ఇంతకూ 'కపట నాటకాలు' ఎవరివి బాబుగారూ?

రాజకీయం అంటేనే అందులో ఎంతో కొంత ఆత్మవంచన ఉంటుంది. అబద్ధం చెప్పకుండా మోసం చేయకుండా.. ఆమేరకు తన ఆత్మసాక్షిని తాను వంచించుకోకుండా ఏ రాజకీయ నాయకుడూ మనలేడన్నది నిజం. అయితే దానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కోడాంటే.. అన్నట్లుగా దొంగే.. పోలీసుని చూపిస్తూ 'దొంగ దొంగ' అని కేకలు పెడితే ఎలా అర్థంచేసుకోవాలి. ఆ వంచనను దేనికి పరాకాష్టగా భావించాలి? చంద్రబాబునాయుడు ప్రస్తుతం అలాంటి వంచనలో చెలరేగిపోతున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం అనే అంశం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా రాజకీయ వర్గాల్లో చలామణీలో ఉంది. ఈ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌, వామపక్షాలు బంద్‌ నిర్వహించి ఒక అలజడిని సృష్టించాయి. చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలు ఎక్కడున్నాయో ప్రజలు ఆలోచించే పరిస్థితిని కల్పించాయి. జనంలో ఆలోచన వచ్చేసింది, ఇక తాను చెప్పే మాటలు సాగవని చంద్రబాబు కూడా గుర్తించినట్లున్నారు. 

అదే సమయంలో బంద్‌ చేయకపోయినా, తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఈసారి మాత్రం హోదా కోసం తమ స్వరాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. లోక్‌సభలో జైట్లీ ప్రకటన చేసిన తర్వాత కూడా తెదేపా ఎంపీలు తగ్గకుండా.. తమ నిరసనల్ని కొనసాగించడం బాగుంది. అందుకు వారిని కూడా అభినందించాల్సిందే. 

అయితే చంద్రబాబునాయుడు ఎందుకు ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నారో సాధారణ ప్రజల విజ్ఞతకు అర్థం కావడంలేదు. తన పార్టీ ఎంపీలే ఢిల్లీలో పార్లమెంటు వద్ద ధర్నా చేస్తున్నారు. అదే మాదిరిగా ఇక్కడ రాష్ట్రంలో కూడా ఆయన తన పార్టీ ద్వారానే ఉద్యమాలు చేయిస్తే..ఎంత పరువుగా ఉండేదో కదా అని జనం అనుకుంటున్నారు. హోదా కోసం ప్రజల్లో వాంఛ ఎంత బలీయంగా ఉన్నదో అప్పుడు కేంద్రానికి తెలుస్తుంది కదా అని జనం అనుకుంటున్నారు. అలాచేయకుండా బంద్‌ చేసిన వైకాపా, కాంగ్రెస్‌ లను నిందించడం చంద్రబాబుకు మాత్రమే చెల్లింది. 

కాంగ్రెస్‌, వైకాపాల విషయంలో చంద్రబాబు తనకేదో అలవాటైన ఊతపదం లాగా.. 'నాటకాలాడుతున్నారు' అని అంటూ ఉంటారు. నిజానికి నాటకాలాడుతున్నది ఎవరు? ప్రజల్ని మోసం చేయాలనుకుంటే వారే మోసపోతారు? అని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. ప్రజల్ని మోసం చేస్తున్నది ఎవరు? నిన్నటిదాకా ప్రత్యేకహోదా అనేది ఎందుకు? అని ప్రశ్నించిన సంగతినిచంద్రబాబు మరచిపోతే ఎలా? ఇవాళ పరువు పోకుండా హోదా జెండా పట్టుకుని పార్లమెంటు గేటు వద్ద ఆడుతున్నది నాటకాలు కాదా? ఆడిస్తున్న సూత్రధారి చంద్రబాబు కాదా? ప్రజా ఉద్యమ స్వరంలో తీవ్రత కేంద్రానికి తెలియనివ్వకుండా.. ఇక్కడ హోదా కోసం గళమెత్తుతున్న అన్ని పార్టీలను, ఉద్యమిస్తున్న వారిని అరెస్టు చేయించి.. అణచివేస్తున్న నాటకం చంద్రబాబుది కాదా అని జనం అడుగుతున్నారు. 

కేంద్రంతో పోరాడడం మానేసి ఇక్కడ బంద్‌లు చేస్తారా? అనిచంద్రబాబు అంటున్నారు! ఏమాత్రం పసలేని విమర్శ ఇది. కేంద్రాన్ని వైకాపా, కాంగ్రెస్‌ లు విమర్శించడంలేదని జనానికి చెవిలో పువ్వు పెట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆ రకంగా జగన్‌ మీద అర్థం పర్థం లేని బురద జల్లుతున్నారు. అందరూ కేంద్రాన్ని తప్పకుండా విమర్శించడానికి సిద్ధంగా ఉన్నారు.. మరి అఖిలపక్షం తీసుకువెళ్లగల దమ్ము చంద్రబాబునాయుడుకు ఉందా? అనేది జనంలో మెదులుతున్న ఆలోచన. అఖిలపక్షం తీసుకువెళ్తే అది ఖచ్చితంగా కేంద్రం మీద పెద్ద ఒత్తిడి తెస్తుంది. కానీ పాలకపక్షంగా ఉంటూ అలాంటి ప్రయత్నం చేయని చంద్రబాబునాయుడు, పరోక్షంగా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని.. ఆయన నాటకాలకు ఇది పరాకాష్ట అని ప్రజలు భావిస్తున్నారు. 

Show comments