'ఎమర్జన్సీ' సినిమాటిక్‌ రాజకీయం

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మీద ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. అందులో బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ నటిస్తోన్న విషయం విదితమే. సినిమా పేరేమో 'ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌'. ఇంకేముంది.? సినిమా ఫస్ట్‌ లుక్‌ రావడంతోనే వివాదం షురూ అయ్యింది. మన్మోహన్‌ సింగ్‌కి వ్యతిరేకంగా ఏ సన్నివేశం వున్నా ఊరుకునేది లేదంటూ నానా రచ్చా చేసేశారు కాంగ్రెస్‌ నేతలు. 

ఇప్పుడు తాజాగా, మరో వివాదం తెరపైకొచ్చింది. ఇదీ, రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా గురించే. 'ఇందు సర్కార్‌' పేరుతో మాధుర్‌ బండార్కర్‌ తెరకెక్కించిన సినిమా ఇప్పుడు తాజా వివాదానికి కారణం. 'ఎమర్జన్సీ' నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. స్వర్గీయ ఇందిరాగాంధీ హయాంలో దేశంలో ఎమర్జన్సీ విధించడం, ఆ సమయంలో ప్రజలెదుర్కొన్న దుర్భర పరిస్థితులు, ఆ ఘటనకు దారి తీసిన రాజకీయ పరిస్థితులు.. ఇవన్నీ సినిమాలో వున్నాయట. 

అయితే, ఈ సినిమాని ముందుగా తమకు చూపించాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 'ఎమర్జన్సీ' పేరుతో బీజేపీ, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్‌ పార్టీపై విరివిగా దుమ్మెత్తిపోస్తోంది. దాంతో సహజంగానే, కాంగ్రెస్‌ పార్టీకి 'ఎమర్జన్సీ' అంటే ఉలికిపాటు రావడం కూడా చూస్తున్నాం. సినీ పరిశ్రమ నుంచి ప్రత్యక్షంగానో, పరోక్షంగానే బీజేపీకీ, ఎన్డీయేకీ పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తోన్న దరిమిలా, ఏ సినిమా రాజకీయ నేపథ్యంలో వస్తున్నా కాంగ్రెస్‌ కంగారు పడుతూ వస్తోంది. 

సినిమాని రాజకీయాలకు వాడేసుకుంటున్న బీజేపీ, దేశంలో సరికొత్త రాజకీయానికి తెరలేపిందన్నది కాంగ్రెస్‌ వాదన. ఒక్కటి మాత్రం నిజం, ఎమర్జన్సీ అనేది అప్పటికి తప్పని పరిస్థితి. అదొక సంక్షోభం. దేశం చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్న చీకటి సందర్భమది. కొంతమంది ఎమర్జన్సీని సమర్థిస్తారు.. చాలామంది ఆ ఎమర్జన్సీని వ్యతిరేకిస్తారు. కాంగ్రెస్‌ నేతలూ కొందరు ఆ ఎమర్జన్సీని వ్యతిరేకించారు కూడా. ఇంతకీ, ఇన్ని వివాదాల నడుమ ఈ 'ఇందు సర్కార్‌' ఏమవుతుంది.? వేచి చూడాల్సిందే.

Show comments