గత ఏడాది విశాఖ వేదికగా జరిగిన ‘భాగస్వామ్య సదస్సు’లో నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పై స్థాయి విలువైన పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకున్నట్టుగా ఏపీ ప్రభుత్వం ఒకటికి వెయ్యి సార్లు ప్రకటించింది. ఇది అద్భుత పరిణామం అని ప్రకటించింది. ఇది చంద్రబాబు ఘనతగా పేర్కొన్నారు. అనుకూల మీడియా అయితే ఇది అనితర సాధ్యం అని.. రాష్ట్రానికి పెట్టుబడుల వరద వచ్చిందని యథారీతిన రెచ్చిపోయింది.
చివరకు ఈ అంశం గురించి ఆర్టీఐ ద్వారా ఆరా తీస్తే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం నివ్వెరపోయేలా చేసింది. 4.37 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు జరిగాయని పైకి ప్రకటించిన ప్రభుత్వం, వీటిల్లో కార్యచరణలోకి వచ్చి ఒప్పందం ఒకటీ లేదని స్పష్టం చేసింది. నాలుగు లక్షల కోట్లు అని చెప్పి అందులో కనీసం కోటి రూపాయల ఒప్పందం కూడా కార్యక్షేత్రం వరకూ రాలేదని చెప్పడం ద్వారా ప్రభుత్వం తన సిగ్గులేని తనాన్ని తనే ఒప్పుకుంది. సమాచార హక్కు చట్టం పుణ్యమా అని అసలు బండారం బయట పడింది.
మరి ఇంత జరుగుతున్న… ప్రభుత్వ సిగ్గులేని తనం గురించి, పెట్టుబడుల కట్టుకథల గురించి ప్రతిపక్షాలు, ప్రజాపక్షాలూ ప్రశ్నిస్తున్నా… మరోసారి అలాంటి ఆర్భాటానికే రెడీ అవుతోంది ఏపీ ప్రభుత్వం. ఈ నెల ఇరవై ఏడో తేదీ నుంచి విశాఖ వేదికగా మళ్లీ భాగస్వామ్య సదస్సు అంటూ ప్రకటించేశారు. గతసారికి మించి ఈ సారి సాధించేస్తాం అంటున్నారు. ఈ సారి ఎనిమిది లక్షల కోట్లు అనే నంబర్ ను చెబుతున్నారు!
నాలుగు లక్షల కోట్లు అంటే సంతృప్తి కలగనట్టుంది.. అందుకే ఈ సారి ఏకంగా ఎనిమిది లక్షల కోట్లు అంట! అయినా దివాళాకోరు తనానికి, ప్రచార ఆర్భాటానికి ఒక హద్దంటూ లేకుండాపోతున్నట్టుంది. అసలు గుట్టు బయటపడుతున్నా.. ఇలాంటి ప్రహసనాలు చేయడమా!