మున్సి'పోల్స్‌' 2019 'పల్స్‌' తెలియచేస్తాయా?

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు ఎదురుచూస్తున్నాయి. చాలాకాలం క్రితమే జరగాల్సిన ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇక ఈ ఎన్నికలను ఎంతోకాలం పెండింగులో పెట్టలేదు. జరిగితే డిసెంబరులో జరగాలి. తప్పితే జనవరిలో జరగక తప్పదని పార్టీలు భావిస్తున్నాయి. ఇవి పేరుకు మున్సిపల్‌ ఎన్నికలైనప్పటికీ ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణంలో ఇవి ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు ప్రతిష్టాత్మకమైనవనే భావించాలి. విశ్లేషకులూ ఇదే అనుకుంటున్నారు. దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్‌ చేస్తున్న ఈ ఎన్నికలను మినీ అసెంబ్లీ ఎన్నికలుగా భావిస్తున్నారు.

 ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్లకు, నాలుగు మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికలను అధికార పార్టీ కూడా తక్కువ అంచనా వేయడంలేదు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, తిరుపతి, శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్లకు, రాజాం, నెల్లిమర్ల, కందుకూరు, రాజంపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సివుంది. సాధారణ పరిస్థితుల్లోనైతే 'స్థానిక' ఎన్నికలకు ప్రభుత్వం భయపడనక్కర్లేదు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సమస్యలే కీలకపాత్ర పోషిస్తాయి. అధికార పార్టీ కొన్నింటిని గెలుచుకోకపోయినా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు.         

కాని ఏపీ సర్కారు ఈ మున్సిపోల్స్‌లో ప్రతికూల ఫలితాలు వస్తాయేమోనని, ఆ ప్రతికూలత 2019 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందేమోనని భయపడుతోంది. ఈ భయానికి కారణం తెలిసిందే కదా. ప్రత్యేక హోదాను, ప్రత్యేక ప్యాకేజీని వదులుకొని కేంద్రం ఆఫర్‌ చేసిన ప్రత్యేక ఆర్థిక సాయాన్ని అంగీకరించడం. వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశమే అజెండా అవుతుందని వైకాపా అధినేత జగన్‌ అన్నారు. కాని అప్పటిదాకా ఆగక్కర్లేదు. ఈ మున్సిపల్‌ ఎన్నికలకు హోదాయే అజెండా అయ్యే అవకాశముంది. ఎన్నికలు జరగబోతున్నది మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు. అంటే మొత్తం పట్టణ, నగర ప్రాంతాలన్నమాట. 

విద్యావంతులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత...ఇలా చైతన్యవంతమైన వర్గాలు అనేకముంటాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మాదిరిగా చంద్రబాబును గుడ్డిగా ఆరాధించి 'పచ్చ' పార్టీకే ఓట్లు వేసే అవకాశముండదు. అందులోనూ జగన్‌ కొంతకాలంగా పట్టణ, నగర ప్రాంతాల్లోని యువతలో ప్రత్యేక హోదా, ప్యాకేజీ, ఆర్థిక సాయం మొదలైన అంశాల గురించి, వాటి మధ్య తేడాల గురించి, ప్రత్యేక హోదా రానందున కలిగే నష్టాల గురించి అవగాహన పెంచారు. 'యువభేరీ' పేరుతో జగన్‌ నిర్వహించిన సదస్సులను చూసి ప్రభుత్వం బెంబేలెత్తిపోయింది. 

ఆ సదస్సులకు వెళ్లొద్దని యువతకు హితవు చెప్పిన చంద్రబాబు, వెళితే జైల్లో పెడతామని కూడా భయపెట్టారు. ఇదంతా మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చనుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై, టీడీపీ సర్కారుపై జనాలకు ఎంత వ్యతిరేకత ఉంది, ఎంత అనుకూలత ఉంది తెలిసేది ఈ ఎన్నికల ద్వారానే. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక జరగబోతున్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే. తెలంగాణలో కేసీఆర్‌ పీఠం ఎక్కినప్పటినుంచి వరుసగా అనేక రకాల ఎన్నికలు జరగడం, ఆయన పార్టీ ఘన విజయాలు సాధించడంతో గులాబీ పార్టీకి ఎదురు లేదని తేలిపోయింది. 

చంద్రబాబు విషయంలో అలా తేలే అవకాశం రాలేదు. ఏపీలో ప్రత్యేక హోదా మాదిరిగా తెలంగాణలో ప్రజలు ప్రత్యేకంగా అభిప్రాయం వ్యక్తం చేయాల్సిన అంశమేదీ లేదు. కాని ఏపీలో చంద్రబాబు ప్రత్యేక హోదాను వదులుకోవడం సమ్మతమా? కాదా? అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేయాల్సిన అవసరముంది. అందుకోసం వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఆగాల్సిన అవసరం లేని పరిస్థితి వచ్చింది. ప్రజలకు స్థానిక సమస్యలు పరిష్కారం కావడంకంటే రాష్ట్రాభివృద్ధికి తద్వారా ముందు తరాల బంగారు భవిష్యత్తుకు దోహదం చేసే ప్రత్యేక హోదాయే ముఖ్యమనుకుంటున్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదాను సాధించలేకపోవడమో, వదులుకోవడమో చేశారనే బాధ కంటే రకరకాల మాటలు చెప్పి (కేంద్రంతో కలిసి) మోసం చేశారనే భావన ఎక్కువగా ఉంది.

ఇది మాత్రమే కాకుండా హైదరాబాద్‌పై ఏపీకి పదేళ్లపాటు హక్కు ఉండగా, చంద్రబాబు దాన్ని కూడా వదులుకుంటున్నారనే ఫీలింగ్‌ కలుగుతోంది. కేసీఆర్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికలను అలవోకగా నిర్వహించగా, చంద్రబాబు మున్సిపల్‌ ఎన్నికలపై తర్జనభర్జన పడుతున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలని మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మున్సిపోల్స్‌ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలకు సంకేతంగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ సర్వేలో దేశంలోనే బెస్ట్‌ సీఎంగా కేసీఆర్‌ నెంబర్‌ ఒన్‌ స్థానంలో నిలవగా, చంద్రబాబు ఏడో స్థానంలో (కొన్ని పత్రికల్లో 8వ స్థానమని వచ్చింది) ఉన్నారు. ఇదివరకటికంటే ఆయన గ్రాఫ్‌ పడిపోయింది. మరింత పడిపోయే ప్రమాదముందా?

Show comments