేదు, ఉద్యోగంలో కొనసాగించింది. 

మరి ఒమర్‌ను రాడికలైజ్‌ చేసినవాళ్లెవరు అంటే రాబర్ట్‌సన్‌ అనే గే-వ్యతిరేక ఇస్లామిస్ట్‌ కావచ్చు అంటున్నారు. పన్నులు ఎగ్గొట్టినందుకు, అక్రమాయుధాలు కలిగి వున్నందుకు అతను నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించి గత సంవత్సరమే విడుదల అయ్యాడు. జైల్లో వున్నంతకాలం అతని తోటి ఖైదీలను ఉగ్రవాదం వైపు మళ్లిస్తాడేమోనని అధికారులు జంకుతూనే వున్నారు. అతను బయటకు వచ్చి ఓర్లాండోలో ఆన్‌లైన్‌ ఇస్లామిక్‌ సెమినార్‌ నిర్వహిస్తుంటాడు. ఒమర్‌ దానిలో చేరాడట. ఇప్పుడు పోలీసులు రాబర్ట్‌సన్‌ను విచారిస్తున్నారు. 

ఎల్‌జిబిటిక్యూ (లెస్బియన్స్‌, గేస్‌, బైసెక్సువల్స్‌, ట్రాన్స్‌జెండర్స్‌, క్వీర్స్‌) కమ్యూనిటీ యిటీవల కాలంలో పెళ్లి చేసుకునే హక్కుతో సహా చాలా హక్కులు సంపాదించుకున్నారు. అయినా అమెరికన్‌ సమాజం వారి పట్ల వివక్షత పాటిస్తూనే వుంది. కొందరు రైట్‌-వింగ్‌ రాజకీయనాయకులు, కొందరు క్రైస్తవ, ఇస్లామ్‌ మతవాదులు వారిని ఖండిస్తూనే వున్నారు. ఈక్వాలిటీ ఫ్లారిడా అనే గే హక్కుల సంఘం పదివేలమంది సభ్యులతో ఓర్లండోలో పెద్ద సభ నిర్వహిస్తే ఒక్క రిపబ్లికన్‌ కూడా హాజరు కాలేదు. కెవిన్‌ స్వాన్సన్‌ అనే పాస్టర్‌ ''స్వలింగసంపర్కులకు మరణశిక్ష వేయాలని బైబిలు చెపుతోంది'' అని ఓ సభలో బహిరంగంగా వ్యాఖ్యానించాడు. ఆ సభలో బాబీ జిందాల్‌ తో సహా ముగ్గురు రిపబ్లికన్‌ నాయకులున్నారు. వారిలో యిద్దరు గవర్నర్లు, ఒక సెనేటర్‌. అయినా వాళ్లెవరూ అతన్ని ఖండించలేదు. ''రెలిజియస్‌ ఫ్రీడమ్‌'' పేర రిపబ్లికన్‌ పార్టీ గే-వ్యతిరేక చట్టం చేయడానికి ప్రయత్నించింది. ట్రంప్‌ అనుయాయులు గేలను నానారకాలుగా దూషిస్తున్నారు, గే వివాహాలను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఫ్లారిడాలోని అతివాద చర్చిల బయట బోర్డులు వేళ్లాడుతున్నాయి - 'స్వలింగసంపర్కులు పశ్చాత్తాప పడాలి లేకపోతే వారికి నరకవాసమే' అని. 

ఇప్పుడీ దాడి జరిగాక అయ్యోపాపం అని కొందరు అంటున్నా టెక్సాస్‌ లెఫ్టినెంట్‌ గవర్నరు ట్వీట్‌ పెట్టాడు - 'దేవుడి సృష్టిని వెక్కిరించలేరు. చేసిన కర్మానికి ఫలితం అనుభవించక తప్పదని గ్రహించండి' అని. రెండేళ్ల క్రితం పబ్లిక్‌ రెలిజియన్‌ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించిన సర్వేలో అమెరికన్లలో అధిక సంఖ్యాకులు స్వలింగ సంపర్కం అనైతికమని అభిప్రాయం వెల్లడించారు. జాతిద్వేషంతో జరిగే నేరాలపై సదరన్‌ పావర్టీ లా సెంటర్‌ 2011లో అధ్యయనం చేసి 'నల్లవారి కంటె, యూదుల కంటె ఎల్‌జిబిటి మనుష్యులే యిలాటి నేరాలకు గురయ్యే అవకాశాలు రెట్టింపు వున్నాయి' అని తేల్చారు. ఇటువంటి ద్వేషపూరితమైన వాతావరణంలోనే ఒమర్‌ ఆలోచనలు రూపు దిద్దుకున్నాయి. కొన్ని వారాల క్రితం యిద్దరు మగవాళ్లు బహిరంగంగా ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం చూసి అతను రగిలిపోయాడని అతని తండ్రి చెప్పాడు. 

ఈ మందుగుండును రగిలించడానికి నిప్పురవ్వ కూడా అమెరికాలోనే సిద్ధంగా వుంది. అది ఆయుధాల సంస్కృతి. ఇలాటి ఘటనలు జరిగినప్పుడల్లా ఆయుధవిక్రయాన్ని నిలిపివేసే చట్టం చేయాలని కొన్ని డిమాండ్లు వస్తాయి. కానీ అమెరికన్‌ ఆయుధవ్యాపారులు తమ పలుకుబడితో, ఐశ్వర్యంతో అలాటి ప్రయత్నాలకు అడ్డుకుంటారు. నేషనల్‌ రైఫిల్స్‌ అసోసియేషన్‌ వారి సమావేశం మే 20 న జరిగింది. 80 వేల మంది సభ్యులు హాజరైన ఆ సభలో సంస్థ ప్రతినిథి ఒకడు ఒబామాను ఎల్‌జిబిటిలకు న్యాయం చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నందుకు ఘాటుగా విమర్శించాడు. మరో వక్త యీ హోమోలు అమెరికన్‌ సంస్కృతిని సర్వనాశనం చేశారని వాపోయాడు. అమెరికాను మళ్లీ ఉన్నతదేశంగా నిలబెట్టాలంటే యిలాటి చీడపురుగులు వుండకూడదని ధోరణిలోనే ఉపన్యాసాలు సాగాయి. 2016లో యిప్పటిదాకా తుపాకీ వాడిన 23 వేల సంఘటనలు జరిగాయి. వాటికి సంబంధించి 6 వేల మంది చనిపోయారు. ఒమర్‌ వాడిన ఎఆర్‌-15ను 2012లో శాండీ హుక్‌ స్కూలులో ఆడమ్‌ లాంజా వాడి 20 మంది చిన్న పిల్లలను చంపాడు, 2015లో శాన్‌ బెర్నార్డినోలో రీజనల్‌ సెనిటర్లో సయ్యద్‌ ఫరూక్‌, తష్ఫీన్‌ మాలిక్‌ అనే జంట వాడి 14 మందిని చంపారు.  అప్పుడే దాన్ని నిషేధించాలని డిమాండు వచ్చినా ఏమీ జరగలేదు. నిజానికి అది యుద్ధభూమిలో వాడవలసిన ఆయుధం. 

ఇలా హోమోలపై ఏహ్యత, మారణాయుధాల లభ్యత ఒమర్‌కు అందివచ్చాయి. గేలు జూన్‌ను ప్రైడ్‌ మంత్‌గా పేర్కొంటారు. అందువలన అందరూ మాంచి సెలబ్రేషన్‌ మూడ్‌లో వున్నారు. ''పల్స్‌'' గేలలో చాలా పాప్యులర్‌ నైట్‌ క్లబ్బు. ఒమర్‌ చాలా సార్లు అక్కడకి వెళ్లి ఆనుపానులు క్షుణ్ణంగా పరిశీలించి, జూన్‌ 12 తెల్లవారు ఝామున 2 గం||లకు ఎఆర్‌ 15 అనే ఎస్సాల్ట్‌ రైఫిల్‌, ఒక హేండ్‌గన్‌తో క్లబ్బులో ప్రవేశించాడు. వేడుకలు ముగిసే సమయంలో కాల్పులు మొదలుపెట్టి కొన్ని గంటల పాటు కాల్చాడు. తనే పోలీసులకు ఫోన్‌ చేసి తన గురించి, ఐసిస్‌ గురించి చెప్పాడు. నిజానికి ఒమర్‌ ఐసిస్‌ పేరు వాడుకున్నాడు కానీ  అతను మతవాది కాదని తండ్రి చెప్పాడు. ''కనీసం గడ్డం కూడా పెంచలేదు.'' అన్నాడతను. ఒమర్‌ మొదటి భార్య కూడా అతనికి ఇస్లాంపై ఇంట్రస్టు లేదని చెప్పింది. కానీ 2012లో ఒమర్‌ హజ్‌కి సౌదీ అరేబియా వెళ్లాడని ఓ వార్త వచ్చింది. ఒమర్‌ పోలీసులతో ఐసిస్‌ పేరుతో బాటు తను ఐఎస్‌ఐఎల్‌ నాయకుడు ఆబూ బకర్‌ అల్‌-బాగ్దాదీ శిష్యుణ్నని చెప్పాడు. మోనెర్‌ అబూ సల్హా పేరు కూడా చెప్పాడు. వీళ్లతో యితనికి పరిచయాలున్నాయో లేదో కూడా తెలియదు. ఘనంగా వుంటుందని చెప్పివుండవచ్చు. హింసాప్రవృత్తి, గందరగోళం, అసహనం వున్న అమెరికన్‌ పౌరుణ్ని ఐసిస్‌ ఐదు పైసల ఖర్చు లేకుండా తన ప్రతినిథిగా మార్చివేయగలిగిందంటే దానికి కారణం అమెరికన్‌ సమాజంలో నెలకొన్ని పరిస్థితులు అని మనం అర్థం చేసుకోవాలి. 

ఈ వాతావరణం మరింత చిక్కబడుతోందనడానికి నిదర్శనం - సంఘటన తర్వాత రిపబ్లికన్ల వ్యాఖ్యలు! ఐసిస్‌కి దీనిలో హస్తం వుందనడానికి ఒమర్‌ స్టేటుమెంటు తప్ప మరో సాక్ష్యం లేకపోయినా ట్రంప్‌ 'రాడికల్‌ ఇస్లామ్‌ వలన ప్రమాదాల గురించి నేనెప్పుడో చెప్పాను, విన్నారా, ఇప్పటికైనా ముస్లిములు మన దేశానికి వలస రావడాన్ని అరికట్టాలి' అని పిలుపు నిచ్చాడు. రాడికల్‌ ఇస్లామ్‌ అనే మాట తన ప్రసంగంలో వాడనందుకు ఒబామా రాజీనామా చేయాలని కూడా డిమాండ్‌ చేశాడు. అమెరికన్‌ ముస్లిములకు దీని గురించి ముందే సమాచారమున్నా, అధికారులకు చెప్పలేదంటూ వారిని తప్పుపట్టాడు. ఆ ఆరోపణకు ఆధారమేమిటో అతనికే తెలియాలి. కానీ ఓటర్లలో 40% మంది ట్రంప్‌ మాటల్ని నమ్మేట్టే వున్నారు. నిజానికి ముస్లిము వ్యతిరేక ప్రసంగాలే అతనికి ఆక్సిజన్‌గా పనిచేస్తున్నాయి. సెప్టెంబరు 11 దాడులు జరిగినప్పుడు న్యూజెర్సీలోని ముస్లిములు వేడుకలు జరుపుకున్నారని అతను ఆరోపించిన తర్వాత అతనికి రిపబ్లికన్‌ పార్టీ నామినేషన్‌ వచ్చింది. పారిస్‌ దాడులు, శాన్‌ బెర్నార్డినో దాడి జరిగాక అతనికి మద్దతు పెరిగింది. ''నన్ను అధ్యక్షుడిగా గెలిపిస్తే అమెరికాకు, దాని స్నేహితులకు, యూరోప్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాల చరిత్ర వున్న దేశాల నుంచి వలసలను ఆపేస్తాను'' అని చెప్పుకుంటున్నాడు. 

ఐసిస్‌ కావచ్చు, మరో ఉగ్రవాద సంస్థ కావచ్చు వారి ఉపన్యాసాలతో, ప్రబోధాలతో స్థిరబుద్ధి కల మనుష్యులను మార్చలేరు కానీ సమాజంలో అందరికీ పరిణతి వుండదు. ఆవేశపరులుంటారు. సమాజంలో ఆర్థిక అసమానతలు, రకరకాల వివక్షతలు, జాతిపరమైన కల్లోలం వున్నపుడు చాలామంది సర్దుకుపోయినా, యీ ఆవేశపరులు సంయమనం కోల్పోయి ఐసిస్‌ వంటి సంస్థలకు ఆయుధాలుగా మారతారు. డా|| జకీర్‌ నాయక్‌ విషయమే చూడండి. ''నేను శాంతిని బోధిస్తున్నాను. చెడు చేసేవారిని టెర్రరైజ్‌ చేయమని ముస్లిము యువకులకు బోధించాను తప్ప టెర్రరిజం బోధించలేదు'' అంటాడు. కానీ బంగ్లాదేశ్‌లో కొంతమందికి అది మరోలా వినబడింది. అక్కడి సామాజిక పరిస్థితులు దోహదపడ్డాయి. ఉగ్రవాద దాడులు జరిగాయి. ఎందరో మరణించారు. పాపుల పట్ల, దోషుల పట్ల దయ చూపమనీ, వారిని దగ్గరకు తీసుకుని సంస్కరించమనీ ప్రతి మతమూ చెప్తుంది. మరి యీ పెద్దమనిషి వారిని టెర్రరైజ్‌ చేయమనడం దేనికి? టెర్రర్‌ పదం వాడడం దేనికి? అతను చాలా తర్కబద్ధంగా చేసిన ఉపన్యాసాలు కూడా నేను విన్నాను. వాటి ద్వారా మనలను మెప్పించి, మధ్యలో యిలా టెర్రర్‌ వంటి పదాలు చొప్పిస్తే వాటి ప్రభావం ఎలా వుంటుందో బంగ్లాదేశ్‌ సంఘటన చెప్తోంది. ఇది జకీర్‌ నాయక్‌కే కాదు, హిందూత్వవాదం పేరుతో అసంబద్ధ ప్రలాపనలు చేస్తున్న సాధ్వీమణులకూ, సాధూమహరాజ్‌లకూ వర్తిస్తుంది. జనాల్లో నూటికి 99 మంది వాటిని పట్టించుకోరు కదాని వూరుకోవడం తప్పు. ఒమర్‌ వంటి ఒక్కడు తయారైతే చాలు, బీభత్సం సృష్టించడానికి. మన సమాజంలో కూడా ఏదో ఒక మతానికి చెందిన అలాటి వాళ్లు వుండే వుంటారు. అందువలన రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవారిపై కఠిన శిక్షలు వేయాలి. ఆ తర్వాత వారి ప్రసంగాల వేడికి భగ్గుమనని తీరులో సమాజాన్ని సంస్కరించాలి. అసమానతలు, వివక్షతలు తగ్గించి, ఒమర్‌లు తయారవకుండా జాగ్రత్తపడాలి. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2016)

mbsprasad@gmail.com

Show comments