పవన్‌కళ్యాణ్‌.. బీ అలర్ట్‌.!

పవన్‌కళ్యాణ్‌కి ఓ హెచ్చరిక.. కాపు ఐక్య గర్జన కాస్తా విధ్వంసాలకు కారణమయినట్లే, సీమాంధ్రుల ఆత్మగౌరవ సభని కూడా అదే దిశగా వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. తుని విధ్వంసం వెనుక అధికార పార్టీ అరాచకాలే కారణమన్న విమర్శలు ఓ పక్క విన్పిస్తోంటే, అధికార పార్టీ తెలివిగా ప్రతిపక్షంపై ఎదురుదాడితో సరిపెట్టేస్తోంది. నిజమేంటన్నది మాత్రం ఎప్పటికీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. 

ఇక, ప్రత్యేక హోదా కోసమంటూ పవన్‌కళ్యాణ్‌, జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభ, అధికారంలో వున్న టీడీపీ - బీజేపీ పార్టీలకు ఏమాత్రం మింగుడు పడే విషయం కానే కాదు. తిరుపతి సభతోనే పవన్‌, బీజేపీ - టీడీపీపైన ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇప్పుడు కాకినాడలోనూ అదే సీన్‌ రిపీట్‌ కానుంది. మరి, పవన్‌కళ్యాణ్‌ తమను విమర్శిస్తోంటే, టీడీపీ - బీజేపీ ఆ సభను జరగనిస్తాయా.? ఛాన్సే లేదు. 

ప్రభుత్వం తరఫున అనుమతుల నిరాకరణ అనే సమస్య తలెత్తొచ్చు. దానికి తోడు అనేకరకాలైన ఆంక్షలూ తప్పవు. వీటన్నిటికీ తోడు, రాజకీయ ప్రేరేపిత అసాంఘీక శక్తులు కూడా పవన్‌కళ్యాణ్‌ సభలో గందరగోళం సృష్టించే అవకాశం వుంది. తుపాను ముందరి ప్రశాంతత ప్రస్తుతం కొనసాగుతోంది. అచ్చంగా కాపు ఐక్య గర్జన వేదిక విషయంలోనూ ఇలానే జరిగింది. ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా తుని శివార్లలోని తోటల్లో ఆ సభ జరిగింది. అందులో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు చేరి, విధ్వంసాలు సృష్టించాయి. పోలీసులు చోద్యం చూశారు అప్పట్లో. 

మరిప్పుడు పవన్‌కళ్యాణ్‌ సభకి, ప్రభుత్వం తరఫున పోలీసులు ఎలాంటి భద్రతనివ్వగలరు.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటిదాకా కాపు రిజర్వేషన్లపై స్పందించకుండా సమాధానం దాటవేసిన పవన్‌కళ్యాణ్‌, ఈసారి ఆ విషయంపైనా స్పందిస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే గనుక జరిగితే, అధికార తెలుగుదేశం పార్టీ మరింత ఇబ్బందుల్లో పడ్తుంది. 

ఇక, తిరుపతి బహిరంగ సభ నిర్వహించినంత తేలిక కాదు, కాకినాడలో సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ నిర్వహించడం. తిరుపతి సభ ముందుగా ప్రిపేర్‌ చేసుకున్నది కాదు. కాకినాడ సభ మాత్రం పూర్తిస్థాయిలో ప్రిపేర్‌ అవుతున్న సభ. సో, అసాంఘీక శక్తులు ఈ సభలోకి చొరబడే ప్రమాదమైతే సుస్పష్టం. మరి, పవన్‌కళ్యాణ్‌ అభిమానులు, జనసేన కార్యకర్తలు.. ఈ సభని ప్రశాంతంగా నిర్వహించగలరా.? వారికి పోలీసుల నుంచి ఎలాంటి సపోర్ట్‌ లభిస్తుంది.? గత అనుభవాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో జనసేన - సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ కాస్తంత ఆందోళన కలిగిస్తోంది ఇప్పటినుంచే.

Show comments