బాలీవుడ్‌పై నయా ట్యాక్స్‌.!

ఇదేదో కొత్త కాన్సెప్ట్‌లా వుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ ఎవరూ ప్రశ్నించలేని కాన్సెప్ట్‌ ఇది. పాకిస్తాన్‌కి చెందిన నటీనటుల్ని మీ సినిమాల్లో తీసుకోవాలనుకుంటున్నారా.? అయితే, సింపుల్‌గా 5 కోట్లు ట్యాక్స్‌ కట్టేయాల్సిందే. ఇది మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) చీఫ్‌ రాజ్‌ థాక్రే విధించిన పన్ను. ఆ పన్ను కూడా, ఆయన సొంతానికి కాదు.. ఆ ఐదు కోట్ల మొత్తాన్ని ఆర్మీ రిలీఫ్‌ ఫండ్‌కి ఇవ్వాల్సిందేనని రాజ్‌ థాక్రే తెగేసి చెప్పారు. 

ట్యాక్స్‌ కాన్సెప్ట్‌ అదిరింది కదూ.! కాశ్మీర్‌ యువతని పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదులు రెచ్చగొడుతూ, తీవ్రవాదం వైపు మళ్ళిస్తూ, కాశ్మీర్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే, 'తీవ్రవాదం వైపుకు రావాలనుకుంటున్నారా.? అయితే భారత సైన్యం నుంచి ఆయుధాలు దోచుకుని రండి..' అంటూ తీవ్రవాద సంస్థలు పిలుపునిస్తున్నాయి. 

కుక్క కాటుకి చెప్పు దెబ్బ ఎంఎన్‌ఎస్‌ నుంచి గట్టిగానే వచ్చింది. పాకిస్తాన్‌ నటీనటుల్ని తీసుకోవాలనుకుంటే ఆర్మీ రిలీఫ్‌ ఫండ్‌కి 5 కోట్లు విరాళంగా సమర్పించుకోవాల్సిందేనన్న ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ థాక్రే డిమాండ్‌కి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. మామూలుగా అయితే, 'ఇది కుదిరే వ్యవహారమేనా.? ఐదు కోట్లు చిన్న విషయమేమీ కాదు..' అని అనొచ్చుగాక. ఎంఎన్‌ఎస్‌ డిమాండ్‌ అర్థం పర్ధం లేనిదంటూ కొట్టి పారేయొచ్చుగాక. 

కానీ, ఇందాకే చెప్పుకున్నాం కదా.. కుక్క కాటుకి చెప్పు దెబ్బ పడి తీరాల్సిందే. 'యే దిల్‌ హై ముష్కిల్‌' సినిమా వివాదం.. ఇదిగో, ఇలా మొత్తం బాలీవుడ్‌నే షేక్‌ చేసేస్తోంది. ఈ సినిమాలో ఫవాద్‌ ఖాన్‌ అనే బాలీవుడ్‌ నటుడు నటించడం, భారత్‌ - పాక్‌ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో సినిమా విడుదలను అడ్డుకుంటామని ఎంఎన్‌ఎస్‌ హెచ్చరించడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో.. వ్యవహారం ఆసక్తికరమైన మలుపు తిరిగింది. 

ప్రస్తుతానికైతే వివాదం సద్దుమణిగింది.. షరతుల మీద మాత్రమే. అందులో ఐదు కోట్ల ట్యాక్స్‌ అనే డిమాండ్‌ కూడా వుంది. దానికి చూచాయిగా నిర్మాత కరణ్‌ జోహార్‌ నుంచి సానుకూల స్పందన కూడా వచ్చిందట. మాట కాదు, రాత పూర్వకంగా కావాలంటూ రాజ్‌ థాక్రే మరో మెలిక కూడా పెట్టేశారు. మమారాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలోనే ఇదంతా జరిగింది.

Show comments