అమిత్‌ షా 'శూన్యం'పై చంద్రబాబేమంటారో.!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ శూన్యతను కనుగొన్నారు. కామెడీకే పరాకాష్ట అనుకోవాలో, ఇంకేమన్నా అనుకోవాలో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది, ఆయన వ్యాఖ్యలతో. 

అధికార పార్టీ సమర్థవంతంగా పనిచేయనప్పుడు, ప్రతిపక్షానికి ఆ అసమర్థతను ప్రశ్నించే సీన్‌ లేనప్పుడు మాత్రమే రాజకీయ శూన్యత కన్పిస్తుంది మామూలుగా అయితే. ఇక్కడ అధికారంలో వున్నది బీజేపీ - టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం. బీజేపీ నేతల మాటల్లో చెప్పాలంటే 'ఎన్డీయే కూటమి' అధికారంలో వుంది ఆంధ్రప్రదేశ్‌లో. పేరుకి చంద్రబాబు సర్కార్‌.. కానీ, అందులో తమకూ భాగం వుందని బీజేపీనే పదే పదే చెబుతుంటుంది. అలాంటప్పుడు, బీజేపీనే స్వయంగా రాజకీయ శూన్యతను ఆంధ్రప్రదేశ్‌లో కనుగొందంటే, దానర్థమేంటి.? 

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ శూన్యత వుంది గనుక, భారతీయ జనతా పార్టీ గట్టిగా పనిచేసి, ఆంధ్రప్రదేశ్‌లో నిలదొక్కుకోవాలని ఢిల్లీలో జరిగిన కోర్‌ కమిటీ సమావేశంలో ఏపీ బీజేపీ నేతలకు అమిత్‌ షా క్లాస్‌ తీసుకున్నారు. అంటే, బహుశా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఆయన సెలవిచ్చారేమో.! ఏదో అదృష్టం కలిసొచ్చి, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ గత ఎన్నికల్లో తన ఉనికిని చాటుకుంది. అన్నిసార్లూ బీజేపీకి ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో ఫలితాలొస్తాయనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటుండదు. 

ఒక్కటి మాత్రం నిజం.. చంద్రబాబు అసమర్థతను బీజేపీ క్యాష్‌ చేసుకుంటోంది. విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన హామీలేవీ కార్యరూపం దాల్చడంలేదు. అయినా, చంద్రబాబు వాటిని ప్రశ్నించరు. ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తే, బీజేపీ నేతలకీ రోషం పుట్టుకొచ్చేస్తుంటుంది. మిత్రపక్షం టీడీపీ ప్రశ్నించినా అంతే సంగతులు. కేంద్రంలో తనకున్న అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అలా అలా నెట్టుకొచ్చేస్తోందంతే. 

కానీ, 2019 ఎన్నికల నాటికి పరిస్థితులు ఇలాగే వుండవు. చాలా ప్రశ్నలు దూసుకెళ్తాయి బీజేపీ మీదకి. ఇప్పటికే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వున్న బీజేపీ, 2019 ఎన్నికల నాటికి గాయబ్‌ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ శూన్యతను గురించి అమిత్‌ షా మాట్లాడిన దరిమిలా, ఆ శూన్యతపై బీజేపీ మిత్రపక్షం టీడీపీ.. ముఖ్యంగా టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించాలి కదా.? స్పందిస్తారా మరి.!

Show comments