పవన్‌కళ్యాణ్‌కి 'ఆ ఆలోచన' వుందా.!

పవన్‌కళ్యాణ్‌కి ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన వుందట. అందుకే, ప్రత్యేక హోదా ఉద్యమం పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారట. భారతీయ జనతా పార్టీ కొత్త వింత వాదన ఇది. కామెడీ కాకపోతే, పవన్‌కళ్యాణ్‌కి అలాంటి ఆలోచనలు ఎందుకుంటాయి.? ఆయనేమన్నా సీరియస్‌ పొలిటీషియన్‌ అని బీజేపీ భావిస్తోందా.! 

చిన్న పిల్లాడినడిగినా చెప్పేస్తాడు, పవన్‌కళ్యాణ్‌కి రాజకీయాలంటే ఎంత 'సీరియస్‌' అనే విషయం. టైమ్‌ పాస్‌కి సినిమాలు చేస్తాడు.. టైమ్‌ పాస్‌ కోసం రాజకీయాలు చేస్తాడు. ఇంతకు మించి పవన్‌కళ్యాణ్‌ గురించి చెప్పుకోడానికేముంది.? అప్పుడు కాంగ్రెస్‌ని విమర్శించారు, ఇప్పుడు కాంగ్రెస్‌తోపాటు బీజేపీని విమర్శిస్తున్నారు. ఇదీ పవన్‌కళ్యాణ్‌ వరస. కాంగ్రెస్‌ అధికారంలోకి రాకూడదు.. వైఎస్సార్సీపీకి ఆ ఛాన్స్‌ ఇవ్వకూడదు.. అందుకే టీడీపీ, బీజేపీలకు అధికారం కట్టబెట్టాలంటూ పవన్‌కళ్యాణ్‌ గత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేసిన విషయం విదితమే. 

పవన్‌కళ్యాణ్‌కే గనుక ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన వుంటే, దానికి ఇంకో లెక్క వుంటుంది. పార్టీని ఈ పాటికి ఆయన బలోపేతం చేసి వుండేవారు. అలా చేసినా, ఆయన ముఖ్యమంత్రి అవుతారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే, పవన్‌కళ్యాణ్‌ అన్నయ్య చిరంజీవి సంగతేమయ్యిందో చూశాం కదా.! దేశభక్తి అంటాడు, సమాజం పట్ల అవగాహన అంటాడు. ఇంకేదో చెబుతుంటాడు. అయితే అవన్నీ, అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకే. 

వ్యక్తిగతంగా పవన్‌కళ్యాణ్‌ మంచోడు.. కానీ, రాజకీయాల్లో రాణించేంతలా, ప్రజలకు నాయకుడయ్యేంతలా మంచోడు మాత్రం కాదనే వాదన ఇప్పటిదాకా పవన్‌కళ్యాణ్‌తో సావాసం చేసిన టీడీపీ, బీజేపీలే చెబుతున్నాయి. చెప్పవా మరి, పవన్‌కళ్యాణ్‌ ఆ రెండు పార్టీల్నీ విమర్శించేస్తోంటే. ఓ అభిమాని తన బహిరంగ సభ కారణంగా చనిపోతే, ఇకపై బహిరంగ సభలే పెట్టబోనని ప్రకటించేశారు పవన్‌కళ్యాణ్‌. అదేం లెక్క.? అలాంటి ఘటనలు చోటుచేసుకోండా జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప, ప్రజల్లోకి వెళ్ళనని పవన్‌కళ్యాణ్‌ చెప్పడమంటే (అంతే మరి, ఇప్పుడు బహిరంగ సభ, రేప్పొద్దున్న రోడ్‌ షో.. ఏ ఘటన జరిగినా, జనంలోకి వెళ్ళడమే మానేయొచ్చు కదా..) అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? 

అసలంటూ జనసేన పార్టీ తరఫున పవన్‌కళ్యాణ్‌ తప్ప ఇంకొకరు లేరు. ఎందుకలా.? అని ప్రశ్నిస్తే, 'ముందు నేనేంటో నిరూపించుకోవాలి.. నష్టపోతే నేనే నష్టపోవాలి..' అంటూ మరో సిల్లీ పాయింట్‌ లేవనెత్తారు పవన్‌కళ్యాణ్‌. ఇదేం లెక్క.? ఇదేం రాజకీయం.? అని జనం ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. ఇన్ని 'సలక్షణాలు' వున్న పవన్‌కళ్యాణ్‌, ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచనతో వున్నారంటే ఎలా నమ్మగలం.? 

అప్పుడు అన్నయ్య చిరంజీవిని సపోర్ట్‌ చేశారు.. నిన్న మొన్నటిదాకా చంద్రబాబు, నరేంద్రమోడీల్ని సపోర్ట్‌ చేశారు. రేప్పొద్దున్న ఏ ఎల్లయ్యో, పుల్లయ్యో వస్తే.. వాళ్ళనీ సపోర్ట్‌ చేస్తారు. వెరసి, పవన్‌కళ్యాణ్‌ జస్ట్‌ సపోర్టర్‌ అంతే, నాయకుడు కానే కాడు.

Show comments