బీజేపీని.. ఈ తండ్రీ కొడుకులే గెలిపిస్తారులే!

సమాజ్ వాదీ పార్టీలో రచ్చ చల్లారేటట్టు కనిపించలేదు. 403 స్థానాలకు గానూ 325 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాడు ములాయం సింగ్ యాదవ్. ప్రకటించిన జాబితాలో అఖిలేష్ యాదవ్ సిఫార్సు జాబితాలో ఉన్న వారు 218 మంది. అయితే అఖిలేష్ ఇచ్చిన జాబితా నుంచి ఏకంగా 107 మంది పేర్లను తొలగించారు. వీరిలో ముగ్గురు మంత్రులు ఉన్నారు, యాభై మంది ఎమ్మెల్యేలు అఖిలేష్ కు గట్టి మద్దతుదార్లుగా ఉన్నారు.

అయితే.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కొడుకు మాట కంటే, అంతకు మించి తమ్ముడి మాటకు ఎక్కువ విలునిస్తున్న ములాయం.. ఈ జాబితాను ప్రకటించాడు. అయితే తండ్రితో ఢీ అంటే ఢీ అన్నట్టుగానే వ్యవహరిస్తున్న అఖిలేష్ ములాయంతో విబేధిస్తూ ఒక జాబితాను మీడియాలోకి వదిలాడు. ఈ జాబితాలో మొత్తం అఖిలేష్ టీమ్ ఉంది. దీన్ని అధికారికంగా అనౌన్స్ చేయలేదు!

మళ్లీ తండ్రీ కొడుకు బాబాయ్.. లు చర్చలు చేపట్టారు. తమలో తాము బహిరంగంగానే కలహించుకుంటున్న వీళ్లు.. ఇంట్లో కూర్చుని ఎలాంటి చర్చలు జరుపుతారో కానీ, తదుపరి ఏం జరగబోతోందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. 

తన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకపోతే.. అఖిలేష్ సమాజ్ వాదీని చీల్చడం ఖాయం అని చెప్పాలి. అలాగే.. కాంగ్రెస్ తో పొత్తు కోసం అఖిలేష్ తహతహలాడుతున్నాడు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును కలుపుకుంటే మేలు జరుగుతుందనేది అఖిలేష్ లెక్క. అయితే ములాయం మాత్రం పొత్తు ఆలోచనే లేదంటున్నాడు. 

ములాయంను కన్వీన్స్ చేయడంలో ఇప్పటికే అఖిలేష్ ఫెయిలయ్యాడు. మరి ఇప్పుడు ఏకంగా పొత్తు విషయంలోనూ, తన మద్దతుదారులైన వంద మంది విషయంలోనూ అఖిలేష్ తన తండ్రిని ఒప్పించడం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి అఖిలేష్ కు ముందున్నది ఒకటే మార్గం. పార్టీని చీల్చి, తన అభ్యర్థులను ప్రకటించుకుని.. కాంగ్రెస్ తో పొత్తును ఏర్పరుచుకుని ఎన్నికలకు వెళ్లడం! కానీ ఎన్నికలకు మరెంతో సమయం లేదు.. ఏ క్షణమైనా  నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇలాంటి సమయంలో అఖిలేష్ పార్టీని చీల్చే పంచాయితీ పెట్టుకుంటే.. మొత్తం గందరగోళమే!

ఇదే సమయంలో.. ములాయం కూడా ఏ మాత్రం సర్దుకుపోయే  తీరును కనబరచడం లేదు. అధికారంలో ఉన్న పార్టీ ఈ విధంగా అంతర్గత కలహాలతో రగులుతుండటం ప్రతిపక్ష పార్టీలకు వరప్రసాదం. ప్రత్యేకించి లోక్ సభ ఎన్నికల్లో యూపీలో అన్ని పార్టీల పీచమణిచిన బీజేపీకి ఇంతకు మించిన ఆనందం లేదు! 

Show comments