ఇంకా..ఇంకా విస్తరిస్తున్న 'అమ్మ' బ్రాండ్‌..!

'అంతా రామమయం..జగమంతా రామమయం'...అని పాడుకున్నాడు భక్త రామదాసు. జగమంతా రామమయం కాలేదుగాని తమిళనాడు మాత్రం 'అమ్మమయం' అయిపోతోంది. అమ్మంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ముఖ్యమంత్రి జయలలిత. ప్రభుత్వం ఏ పథకం రూపొందించినా, ఏ కార్యక్రమం తయారుచేసినా అన్ని అమ్మ పేరుతోనే. 'అమ్మ అన్నది ఒక కమ్మని మాట' అని పాడుకుంటున్నారు అన్నాడీఎంకే పార్టీ నాయకులు, జయ అభిమానులు. అమ్మ పేరుతో ఇప్పటికే ఎన్నో పథకాలు అమలు జరుగుతున్నాయి. ఇంకా కొత్తవి పుట్టుకొస్తూనే ఉన్నాయి. అమ్మ పథకాల పరంపర ఇప్పట్లో ఆగకపోవచ్చు. 

తాజాగా అమ్మ బ్రాండ్‌ పథకాల్లో 'అమ్మ కళ్యాణ మండపాలు' పథకం చేరింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరుపుకోవాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారని, కళ్యాణ మండపాల అద్దెలు భరించలేకపోతున్నారని, అందుకే అమ్మ కళ్యాణ మండపాల నిర్మాణం తలపెట్టామని జయలలిత ప్రకటించారు. రాష్ట్రంలోని పదకొండు ప్రాంతాల్లో అమ్మ కళ్యాణ మండపాలను 83 కోట్ల ఖర్చుతో నిర్మించబోతున్నారు. ఇవి పేదల కోసం నిర్మిస్తున్న కళ్యాణ మండపాలు కాబట్టి ఏవో నామమాత్రంగా కడుతున్నారనుకుంటే పొరబాటే.  ఇవి  అన్ని సౌకర్యాలతో కూడిన అత్యాధునిక కళ్యాణ మండపాలు.

పెళ్లికూతురు, పెళ్లి కొడుకు కుటుంబాల కోసం ఎయిర్‌ కండిషన్డ్‌ గదులుంటాయి. అతిథులకు సౌకర్యవంతమైన రూములుంటాయి. కిచెన్‌, డైనింగ్‌ హాల్‌...ఇలా సమస్య సౌకర్యాలుంటాయి. వీటిని చెన్నయ్‌లోని తండయార్‌పేట, వేలాచ్చేరి, అయపాక్కం, పెరియార్‌ నగర్‌, కొరట్టూర్‌లతో పాటు  మదురై, తిరునల్వేలి, సేలం, అంబసముద్రం, కొడుయంగూర్‌, తిరువళ్లూర్‌, ఉడుమాలపైట్టయ్‌, తిరుపూర్‌లో నిర్మిస్తారు. ఆదిలా ఉంచితే మురికివాడల్లోని పేదల కోసం అమ్మ పేరుతో 50 వేల ఇళ్లు 1800 కోట్లతో నిర్మించాలని జయలలిత ఆదేశించారు. వీటి నిర్మాణానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. 

ఇవి కాకుండా రెండు వేల ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ ఇళ్లు నిర్మించబోతున్నారు. అమ్మ పేరుతో ఇప్పటికే ఎన్నో పథకాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఇంకా అనేక పథకాలు వస్తాయని చెబుతున్నారు. ఇప్పటికే...తక్కువ ధరకు టిఫిన్‌, భోజనం పెట్టే అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి. ఇక్కడ ప్లేటు ఇడ్లీ రూపాయి, పెరుగన్నం మూడు, సాంబారన్నం ఐదు రూపాయలు.  'అమ్మ కుడినీర్‌' (తాగునీరు) పేరుతో 10 రూపాయలకు వాటర్‌బాటిల్స్‌ విక్రయిస్తున్నారు. అమ్మ ట్యాప్‌టాప్స్‌ పేరుతో విద్యార్థులకు ల్యాప్‌టాప్స్‌ పంపిణీ చేశారు. చిన్న పిల్లలున్న తల్లులకు అమ్మ బేబీ కిట్స్‌ పంపిణీ చేస్తున్నారు. ఇందులో పిల్లలకు అవసరమైన వస్తువులన్నీ ఉంటాయి. 

పేదల కోసం అమ్మ ఉప్పు ప్యాకెట్లు అమ్ముతున్నారు. మార్కెట్లో కంటే వీటి ఖరీదు చాలా తక్కువ. పేదల కోసం ప్రవేశపెట్టిన మరో పథకం అమ్మ సిమెంట్‌. దీని ఖరీదు కూడా బాగా తక్కువ. అమ్మ విత్తనాలు, అమ్మ గ్రైండర్లు, అమ్మ ఫ్యాన్లు, అమ్మ ఔషధాలు, అమ్మ మొబైల్‌ ఫోన్లు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. 'అమ్మ మక్కల్‌ సేవై మైయ్యం (అమ్మ ప్రజాసేవ కేంద్రాలు) పేరుతో కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇవి మన తెలుగు రాష్ట్రాల్లోని మీ సేవ, ఈసేవ కేంద్రాల్లాంటివి. తక్కువ ధరలకు పేదలు సినిమాలు చూసే అవకాశం కల్పించేందుకు 'అమ్మ సినిమా' పేరుతో థియేటర్లు నిర్మిస్తున్నారు. వీటిల్లో టిక్కెట్ల ధరలు పాతిక రూపాయల కంటే తక్కువగా ఉంటాయి. 

పైగా ఇవన్నీ ఎయిర్‌ కండిషన్డ్‌ థియేటర్లు కావడం విశేషం. ఉచిత, జనాకర్షక పథకాలకు తమిళనాడు పెట్టింది పేరు. కొన్ని బాగానే ఉన్నా కొన్ని పథకాలు చూస్తే నాయకులు ఎంతగా దిగజారిపోయారోననిపిస్తుంది. ఓట్లు దండుకోవడానికి ప్రజలను మరీ బిచ్చగాళ్ల స్థాయికి దిగజార్చారు తమిళనాడు నాయకులు. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలనే యథాతధంగా లేదా కొద్ది మార్పుతో ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. ఉచిత పథకాలు అధికారంలోకి రావడానికి ఉపయోగపడతాయిగాని ఆ తరువాత అమలు చేసే సమయంలో ప్రభుత్వానికి భారమైపోతాయి. 

అప్పుడే పాలకులు అనేక కొర్రీలు పెడతారు. లేనిపోని షరతులు, కోతలు విధిస్తారు. కాలక్రమంలో ఈ ఉచిత పథకాలు సక్రమంగా అమలు చేయలేక చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనేక అక్రమాలు జరుగుతాయి. పథకాలు అనర్హులకు అందుతాయి. కొన్ని మరుగునపడిపోతాయి కూడా. తెలంగాణ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు ప్రజలకు అందడంలేదని ఈమధ్య ఓ పత్రిక రాసింది. డబుల్‌ బెడ్‌ రూముల పథకం చతికిల పడింది. ఇలాంటి ఉదాహరణలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నాయి. 

Show comments