మహాత్మాగాంధీ, బి.ఆర్.అంబేద్కర్.. ఇప్పుడు ఈ ఇద్దరూ జీవించి వుంటే, ఈ ఇద్దరూ 'ఎవరు గొప్ప.?' అన్న విషయమై రోడ్డునపడి మరీ కొట్టుకోవాలేమో.! ఎందుకంటే, మహాత్మాగాంధీ కన్నా అంబేద్కర్ గొప్ప.. అంటూ కొత్త వివాదానికి తెరలేపారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల పిల్లిమొగ్గలేయడంలో ఒవైసీ దిట్ట. వివాదాల్ని కొనితెచ్చుకోవడం, తద్వారా పబ్లిసిటీ చేసుకోవడం ఆయనకి అలవాటే.
కొన్ని రాష్ట్రాల్లో ఒవైసీకి ప్రవేశం కూడా 'నిషేధం' అప్పుడప్పుడూ తెరపైకి వస్తుంటుందంటే దానికి కారణం ఆయన చేష్టలే. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియా అటెన్షన్‌ని పొందే ఒవైసీ, తాజాగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ మహాత్మాగాంధీకీ, బీఆర్ అంబేద్కర్‌కీ మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. మహాత్మాగాంధీ జాతిపిత. బీఆర్ అంబేద్కర్ - రాజ్యాంగ రూపకర్త. ఇద్దరిలో ఎవరు ఎక్కువ.? అన్న చర్చకు ఆస్కారమే లేదు.
నిజానికి, మహాత్మాగాంధీ లేకపోతే దేశానికి స్వాతంత్య్రం వచ్చేదా.? అన్న ప్రశ్నకి ముందు ఒవైసీ సమాధానమివ్వాలి. భారతావనికి స్వాతంత్య్రమే లేకపోతే ప్రజాస్వామ్యమెక్కడిది.? రాజ్యాంగమెక్కడిది.? అయినా, టెర్రరిస్టులకి న్యాయస్థానం మరణ శిక్ష విధిస్తే, దాన్ని కూడా ప్రశ్నించి వివాదాల్లోకి ఎక్కే అసదుద్దీన్ ఒవైసీకి మహాత్మాగాంధీ గురించిగానీ అంబేద్కర్ గురించిగానీ మాట్లాడే నైతిక హక్కు వుందని అనుకోలేం.