పాతనోట్ల మార్పిడికి మొత్తం వ్యవస్థనే జుర్రేశాడట!

ఒక్కసారిగా నోట్లరద్దు జరిగాకా.. మారకంలోని ఐదొందల, వెయ్యి రూపాయల నోట్లు చెల్లవని మోడీ ప్రకటన చేశాకా.. చాలామంది నల్లకుభేరుల పరిస్థితి అతలాకుతలం అయ్యింది. వందల, వేలకోట్ల రూపాయల నల్లధనాన్ని పోగేసుకున్న వాళ్లు అదిరిపడ్డారు. తీవ్రమైన టెన్షన్‌ పడ్డారు... అయితే అదంతా కొన్ని గంటలసేపు మాత్రమే. తర్వాత వాళ్లందరికీ మార్గాలు అగుపించాయి. తమిళనాడులోని శేఖర్‌రెడ్డి లాంటి నల్ల కుభేరుడికి డైరెక్టుగా ఆర్బీఐ నుంచే కొత్త నోట్లు వెళ్లాయి!

ఇలా ఎవరి శక్తి కొద్దీ వాళ్లు వ్యవహారాన్ని చక్కబెట్టుకున్నారు. చివరకు సామాన్యుడు ఇక్కట్ల పాలయ్యాడు. చేతిలో ఉన్న డబ్బును వాడుకోలేక, ఏటీఎంల నుంచి డబ్బు డ్రా చేసుకోలేక సామాన్యుడు విలవిల్లాడాడు. ఆ కథంతా తెలియనిది ఏమీకాదు. కానీ కొన్ని తెలియని కథలు మాత్రం చాలానే ఉన్నాయి. నల్లకుభేరులైన రాజకీయ నేతలు తమ చేతిలోని అధికారాన్ని, దర్పాన్ని ఉపయోగించుకుని తమ నల్లధనాన్ని తెల్లధనంగా చేసుకున్నారు. పాత నోట్లను కొత్త నోట్లుగా చేసుకున్నారు. అలాంటి ఒక సీమనేత కథ ఇది.

మారకంలోని ఐదొందల, వెయ్యినోట్లు రద్దు అయ్యాకా.. ఈయనగారూ చాలా టెన్షన్‌ పడ్డారు. ఎంపీ హోదాలోని మనిషి. వేలకోట్లకు అధిపతి, నోరు చాలా పెద్దది! అయితే అంతలోనే ఈయనకు మార్గాలు గోచరించాయి. జనాల చేతుల్లోకి వెళ్లిన కొత్తనోట్లన్నింటినీ తిరిగి తన ఇంట చేరే వ్యూహాన్ని అమల్లో పెట్టాడు ఈ మేధావి. తన నియోజకవర్గ పరిధిలోని ఆర్టీసీ డిపోలు, మెడికల్‌ షాపులు, ఇతర ఎమర్జెన్సీ సర్వీసులు.. వీటి గల్లాపెట్టెల్లోకి వచ్చిన ప్రతి కొత్తనోటూ తన ఇంటికి చేరాలి. వాటి స్థానంలో పాతనోట్లు ఆ నేతాశ్రీ ఇంటి నుంచి అందుతాయి! ఆర్టీసీ, మెడికల్‌ సర్వీసులు, కొన్ని ఎమర్జెన్సీ సర్వీసులకు పాతనోట్ల మారకం విషయంలో ప్రతిబంధకాలు లేని విషయం తెలిసిందే. అయితే.. అక్కడికీ కొత్త నోట్లెన్నో ఆయా ఖాతాల్లోకి వచ్చి చేరాయి. అలా వచ్చినవి బ్యాంకుల్లో డిపాజిట్‌ కాలేదు. అవన్నీ ఆ సీమ నేత ఇంటికి వెళ్లాయి. ఆ నేత ఇంటి నుంచి పాతనోట్లు వస్తాయి. ఆ నోట్లే తమ వద్దకు వచ్చినట్టుగా చూపుతాయి ప్రభుత్వ వ్యవస్థలు!

ఈ విధంగా ఆ యాభై రోజుల్లోనే ఈ నేతగారు కొన్ని వందల కోట్ల రూపాయల పాతనోట్లను బయటకు తోలి, ప్రభుత్వ వ్యవస్థల్లోకి వచ్చిన కొత్త నోట్లను తన ఇంటికి మళ్లించుకున్నట్టుగా సమాచారం. నియోజకవర్గ పరిధిలో తన మాటకు ఎదురుచెప్పగల ప్రభుత్వాధికారులు లేరాయె. అక్కడ ప్రతిపక్షమూ వీకే, ఆయన చేతిలో అధికారం ఉంది. దీంతో వ్యవహారమూ సాఫీగా జరిగిపోయింది. అదీ వందలకోట్ల రూపాయల పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చుకున్న వైనం. మళ్లీ నీతులు చెప్పమంటే, గౌతమబుద్ధుడి కన్నా గట్టిగా చెబుతాడు సదరు నేతాశ్రీ! Readmore!

Show comments

Related Stories :