బ్లాక్‌ మనీ డబుల్‌: ఇది మోడీ ఘనత

అంచనాలకు తగ్గట్టుగానే బ్యాంకులకు పెద్ద పాత నోట్లు చేరాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యాంకుల్లో ఇప్పుడు నగదు నిల్వలు పెరిగాయి. ఇదంతా పెద్ద పాత నోట్ల రద్దు ప్రభావమే. బ్యాంకుల నుంచి సొమ్ములు తీసుకోవడానికి వీల్లేదు గనుక (నగదు ఉపసంహరణ పరిమితి కారణంగా), బ్యాంకుల్లో నిధులు మగ్గుతున్నాయన్నది నిర్వివాదాంశం. ఇప్పుడిప్పుడే ఉపశమన చర్యలు ప్రారంభమవడంతో, బ్యాంకుల పరిస్థితి మునుపటిలానే తయారవనుంది. 

ఎంతకీ పెద్ద పాత నోట్ల రద్దుతో ఏం సాధించినట్లు.? నల్లధనం పూర్తిగా మాయమైపోయిందా.? పూర్తిగా కాకపోయినా, అసలు కాస్తయినా తగ్గిందా.? లేదా.? అన్న అంశాలపై వివిధ సంస్థలు తమ అభిప్రాయాల్ని కుండబద్ధలుగొట్టేస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే సంస్థలు, ప్రైవేటు సంస్థలు కూడా వుంటుండడం గమనార్హం. అన్ని సర్వేలు, అంచనాలు, విశ్లేషణల్లో ఒకటే మాట.. పెద్ద పాత నోట్ల రద్దుతో నల్లధనాన్ని వెలికి తీయడం సాధ్యపడదని. 

చావు కబురు చల్లగా చెప్పడమంటే ఇదే మరి. దేశం 60 రోజులపాటు కరెన్సీ సంక్షోభంలో మునిగిపోయింది. ఇప్పటికీ దాంట్లోంచి బయటకు రాలేదు, వచ్చే అవకాశమూ సమీప భవిష్యత్తులో కన్పించడంలేదు. 60 రోజుల తర్వాత కాస్త వెసులుబాటు అయితే దొరికిందిగానీ, మునుపటి స్థాయిలో దేశం కోలుకోవడానికి ఎంత సమయం పడ్తుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. పెద్ద పాత నోట్ల రద్దుని ఏకంగా సర్జికల్‌ స్ట్రైక్స్‌తో పోల్చేశారు ప్రధాని నరేంద్రమోడీ. ఇప్పుడా సర్జికల్‌ స్ట్రైక్‌ తుస్సుమంది.. అన్న భావన సర్వత్రా వ్యక్తమవుతుండడం గమనార్హం. 

ఇదివరకు వెయ్యి రూపాయల నోట్ల కట్టలు నల్ల కుబేరుల 'గోదాముల్లో' మగ్గితే, ఇప్పుడు 2 వేల రూపాయల నోట్ల కట్టలు పాత నల్లధనాన్ని రీప్లేస్‌ చేస్తున్నాయంతే. దానికన్నా ఇది చాలా కంఫర్టబుల్‌ మెటీరియల్‌ కదా.! 

ఇంకోపక్క, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నగదు ఏరులై పారుతోంది. ఇదంతా నల్లధనమే. ప్రచార ఆర్భాటాలకీ, టిక్కెట్ల కొనుగోళ్ళకీ, ఓటర్లను ప్రలోభపెట్టడానికీ 2 వేల రూపాయల నోటు బాగానే ఉపయోగపడ్తోంది. సందట్లో సడేమియా, నకిలీ కరెన్సీ కూడా ఎన్నికల్లో హల్‌చల్‌ చేస్తోందన్న వాదనలు తెరపైకొస్తున్నాయి. ఇకనేం, దేశంలో నల్లధనం ఇప్పుడు రెండింతలయ్యేందుకు ఆస్కారం ఏర్పడింది. 

వాస్తవానికి నల్లధనం కేవలం నగదు రూపంలోనే లేదు. కానీ, కాస్తో కూస్తో నగదు రూపంలో వున్న ఆ నల్లధనం 2 వేల రూపాయల నోటు పుణ్యమా అని డబుల్‌ అవుతుండడం గమనార్హం. దేశాన్ని 60 రోజులపాటు సంక్షోభంలోకి నెట్టేసి, ప్రధాని నరేంద్రమోడీ సాధించినదేంటయ్యా.? అంటే, ఇదిగో నల్లధనాన్ని డబుల్‌ చేయడం.. అని చెప్పక తప్పదు.

Show comments